గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా అఘోరి వ్యవహారం మరింత ముదురుతోంది. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తోంది. ఏ క్షణంలో ఆమె ఎక్కడ ప్రత్యక్ష మవుతుందో తెలియక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు. ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా.. కొద్దిపాటి బూడిద రాసుకుని.. సంచరిస్తున్న ఆమె వ్యవహార శైలితో సాధారణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
తాజాగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలుసుకుని తీరుతానంటూ.. మహిళా అఘోరీ చేసిన రచ్చతో విజయవాడ-మంగళగిరి హైవేలో పెద్ద వివాదమే చోటు చేసుకుంది. సోమవారం ఉదయాన్నే.. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో అఘోరీ.. హఠాత్తుగావిజయవాడ నుంచి మంగళగిరికి వెళ్లే జాతీయ రహదారిపై ప్రత్యక్షమైంది. ఇక్కడకు కొంత దగ్గరలోనే జనసేన పార్టీ కార్యాలయం ఉంది. ఈ క్రమంలో ఆమె ఆ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది.
ఇంతలో జనసేన కార్యకర్తలు జోక్యం చేసుకుని ఆమెను జాతీయ రహదారిపైనే నిలువరించారు. దీంతో ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. తాను పవన్ కల్యాణ్ కోసం వచ్చానని, ఆయనను కలుసుకోవాల్సి ఉంటుందని, కలవకుండా వెళ్లేది లేదని పట్టుబట్టింది. దీంతో జనసేన కార్యకర్తలు.. పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన చేరుకున్న పోలీసులు.. అఘోరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె నడిరోడ్డుపై బైఠాయించి.. పవన్ రావాల్సిందేనని తేల్చి చెప్పారు.
ఈ పరిణామాలతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. కొన్ని వాహనాలను పోలీసులు ముందుకు పంపించినా.. తర్వాత నడిరోడ్డులో అఘోరీ భైటాయించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. కాగా, మహారాష్ట్ర పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్.. బీజేపీ తరఫున ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates