ఏ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ పార్టీలోకి జంప్ చేసేందుకు రాజకీయ నేతలు రెడీగా ఉంటున్న సమ యం ఇది. పార్టీలతోనూ.. నాయకులతోనూ సంబంధం లేకుండానే అధికారంలోఉంటే చాలు.. అన్నట్టుగా అన్నీ వదిలేసి వచ్చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగు దేశం పార్టీకే తన జీవితం అంకితం అని ప్రకటించుకున్నవారు కూడా.. తర్వాత కాలంలో ఆ పార్టీకి రాంరాం చెప్పి.. వైసీపీ పంచన.. అంతకుముందు.. కాంగ్రెస్ పంచన చేరిపోయిన వారు ఉన్నారు. ఇక, జగనే నా ప్రాణం అని కూనిరాగాలు తీసిన వారు కూడా.. జల్ల కొట్టి.. జెండా మార్చేసిన పరిస్థితులు కనిపిస్తూనే ఉన్నాయి.
మొత్తంగా .. పార్టీలు మారేందుకు ఉన్న ఏకైక పరమావధి.. అధికారమే. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అనేక మంది నాయకులు వైసీపీ నుంచి వచ్చి.. టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు వంటిపలువురు నాయకులు చేరిపోయారు. ఇక, ఇప్పుడు మరింత మంది చేరేందుకు రెడీగా ఉన్నారన్న సమాచారం హల్చల్ చేస్తోంది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు తనను తాను ఆత్మ పరిశీలన చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు వచ్చిన వారికి, ఇక, నుంచి వచ్చేవారికి మధ్య వ్యత్యాసం ఉంది. ఇప్పటి వరకు వచ్చిన వారు అంతో ఇంతో పదవుల్లో ఉన్నవారే. దీంతో వారి పదవులు వదులుకుని వచ్చారు కాబట్టి.. చంద్రబాబు ఆలోచన చేశారు. కానీ, ఇప్పుడు వస్తున్నవారు కేవలం టీడీపీ కూటమి సర్కారు పదవుల కోసమో.. లేక అధికారాన్ని అడ్డుపెట్టుకునేందుకో వస్తున్నట్టు చంద్రబాబు గుర్తించారు. దీంతో కొత్తగా వచ్చేవారికి ఇష్టాను సారంగా పచ్చ జెండా ఊపరాదని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
ఇదే సమయంలో పార్టీ మారి వచ్చే నాయకుల గ్రాఫ్‌ను కూడా చంద్రబాబు పరిశీలిస్తున్నారు. వీరివల్ల పార్టీలో చిచ్చు రేగదు కదా! అనే కోణంలోనూ ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా కోవర్టులుగా ప్రవేశించే వారి విషయంలో జాగ్రత్తలు పడుతున్నారు. ఇక, తమ వారి అభిప్రాయాలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలనకు తీసుకుంటున్నారు. మొత్తంగా చూస్తే.. చేరికల విషయంలో చంద్రబాబు చాలానే లెక్కలు వేసుకుంటుండడం గమనార్హం.