ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, పథకాలు అందడం లేదని ఎవరైనా ఫిర్యాదు చేస్తే దానిని వెంటనే పరిష్కరించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలోనే పథకాల అమలు, సుపరిపాలన కోసం చంద్రబాబు మరో సరికొత్త విధానానికి నాంది పలికారు. పథకాలు, సేవల అమలుపై ప్రజల నుంచి అభిప్రాయాలను ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించబోతున్నామని చంద్రబాబు ప్రకటించారు.
2024 ఎన్నికలకు ముందు తన సీటు తనకు ఇచ్చుకోవడానికి కూడా ప్రజాభిప్రాయం తీసుకున్నానని చంద్రబాబు అన్నారు. అన్ని రకాల సేవలు అందిస్తామని, ప్రజలకు అందుతున్న పథకాలపై ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ లు చేసి ప్రజాభిప్రాయం తీసుకుంటామని చంద్రబాబు చెప్పారు. అయితే, ఫోన్ చేసినప్పుడు తనకు వాస్తవాలు చెప్పాలని, రాజకీయంగా చెబితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పట్టుకుంటామని చమత్కరించారు.
వాస్తవాలు తనకు చెబితే మెరుగైన సేవలు ప్రజలకు అందించేందుకు అనునిత్యం పని చేస్తానని అన్నారు. ఒకప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకోవడం చాలా ఇబ్బంది అని, ఇప్పుడు గంటల్లోనే కోట్లాది మంది అభిప్రాయాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజాభిప్రాయం తెలుసుకుంటే మరింత సుపరిపాలన అందించే పరిస్థితి ఉందని అన్నారు. ధాన్యం సేకరణకు వాట్సాప్ మెసేజ్ చాలని..48 గంటల్లో వారికి డబ్బులు ఇస్తున్నామని అన్నారు.
అనంతపురంలో 10 ఎకరాల పొలం ఉన్నా ఇక్కడి కరువు పరిస్థితులు చూసి వారికి కూడా రేషన్ కార్డులు ఇచ్చానని, దేశంలోనే తొలిసారి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత తనదేనని అన్నారు. గుంతల రోడ్లు లేకుండా రోడ్ల నిర్మాణం జరగాలని ముందుకు పోతున్నామని, సంక్రాంతి లోపు గుంతలు లేని రోడ్లు ప్రజలకు అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా పథకాల అమలుపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కబోతోందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.