ఏపీలో కూటమి ప్రభుత్వానికి నేత్రాల్లాంటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ భేటీ అయ్యారు. అమరావతి పరిధిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి.. అనేక అంశాలపై ఆయనతో చర్చిస్తున్నారు. ప్రధానంగా ఢిల్లీ పర్యటన, రాజ్యసభ సీట్ల పంపిణీ, కాకినాడ పోర్టులో ఇటీవల తాను పర్యటించినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలు వంటివాటిపై సీఎం చంద్రబాబుకు ఆయన మరింత విశదీకరించి వివరించనున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. ఇతరత్రా అంశాలపై చర్చించారు. ఈ విషయాలను సీఎంకు వివరిస్తారు. అదేవిధంగా రాజ్యసభకు సంబంధించి కూటమి పక్షాన తన సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును పెద్దల సభకు పంపించాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిన విషయమే. దీనిపైనా సీఎం చంద్రబాబుకు ఆయన వివరిస్తారు.
మరీ ముఖ్యంగా కాకినాడ పోర్టులో ఇటీవల పవన్ కల్యాణ్ పర్యటించినప్పుడు జిల్లా ఎస్పీ సెలవుపై వెళ్లిన ఘటన పార్టీపరంగానే కాకుండా.. వ్యక్తిగతంగా కూడా పవన్‌కు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా ఎస్పీని బదిలీ చేసే విషయంపై పవన్ పట్టుబట్టే అవకాశం ఉంది. అదేవిధంగా కాకినాడ పోర్టులో జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను నిలువరించేదుకు కృషి చేయడంతోపాటు.. పోర్టు కార్యకలాపాలపై కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పిన నేపథ్యంలో పవన్ దీనికి సంబంధించి సీఎం నుంచి క్లారిటీ తీసుకుంటారు.
ఇక, పోర్టు కార్యకలాపాల్లో కూటమి పార్టీలకు చెందిన పలువురు నాయకులు కూడా ఉన్నారన్న వార్తలు, విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ఆయా విషయాలను కూడా సీఎం చంద్రబాబుకు చెప్పడం ద్వారా వారిపైనా చర్యలకు ఆయన డిమాండ్ చేసే అవకాశం ఉంది. ముందు సొంత నేతలను కట్టడి చేయడం ద్వారా తర్వాత.. వైసీపీ నాయకులను అదుపులో పెట్టొచ్చన్నది డిప్యూటీ సీఎం భావనగా ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఆయన భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి భోజనం కూడా చేయడం విశేషం.
Gulte Telugu Telugu Political and Movie News Updates