నాగార్జునకు రిలీఫ్..సురేఖకు షాక్

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, సమంత, కేటీఆర్ లపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్య‌లు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నాగార్జున వేసిన పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు…కొండా సురేఖకు షాకిచ్చింది. ఈ కేసులో కొండా సురేఖ‌కు నాంప‌ల్లి కోర్టు స‌మ‌న్లు జారీ చేసింది.

దాంతోపాటు ఈ కేసు విచార‌ణ‌ను డిసెంబ‌ర్ 12వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. అంతేకాదు, డిసెంబ‌ర్ 12న జ‌రిగే విచార‌ణ‌కు సురేఖ వ్యక్తిగతంగా హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింది. త‌న కుటుంబ పరువుకు భంగం కలిగించారని, పరువుప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యాఖ్యానించారని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి కోర్టును నాగార్జున ఆశ్రయించారు. నాగార్జున పిటిషన్ ను కాగ్నిజెన్స్ లోకి తీసుకున్న కోర్టు..సురేఖకు సమన్లు జారీ చేసింది.

సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున తరఫు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉండి ఆ తరహా వ్యాఖ్యలు చేసిన సురేఖ క్రిమినల్ చర్యలకు అర్హులని వాదించారు. అయితే, సురేఖ తన వ్యాఖ్యలపై ఎక్స్ లో క్షమాపణలు చెప్పారని ఆమె తరఫు న్యాయవాది గురు ప్రీత్ సింగ్ వాదనలు వినిపించారు.