అమెరికా ఎన్నిక‌ల్లో భార‌త సంత‌తి పౌరులు

అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో భార‌త సౌర‌భాలు గుబాళించాయి. భార‌త సంత‌తి పౌరులు.. ఘ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు. మొత్తం 9 మంది పాత కొత్త నాయ‌కులు ఈ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌గా.. ఏకంగా ఆరుగురు ఇప్ప‌టికే విజ‌యం ద‌క్కించుకున్నారు. మ‌రొక‌రు.. విజ‌యం అంచుల వ‌ర‌కు చేరుకుని లీడ్‌లో కొన‌సాగుతున్నారు. దీంతో అమెరికా ప్ర‌తినిధుల స‌భ‌లో ఇన్ని ద‌శాబ్దాల త‌ర్వాత‌.. ఘ‌నమైన సంఖ్య‌లో భార‌త సంత‌తి పౌరులు పెరగ‌నున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐదుగురు మాత్ర‌మే స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా..ఇప్పుడు ఈ సంఖ్య ఆరుకు చేరింది. మ‌రొక‌రు కూడా విజ‌యం ద‌క్కించుకుంటే ఏడుగురు భార‌త కీర్తిని నిల‌బెట్ట‌నున్నారు. ఆయ‌నే భార‌త సంత‌తి పౌరుడు అమిష్ షా అరిజోనాలో లీడింగ్‌లో ఉన్నారు.

ఎవ‌రెవ‌రు?

సుహాస్ సుబ్రమణ్యం: వర్జీనియా స్టేట్ సెనేటర్ గా ఉన్న ఈయన తొలిసారి 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభకు పోటీ చేశారు. అరంగేట్రం లోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. వర్జీనియా నుంచి గెలుపు గుర్రం ఎక్కిన తొలి భారత సంతతి వ్య‌క్తిగా హిస్ట‌రీ క్రియేట్ చేశారు. సుహాస్ డెమొక్రాటిక్ పార్టీ తరఫున పోటీ చేయగా, రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీ చేసిన మైక్ క్లాన్సీ పరాజయం పాలయ్యారు.

శ్రీధానేదార్: మిచిగాన్ (13వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా రెండో సారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 2023లో తొలి విజయం అందుకున్నారు.

రాజా కృష్ణమూర్తి: ఇల్లినోయిస్ (7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా 5వ సారి విజయం దక్కించుకున్నారు. ఇక్కడ పోటీ చాలా తీవ్రంగా సాగింది. అయినా.. రాజా విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌క‌గా సాగిపోయింది.

రో ఖన్నా: కాలిఫోర్నియా (17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్) నుంచి 2013 నుంచి వరుసగా విజయం దక్కించుకున్నారు.

ప్రమీలా జయపాల్: వాషింగ్టన్( 7వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా విజయం సాధిస్తున్నారు.

డాక్టర్ అమిబెరా: వైద్య వృత్తిలో ఉన్న అమిబెరా భారత సంతతి నేతల్లో సీనియర్ మోస్ట్ నాయకుడు. కాలిఫోర్నియా(6వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్) నుంచి వరుసగా గెలుపొందారు