జ‌గ‌న్‌ కేసులు : సుప్రీంకోర్టు షాకింగ్ ఆర్డ‌ర్స్‌

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు భారీ షాక్ త‌గిలింది. జ‌గ‌న్‌పై న‌మోదైన అక్ర‌మ ఆస్తుల కేసుల‌కు సంబంధించి సుప్రీం కోర్టు తాజాగా షాకింగ్ ఆర్డ‌ర్స్ జారీ చేసింది. ఆయా అక్ర‌మ ఆస్తుల కేసుల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల‌ను త‌మ‌కు రెండు వారాల్లోగా అందించాల‌ని సీబీఐ, ఈడీల‌కు స్ప‌ష్టం చేసింది. వీటితోపాటు తెలంగాణ హైకోర్టు స‌హా.. సీబీఐ, ఈడీ కోర్టులలో ఉన్న డిశ్చార్జ్‌ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని సంబంధిత అధికారుల‌ను ఆదేశించింది.

ప్ర‌ధానంగా జ‌గ‌న్ త‌ర‌ఫు న్యాయ వాదులు తెలంగాణ హైకోర్టులో దాఖ‌లుచేసి.. ప్ర‌స్తుతం విచార‌ణ ద‌శ‌లో ఉన్న పెండింగ్ పిటిష‌న్ల వివ‌రాల‌ను త‌మ‌కు అందించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది. సీబీఐ, ఈడీ కేసులను స‌వివ‌రంగా త‌మ‌కు జాబితా రూపంలో అందించాల‌ని ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. దీనికి రెండు వారాల‌కు మించి స‌మ‌యం ఇవ్వ‌లేమ‌ని కూడా సుప్రీంకోర్టు స్ప‌స్టం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ మొత్తం ప్ర‌క్రియ‌ను ఆషామాషీగా(డోన్ట్ టేక్ ఇట్ లూజ్) తీసుకోవ‌ద్ద‌ని కూడా కోర్టు స్ప‌ష్టం చేయ‌డంవిశేషం.

అస‌లేం జ‌రిగింది…?

మాజీ ఎంపీ, ప్ర‌స్తుత ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు గ‌తంలో జ‌గ‌న్‌పై సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. ఆయ‌న కేసుల‌కు సంబంధించి విచార‌ణ ప‌దేళ్లు అయినా.. పూర్తికాలేద‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఆయా కేసుల విచార‌ణ‌ను తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బ‌దిలీ చేయాల‌ని అభ్య‌ర్థించారు. అయితే.. ఈ పిటిష‌న్‌పైనా విచార‌ణ ఆల‌స్య‌మైంది. అప్ప‌ట్లో జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓకా ధర్మాసనం ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌ చేపట్టింది.

ఈ క్ర‌మంలోనే ‘డే టు డే’ పద్ధతిలో తెలంగాణ కోర్టులో ఈ కేసుల విచార‌ణ జ‌రుగుతున్న‌విష‌యాన్ని తెలుసుకున్న కోర్టు.. అయిన‌ప్ప‌టికీ.. విచార‌ణ ఎందుకు ఆల‌స్య‌మ‌వుతోంద‌ని నిల‌దీసింది. డిశ్చార్జ్‌, వాయిదా పిటిషన్లు, హై కోర్టులో విచారణ పెండింగే కారణమన్న ర‌ఘురామ త‌ర‌ఫున లాయ‌ర్ల వాద‌న‌ల‌తో ఏకీభ‌వించిన సుప్రీంకోర్టు.. సంబంధిత కేసుల వివ‌రాల‌ను త‌మ‌కు ఇవ్వాల‌ని ఆదేశించింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 13కు వాయిదా వేసింది.