తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి..ఎమోషనల్ జర్నీ

‘‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..మా కన్నతల్లికి మంగళారతులు….’’అంటూ ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగువారంతా గర్వంగా పాడుకునేవారు. అయితే, తెలుగు భాష మాట్లాడే కోట్లాది మంది ప్రజలున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్….ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన తర్వాత తెలుగు తల్లి కూడా తెలుగు తల్లి, తెలంగాణ తల్లిగా విడిపోయింది. అయితే, రెండు రాష్ట్రాలలో తెలుగు మాట్లాడుతున్నప్పుడు తెలుగు తల్లి..తెలంగాణ తల్లిగా మారాల్సిన అవసరం లేదని అప్పట్లో కొందరు అభిప్రాయపడ్డారు.

తెలుగు తల్లి ఒక్కటే ఉండాలని…రాష్ట్రం విడిపోయినంత మాత్రాన తెలుగు తల్లిని విడగొట్టాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే తెలంగాణ తల్లి కావాల్సిందేనని ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏర్పాటు చేసింది.

అయితే, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి రూపం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అణుగుణంగా లేదని కాంగ్రెస్ నేతలు భావించారు.ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపంలో మార్పులు చేర్పులు చేశారు.

తెలంగాణ సచివాలయం ఆవరణలో తెలుగు తల్లి నూతన విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు అట్టహాసంగా ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ జాతి భావనకు జీవం పోసిందని, మన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంలా ఉందని రేవంత్ రెడ్డి అన్నారు.

ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుగుతాయని ఆయన ప్రకటించారు. బంగారు అంచుతో కూడిన పచ్చటి చీర, ఎరుపు రంగు జాకెట్, నుదుటన తిలకంతో సగటు తెలంగాణ మహిళను ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి రూపం ఉంది.

చేతిలో మొక్కజొన్న, వరి, జొన్న సజ్జలను ఉంచగా…విగ్రహం కింద గద్దెపై బిగించిన పిడికిళ్లు ఉన్నాయి. ఐదున్నర కోట్లు ఖర్చు చేసి 17 అడుగుల కాంస్య విగ్రహం, మరో 3 అడుగులతో కింది గద్దె రూపొందించారు. ఈ విగ్రహం పరిసరాల్లో ఫౌంటెయిన్, పచ్చిక బయళ్లను అందంగా ముస్తాబు చేశారు. జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లి నూతన విగ్రహం రూపకల్పన చేశారు.

ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం కాంస్య విగ్రహాన్ని తయారు చేసింది. ఈ క్రమంలోనే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ పేరును తెలంగాణ తల్లిగా మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శాసన మండలిలో అభిప్రాయపడ్డారు.