టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా మహారాష్ట్రకు వెళ్తారు. ఈ నెల 20(నాలుగు రోజుల్లో) జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీజేపీ అభ్యర్థుల తరఫున(ఎన్డీయే కూటమి- మహారాష్ట్రలో మహాయుతి కూటమిగా ఉంది) చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ప్రచారం చేస్తారు. తెలుగు వారు ఎక్కువగా ఉన్న నాందేడ్, షర్డి తదితర జిల్లాల్లో వీరు ప్రచారం చేయనున్నారు.
తొలుత శుక్రవారం ఢల్లీ చేరుకునే చంద్రబాబు బీజేపీ పెద్దలతో అక్కడ భేటీ అవుతారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు ఇతర నేతలను కూడా కలుసుకుంటారు. పోలవరం నిధులు, రాజధాని రుణం వంటి అంశాల పురుగతిపై వారితో చర్చించనున్నారు. అనంతరం.. రాత్రికి ఆయన మహారాష్ట్ర రాజధాని ముంబై చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఇక, పవన్ కల్యాణ్ నేరుగా ముంబైకి చేరుకుంటారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు.. శనివారం ఉదయం 7 గంటల నుంచే ప్రచార పర్వంలోకి అడుగు పెట్ట నున్నారు. రెండు రోజుల పాటు వారు అక్కడే ఉండి బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయనున్నారు. ఈ సందర్భంగా కూటమి రాక, డబుల్ ఇంజన్ సర్కారు విజయవంతం, పెట్టుబడులు, మోడీ ఇమేజ్ సహా.. దేశంలో సుస్థితరత వంటి అంశాలను ప్రచారం చేయనున్నట్టు తెలిసింది. దీనిపై కూడా బీజేపీ కొంత బ్రీఫ్ చేసింది. ప్రధానంగా నరేంద్ర మోడీ ఇమేజ్ ద్వారా భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించే అవకాశం ఉంది.
అదేవిధంగా శనివారం, ఆదివారం వరుస మీడియా సమావేశాలు కూడా నిర్వహించనున్నారు. ఈ మేరకు చంద్రబాబు షెడ్యూల్ ఖరారైంది. ఇక పవన్ కల్యాణ్ షిర్డీలో ప్రత్యేకంగా ప్రచారం చేయనున్నట్టు జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా బీజేపీ పెద్దల కోరిక మేరకు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి ఇద్దరు నేతలు వెళ్తుండడం గమనార్హం. కాగా, 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో ఎన్నికల పోలింగ్ జరగనుంది.