ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల నేతృత్వంలో ఎన్డీఏ కూటమి ఏర్పడడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఏపీలో ఎన్డీఏ కూటమి పార్టీలకు వచ్చిన ఎంపీ సీట్లు కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాయి. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ను ఆంధీ అంటూ ప్రధాని మోదీ కూడా ప్రశంసించారు. జాతీయ స్థాయిలో పవన్ ఇమేజ్ ను వాడుకోవాలని భావించిన మోదీ..మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని పవన్ ను ఆహ్వానించారు. షోలాపూర్ తో పాటు తెలుగు ప్రజలు అధికంగా నివసించే పలు ప్రాంతాల్లో బీజేపీ, మహాయుతి కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు పవన్. ఈ క్రమంలోనే పవన్ ప్రచారం చేసిన షోలాపూర్ తో పాటు అన్ని స్థానాలలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.
ఈ క్రమంలోనే పవన్ పై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ప్రశంసలు కురిపించారు. పవన్ బీజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేసి వారి గెలుపులో కీలక పాత్ర పోషించారని, అందుకు ఆయనకు కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్ర రాజేష్ కోతే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ప్రచారం వల్లే తాను గెలిచాలనని, షోలాపూర్ ల పవన్ ప్రచారం ప్రభావం చాలా ఉందని కోతే చెప్పారు. షోలాపూర్ లో 2 గంటల పాటు పవన్ చేసిన రోడ్ షో, ర్యాలీ, బహిరంగ సభ చాలా ఉపయోగపడ్డాయని తెలిపారు. తన ప్రసంగాలతో మహారాష్ట్ర, షోలాపూర్ ప్రజలను పవన్ ప్రభావితం చేశారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర మాజీ హోం మంత్రి, మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, ఆయన కూతురు ప్రణతి షిండేలు కలిపి షోలాపూర్ నుంచి 7 సార్లు గెలుపొందారు.
కాంగ్రెస్ కు కంచుకోట వంటి ఆ స్థానంలో అయితే కాంగ్రెస్ లేదంటే ఎంఐఎం గెలవడం ఆనవాయితీ. అయితే, ఆ ట్రెండ్ ను కోతే బ్రేక్ చేయడంలో పవన్ కీలక పాత్ర పోషించారు. మహారాష్ట్రలో పవన్ ప్రచారం సక్సెస్ కావడంతో దక్షిణాదిలోని మిగతా రాష్ట్రాలలో కూడా ఎన్నికల సమయంలో పవన్ తో ప్రచారం చేయించాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట.
పవన్ స్టార్ డమ్, సనాతన ధర్మం పరిరక్షకుడిగా ఆయనకున్న గౌరవం, ఏపీ డిప్యూటీ సీఎం హోదాను కలిపి పవన్ ప్రభావం మిగతా రాష్ట్రాలలో కూడా ఉంటుందని మోదీ అండ్ కో భావిస్తోందట. ఈ రకంగా జాతీయ రాజకీయాలలో త్వరలోనే పవన్ చక్రం తిప్పే అవకాశముందని జనసైనికులు చెబుతున్నారు. షోలాపూర్ లో పవన్ వన్ మ్యాన్ షో హిట్ అని జనసైనికులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. పవన్ లోకల్ కాదు నేషనల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates