‘బ్రిటీషర్ల మాదిరి ప్రపంచాన్ని భారతీయులు ఏలవచ్చు’

ఢిల్లీలో జరుగుతున్న హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కొంతకాలంగా పాపులేషన్ మేనేజ్మెంట్ ఆవశ్యకత గురించి పలు సందర్భాల్లో కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు తాజాగా హెచ్ టీఎల్ ఎస్ లో కూడా ఆ అంశాన్ని ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గుదల సమస్య మొదలైందని, ఫెర్టిలిటీ రేటు తగ్గుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జననాల రేటు బోర్డర్ లైన్ లో ఉందని, అది తగ్గితే జపాన్, చైనాలా పాపులేషన్ సమస్య మొదలవుతుందని చెప్పారు. మన దేశంలో 145 కోట్ల జనాభా ఉందని, పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తే ప్రపంచంలో మనల్ని కొట్టేవారే ఉండరని చంద్రబాబు అన్నారు. సరిగా ప్లాన్ చేస్తే 30-40 కోట్ల మంది భారతీయులు ప్రపంచంలో అన్ని మూలలకు వెళ్లి పనులు చేసి దేశానికి ఆదాయం తెస్తారని చెప్పారు. బ్రిటీష్ వాళ్లు భారత్‌కు వచ్చి పరిపాలించిన మాదిరి ప్రపంచ దేశాలకు వెళ్లి ఆయా దేశాలను ఏలవచ్చు అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన తీసేసి కనీసం ఇద్దరు పిల్లలుటేనే పోటీకి అర్హులు అనే నిబంధన తేవాలని అభిప్రాయపడ్డారు. గతంలో తాను ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ అబౌట్ ఎయిడ్స్’ అనే నినాదాన్నిచ్చానని, ఇప్పుడు ‘బ్రేక్ సైలెన్స్ – టాక్ ఎబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్’ అనే నినాదం కోసం పిలుపునిస్తున్నానని చెప్పారు.

1989 నుంచి 2024 వరకు కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ పలుమార్లు కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేసుకున్నారు. బీజేపీకి వాజ్ పేయి పునాదులు వేస్తే, బీజేపీని మోడీ బలోపేతం చేశారని ప్రశంసించారు. ఎన్డీఏ 3.0లో కీలక పాత్ర పోషించబోతున్నామని ముందే ఊహించానని, ఎన్నికలకు ముందు ఫలితాలు కూటమికి అనుకూలంగా వస్తాయని నమ్మకంతో ఉన్నానని చెప్పారు. మోడీ నేతృత్వంలో దేశం ఆర్థికంగా బలంగా తయారవుతుందని, 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతున్నామని తెలిపారు.