కాకినాడ చిచ్చు: కూట‌మి vs వైసీపీ స‌వాళ్ల ప‌ర్వం

కాకినాడ‌లో ప‌దిహేనేళ్ల కింద‌ట వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో ఏర్పాటు చేసిన స్పెష‌ల్ ఎక‌న‌మిక్ జోన్‌(ఎస్ ఈజెడ్‌) వ్య‌వ‌హారం.. ఇప్పుడు రాజ‌కీయ వివాదాల‌కు కేంద్రంగా మారింది. ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో వైసీపీ నాయ‌కులు భూములు అక్ర‌మంగా తీసుకున్నార‌ని.. కూట‌మి లో టీడీపీ, జ‌న‌సేన‌ పార్టీల నాయ‌కులు ఆరోపించిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని గ‌త రెండు రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా మారింది.

ఎస్ ఈ జెడ్ ప‌రిధిలో కొన్ని భూముల‌ను వైసీపీ నాయ‌కులు బ‌ల‌వంతంగా రాయించుకున్నార‌ని.. జ‌న‌సేన నాయ‌కులు తొలుత ఆరోపించారు. ఆ త‌ర్వాత‌.. దీనికి టీడీపీ నేత‌లు తోడ‌య్యారు. వైసీపీకి చెందిన కుర‌సాల క‌న్న‌బాబు, దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగా గీత‌కు చెందిన అనుచ‌రులు కొనుగోలు చేశార‌ని ఆరోపించారు. ఆయా భూముల విలువ ఇప్పుడు రూ.కోట్ల‌కు చేరింద‌ని.. ఉద్దేశ పూర్వ‌కంగా భూములు రాయించుకున్న వీరిని అరెస్టు చేయ‌డంతోపాటు.. ఆయా భూముల‌ను వెన‌క్కి తీసుకోవాల‌న్న‌ది కూట‌మి నాయ‌కుల డిమాండ్‌.

ఈ విష‌యంపై కూట‌మి ప్ర‌భుత్వం దృష్టి పెట్టింది. అయితే.. ఆ వెంట‌నే జోక్యం చేసుకున్న కుర‌సాల క‌న్న‌బాబు, దాడి శెట్టి రాజా, వంగా గీత‌లు మీడియా ముందుకు వ‌చ్చారు. తాము అన్ని రుసుములు చెల్లించి కొనుగోలుచేశామ‌ని.. దీనిలో అక్ర‌మాలు లేవ‌న్నారు. దాడి శెట్టి రాజా తాను నాలుగు ఎక‌రాలు కొన్నాన‌ని.. త‌ప్పేముంద‌ని చెప్పారు. అయితే.. ఎస్ ఈజెడ్‌కు కేటాయించిన స్థ‌లంలో వ్యాపార స‌ముదాయాలు పెట్టేవారు మాత్ర‌మే ముందుకు రావాల్సి ఉంటుంది. ఇత‌రులు భూములు కొనుగోలు చేయ‌డానికి వీల్లేదు.

ఈ పాయింట్ మీదే.. కూట‌మి నాయ‌కులు ప్ర‌శ్న‌లు గుప్పిస్తున్నారు. తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే.. ఎన్ వీఎస్ ఎస్ వ‌ర్మ‌(ప‌వ‌న్ కోసం పిఠాపురం సీటును త్యాగం చేశారు) మీడియా ముందుకు వ‌చ్చారు. స్వ‌లాభం కోస‌మే.. వైసీపీ నాయ‌కులు భూములు కొనుగోలు చేశార‌ని.. కాద‌ని నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు. వారి బినామాల‌తో భూములు కొనుగోలు చేయించార‌ని విమ‌ర్శించారు. దీనిపై ఉప్పాడ జంక్ష‌న్‌లో చ‌ర్చ‌కు రావాల‌ని ఆయ‌న స‌వాల్ రువ్వారు.

సోమ‌వారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు తాను అక్క‌డ‌కు వ‌స్తున్నాన‌ని.. ద‌మ్ముంటే.. త‌ప్పు చేయ‌క‌పోతే.. వైసీపీ నాయ‌కులు రావాల‌ని ఆయ‌న బ‌హిరంగ స‌వాల్ విసిరారు. దీనిపై వైసీపీ నాయ‌కులు కూడా రియాక్ట్ అయ్యారు. ద‌మ్ముంటే.. కూట‌మి ప్ర‌భుత్వం ఎస్ ఈజెడ్‌ను ర‌ద్దు చేయాల‌ని స‌వాల్ రువ్వారు. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. స‌వాళ్ల విష‌యం త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. ఇరు ప‌క్షాల‌ను ఉప్పాడ జంక్ష‌న్‌కు రానివ్వ‌బోమ‌ని పోలీసు అధికారులు తెలిపారు.