జ‌న‌వ‌రి నుంచి కూట‌మి స‌ర్కార్ గేర్ మారుస్తోందా…!

రాష్ట్రంలోని కూట‌మిస‌ర్కారు మ‌రింత దూకుడు పెంచ‌నుంది. ఇప్ప‌టి వ‌రకు జ‌రిగిన పాల‌న ఒక ఎత్తయితే.. ఇక నుంచి మ‌రింత దూకుడు పెంచాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. రాష్ట్రంలో కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి ఆరు మాసాలు అయిపోయింది. అయితే.. చంద్ర‌బాబు అనుకున్న విధంగా అయితే.. ప్ర‌జ‌ల్లో చ‌ర్చ రావ‌డం లేదు. దీంతో ఆయ‌న జ‌న‌వ‌రి నుంచి పాల‌న ప‌రంగా దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించారు. ఇదే విష‌యాన్ని పార్టీ నాయ‌కుల‌తో స్ప‌ష్టం చేశారు. ఇక‌, తాజాగా క‌లెక్ట‌ర్ల‌కు కూడా కూట‌మి ప్రాధాన్యాలు మ‌రింత లోతుగా వివ‌రించ‌నున్నారు.

ఏం జ‌రుగుతుంది…జ‌న‌వ‌రి నుంచి పాల‌న ప‌రంగా స‌రికొత్త నిర్ణ‌యాలు తీసుకునే దిశ‌గా సీఎం చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ప్ర‌ధానంగా సూప‌ర్ సిక్స్ విష‌యంలో ఆర్టీసీ బ‌స్సుల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం క‌ల్పించ‌డం ద్వారా.. ప‌థ‌కాల‌పై కూట‌మి స‌ర్కారు నిబ‌ద్ధ‌త‌ను వెల్ల‌డించ‌నున్నారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ సిక్స్ అమ‌లు చేయ‌డంలేద‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వీటిని అడ్డుకుంటే త‌ప్ప‌.. ప్ర‌భుత్వంపై సానుకూల దృక్ఫ‌థం వ‌చ్చే అవ‌కాశం లేద‌ని భావిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో సూప‌ర్ సిక్స్‌లో కీల‌క‌మైన ఆర్టీసీని వ‌చ్చే నెల‌లోనే ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అదేస‌మ‌యంలో.. అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణాల‌ను ప‌రుగులు పెట్టించ‌నున్నారు. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌ణాళిక‌లు కూడా పూర్త‌య్యాయి. గ‌తంలో ఇచ్చిన టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేసి.. ఇప్పుడు కొత్త‌గా టెండ‌ర్ల‌ను పిలుస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి నుంచి ప‌నులు ప్రారంభించ‌నున్నారు. అదేవిదంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభ‌మైనా.. జ‌న‌వ‌రిలో దిగువ కాఫ‌ర్ డ్యాం నిర్మాణ ప‌నుల‌కు సీఎం శ్రీకారం చుట్ట‌నున్నారు.

మ‌రోవైపు.. జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి డిజిట‌ల్ పాల‌న‌ను మ‌రింత పెంచ‌నున్నారు. దీనిలో భాగంగా వాట్సా ప్ సేవ‌ల‌నుఅందుబాటులోకి తీసుకువ‌స్తారు. త‌ద్వారా.. ఇప్ప‌టి వ‌ర‌కు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వారికి ఉప‌శ‌మ‌నం క‌ల్పించ‌నున్నారు. అదేవిధంగా జ‌న‌వ‌రి నుంచి రేష‌న్ బియ్యం స్థానంలో సొమ్ములు ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న‌ను ప్ర‌యోగాత్మ‌కంగా శ్రీకాకుళం, అనంత‌పురం జిల్లాల్లో అమ‌లు చేయాల‌ని చూస్తున్నారు. అలాగే.. కొత్త జిల్లాల పై ప్ర‌జ‌ల నుంచి మ‌రోసారి అభిప్రాయాల‌ను సేక‌రించ‌నున్నారు. మెజారిటీ ప్ర‌జ‌ల అభిప్రాయం మేర‌కు నిర్ణ‌యం తీసుకుంటారు. ఇలా.. జ‌న‌వ‌రి నుంచి పాల‌నా ప‌రంగా దూకుడు పెంచే దిశ‌గా చంద్ర‌బాబు అడుగులు వేస్తుండ‌డం గ‌మ‌నార్హం.