వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని సంగతి తెలిసిందే. ఐదేళ్లు సీఎంగా జగన్ ఉన్నప్పటికీ తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడలేదని, తనకు న్యాయం జరగలేదని సునీత పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, ఈ కేసులు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిపై నేరుగా సునీతోపాటు వైఎస్ షర్మిల కూడా పలు ఆరోపణలు చేసినా ఫలితం లేదు. అయితే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలో ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ కేసులో వైఎస్ సునీత స్పీడు పెంచారు.

తన తండ్రిని కిరాతకంగా హత్య చేసిన వారిని శిక్ష పడాలంటూ న్యాయం కోసం సుదీర్ఘ పోరాటం చేస్తున్న సునీతా ఈ రోజు కడప ఎస్పీ విద్యాసాగర్ ను కలిశారు. వివేకా కేసు గురించి ఎస్పీకి వివరించిన సునీత…హంతకులకు శిక్ష పడేలా పోలీసులు విచారణ వేగవంతం చేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇక, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డి తనపై పెట్టిన అభ్యంతరకర పోస్టులపై కూడా ఎస్పీతో సునీత చర్చించారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హోంమంత్రి అనితను కలిసిన తర్వాత అప్పటి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజును సునీత కలిసిన సంగతి తెలిసిందే. వివేకా హంతకులకు స్థానిక పోలీసుల అండ లభిస్తోందని అనితను కలిసన సమయంలో సునీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సీబీఐ విచారణకు పోలీసులు సహకరించేలా చూడాలని అనితకు సునీత విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో, ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో వివేకా కేసు త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీ అండతో ఉన్న అవినాష్ రెడ్డికి ఈ కేసులో చిక్కులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.