వన నేషన్ – వన్ ఎలక్షన్ అనే విషయంలో చాలా కాలంగా అనేక రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహించాలనే జమిలి ఎన్నికల ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు పచ్చజెండా ఊపారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఈ చర్యపై వివిధ రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో ప్రభుత్వం విస్తృత సంప్రదింపులకు సిద్ధమవుతోంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో జమిలి ఎన్నికలపై ఏర్పాటైన కమిటీ గతంలో 18,000 పేజీల నివేదికను రాష్ట్రపతికి సమర్పించింది. ఈ నివేదికలో ఎన్నికల నిర్వహణకు రెండు దశల ప్రణాళికను సూచించారు. మొదటిగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలని, ఆ తర్వాత 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేయాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.
జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 30కిపైగా రాజకీయ పార్టీలు మద్దతు తెలపగా, కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ఒకే సమయంలో ఎన్నికలు ఆచరణీయమేమీ కాదని కాంగ్రెస్ అభిప్రాయపడుతోంది. విభిన్న అవసరాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడం అవసరమని, ప్రజాస్వామ్యానికి ఇదే సరైన మార్గమని కాంగ్రెస్ వాదిస్తోంది.
ఇప్పటి వరకు జమిలి ఎన్నికలపై వ్యతిరేకత, మద్దతు రెండూ కూడిన చర్చలు కొనసాగుతున్నాయి. బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్లతో పాటు, అన్ని పార్టీల ప్రతినిధులతో ప్రభుత్వం చర్చలు జరిపేందుకు సిద్ధమవుతోంది. జమిలి ఎన్నికల బిల్లుపై శీతాకాల సమావేశాల్లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.