ఫైర్ బ్రాండ్ల‌కు పెద్ద‌పీట‌.. ఏపీ రాజ‌కీయం మ‌రింత సెగే!

టీడీపీ ఫైర్ బ్రాండ్ల‌కు సీఎం చంద్ర‌బాబు మ‌రింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వ‌డంతో పాటు.. తాజాగా ప్ర‌క‌టించిన ‘విప్’ల స్థానంలోనూ వారికి ప్రాధాన్యం ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావుకు విప్ ప‌ద‌వి ద‌క్కింది. ఈయ‌న పొలిటిక‌ల్‌గా ఫైర్ బ్రాండ్ అన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీపై ఒంటికాలిపై విరుచుకు ప‌డ‌డంలో బొండా ఉమా స్ట‌యిలే వేరు. గ‌తంలోనూ.. బొండా ఉమా దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు.

ఈ క్ర‌మంలోనే బొండా మంత్రి ప‌ద‌విపై ఆశ‌లు పెట్టుకున్నారు. కాపుల కోటాలో త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆశించారు. అయితే.. తాజాగా విప్ ప‌ద‌వితో చంద్ర‌బాబు స‌రిపుచ్చారు. ఇక‌, క‌డ‌ప జిల్లాకు చెందిన రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ రెడ్డికి కూడా చంద్ర‌బాబు ప‌ద‌వి ఇచ్చారు. ఆమెను కూడా విప్ గా ప్ర‌క‌టించారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న మాధ‌వి.. వైసీపీపై విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలో ముందున్నార‌నే చెప్పాలి.

ఫుల్ రేంజ్‌లో కామెంట్లు చేయ‌డంలోనూ.. విమ‌ర్శ‌లు గుప్పించ‌డంలోనూ మాధ‌వి ఇటీవ‌ల కాలంలో త‌ర‌చుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో ఆమెను కూడా చంద్ర‌బాబు రాజ‌కీయంగా ప్రోత్స‌హించార‌నే చెప్పాలి. ఇదిలావుంటే, పార్టీ కోసం అవిర‌ళ కృషి చేసిన గుంటూరు జిల్లా వినుకొండ నాయ‌కుడు జీవీ ఆంజ‌నేయులుకు చీఫ్ విప్ పోస్టును ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఐదేళ్ల కాలంలో అనేక ఇబ్బందులు.. కేసులు ఎదుర్కొన్న జీవీ ఆంజ‌నేయులు క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు కావ‌డం గ‌మ‌నార్హం.

ఇక‌, వార‌సుల కోటాలోనూ ఒక‌రిద్ద‌రు ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. వీరిలో మాజీ మంత్రి పార్టీకి అత్యంత విధేయుడిగా పేరు తెచ్చుకున్న య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు కుమార్తె, తుని ఎమ్మెల్యే య‌న‌మ‌ల దివ్యకు చంద్ర‌బాబు విప్ ప‌ద‌విని ఇచ్చారు. గ‌త ప‌దేళ్లుగా దివ్య తుని రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదేవిధంగా టీడీపీ విధేయురాలిగా.. ముఖ్యంగా పార్టీలో అత్యంత యాక్టివిస్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన నందిగామ ఎమ్మెల్యే(2వ సారి విజ‌యం) తంగిరాల దివ్యకు కూడా చంద్ర‌బాబు పెద్ద‌పీట వేశారు. ఆమెను కూడా విప్‌గా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.