ఇప్పుడు మనం జీవిస్తున్న సమాజంలో… కొన్ని సమస్యలు చాపకింద నీరులా మన పుట్టి ముంచేస్తున్నాయి. మొదట ఒకచోట ప్రారంభమై… తర్వాత స్వల్పకాలంలోనే అందరికీ చేరువై జీవితాలను, కుటుంబాలను, సమాజాన్ని నాశనం చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారింది డ్రగ్స్! ఆల్కహాల్ తీసుకోవడానికి అనుబంధంగా, అతి కొద్ది మంది ఫన్ కోసం తీసుకున్న ఇది ఇప్పుడు అభివృద్ధి చెందిన హైదరాబాద్ నగరం నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వంటి మారుమూల ప్రాంతాల్లోనూ దొరికే వరకూ చేరింది. అయితే, ఈ విషయంలో ఓ కీలక , ఆహ్వానించదగ్గ పరిణామం చోటు చేసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో కఠినంగా ఉన్నారు. గత ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేసినప్పటికీ తాజాగా రేవంత్ అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ ఈ మేరకు తన ప్రభుత్వం వైఖరి కఠినంగానే ఉంటుందని తేల్చిచెప్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పదేపదే ఈ విషయాన్ని చెప్తుండటాన్ని గమనించారా లేదా మనుషులుగా తామూ సమాజం కోసం ఆలోచించాలని భావించారా తెలియదు కానీ… తాజాగా ప్రభుత్వ అధికారులు ఓ పాపులర్ సింగర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చారు.
పంజాబీ సింగర్ దిల్‌జీత్ దోసాంజ్ ‘దిల్ లుమినాటి’ కాన్సర్ట్ ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. వీకెండ్‌లో ఏర్పాటు చేసిన ఈ కాన్సర్ట్ ఎలాంటి ఆడియెన్స్, ఎలాంటి సంబురాలతో జరుగుతుందో చెప్పనక్కర్లేదు. అయితే, ఈ సింగర్‌కు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. డ్రగ్స్, ఆల్కహాల్ కల్చర్‌ను ప్రమోట్ చేసే పాటలను పాడొద్దంటూ ఏకంగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దలు 140 డెసిబుల్స్ కంటే ఎక్కువ ప్రెజర్ లెవెల్ ఉన్న శబ్దాలకు గురికాకూడదు. పిల్లలకు సంబంధించి ఈ లెవెల్ 120 డెసిబుల్స్‌కు తగ్గించాల్సి ఉంటుంది. కాబట్టి, మీ లైవ్ షోలో పిల్లలను స్టేజ్‌పైకి తేకూడదు. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ఈ షోకు అనుమతించరాదు. పెద్ద శబ్దాలు, ఫ్లాష్ లైట్లు పిల్లలకు హానికరం. మీ లైవ్ షోలో అభ్యంతరకర విషయాలను నిరోధించడానికి మేం ముందుగానే నోటీసులు జారీ చేస్తున్నాం’’ అంటూ నోటీసుల్లో తేల్చిచెప్పారు.
కాగా, ప్రభుత్వ అధికారుల విషయంలో తరచుగా ఏర్పడే ఆరోపణ అయిన…. అంతా అయిన తర్వాత తాపీగా రెస్పాండ్ అవుతారు అనే అపప్రదకు దూరమై…తమకు అందన ఫిర్యాదు, తమ దృష్టికి వచ్చిన అంశాల ఆధారంగా ఈ మేరకు ముందస్తుగా ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టడం అభినందనీయమంటున్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనసు ఎరిగి తీసుకున్న నిర్ణయమా లేదా తమ విధి నిర్వహణలో భాగమా తెలియదు కానీ… సమాజానికి మేలు చేసే సంతోషకరమైన అంశమని ప్రశంసిస్తున్నారు.