ఫలితం ముందే ఫిక్స్ అయిన వేళ.. సదరు ఎన్నిక మీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిస్థితి ఇలానే ఉంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కమ్ మాజీ ఎంపీ కవిత బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో ఆమె గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది. 824 మంది ఓటర్లు ఉన్న ఈ ఎన్నికల్లో మెజార్టీ ఓటర్లు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావటంతో ఆమె గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యింది. బరిలో కాంగ్రెస్.. బీజేపీ అభ్యర్థులు ఉన్నా.. గెలుపు మాత్రం కవిత ఖాతాలోనే పడనుంది.
అయితే.. ఈ ఉప ఎన్నిక సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఒక పోలింగ్ కేంద్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే.. ఇది అలాంటి ఇలాంటి పోలింగ్ కేంద్రం కాదు. కోవిడ్ తో బాధ పడుతున్న వారి కోసం ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం. ఎన్నికల వేళ కోవిడ్ కోసం కూడా పోలింగ్ కేంద్రమా? అన్న క్వశ్చన్ రావొచ్చు. కొన్ని ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం. అందుకే.. ఇలాంటి ఏర్పాటు చేస్తున్నారు.
ఓటు వేసేందుకు వచ్చే కరోనా ప్రజాప్రతినిధులంతా పీపీఈ కిట్ తో అంబులెన్స్ లో పోలింగ్ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. అంతేకాదు.. అందుకు ప్రత్యేక సమయాన్ని నిర్ణయించారు. సాయంత్రం నాలుగు గంటలకు కరోనాతో ఇబ్బంది పడుతున్న 24 మందిని ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తారు. కరోనా సోకిన పోలింగ్ నాటికి 14 రోజులు పూర్తి అయితే వారిని సాధారణ ఓటర్లుగా పరిగణిస్తారు. అందుకు భిన్నంగా ఉంటే మాత్రం.. వారిని కరోనా పేషెంట్లుగా డిసైడ్ చేసి.. ప్రత్యేక జాగ్రత్తలతో ఓటు వేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు.
అంతా బాగుంది కానీ.. ఈ కోవిడ్ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బంది ధైర్యానికి మాత్రం హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ పోలింగ్ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు వచ్చే అధికారులు.. సిబ్బందికి ఒక రోజు ముందే కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో ఓకే అయ్యాకనే.. వారిని విధి నిర్వహణకు అనుమతిస్తారు.