వన్ నేషన్ – వన్ ఎలక్షన్.. ఈసారైనా ?

వన్ నేషన్ – వన్ ఎలక్షన్ పై చాలా కాలంగా పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారుతున్న విషయం తెలిసిందే. ఆయితే ప్రతీసారి ఏదో ఒక కారణంగా దీనిపై కేంద్రం రిస్క్ తీసుకోలేకపోతోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు (వన్ నేషన్ – వన్ ఎలక్షన్) గురించి చర్చ నెలకొంది. ఎన్డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే యోచనతో బిల్లును ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది.

గతంలో మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా కేంద్రం బిల్లుకు రూపకల్పన చేసింది. ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం లభించగా, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమిలి ఎన్నికల బిల్లుకు పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం. కానీ, లోక్‌సభలో 364 సీట్లు, రాజ్యసభలో 164 సీట్లు సాధించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం దాన్ని సాధ్యం కాకుండా చేస్తోంది.

అందువల్లే బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపి విస్తృత చర్చలు చేపట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. జమిలి ఎన్నికల ప్రాధాన్యతను వివరిస్తూ, విభిన్న పార్టీలను ఏకాభిప్రాయానికి రప్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోంది. మరోవైపు, బీఎస్పీ జమిలి ఎన్నికలకు మద్దతు తెలుపుతుండగా, ఇండియా కూటమి పార్టీలన్నీ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా బీజేపీకి తగిన సంఖ్యాబలం లేదని బిల్లు పార్లమెంట్‌లో ముందుకు సాగదని పేర్కొంటోంది.

కానీ బిల్లును పరిచయం చేయడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందడానికే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక అన్ని పార్టీలను సంప్రదించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంతో, జమిలి బిల్లుకు సంబంధించిన చర్చ మరింత ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఈ బిల్లు పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై చర్చ మిన్నంటుతోంది. బిల్లును ప్రవేశపెట్టడమేనా, లేక విస్తృత చర్చల కోసం వెనక్కి తీసుకుంటారా అన్నది కేంద్రం తీర్పుపై ఆధారపడి ఉంది.