2024 ఎన్నికలకు ముందు వైఎస్ విజయమ్మ ప్రయాణిస్తున్న కారు టైర్లు రెండూ ఒకేసారి ఊడిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒకేసారి ఫ్రంట్ టైర్లు రెండూ ఊడిపోవడంపై టీడీపీ ఎక్స్ ఖాతాలో కొద్ది రోజుల క్రితం పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
షర్మిలతో ఆస్తి పంపకాల వివాదాల నేపథ్యంలో ఆ ప్రమాద ఘటనకు జగన్ కు లింక్ పెడుతూ సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రమాద ఘటనపై వైఎస్ విజయమ్మ స్పందించారు. ఈ క్రమంలోనే విజయమ్మ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
కొద్ది రోజులుగా ఆ ప్రమాదం గురించి, తమ కుటుంబం గురించి జరుగుతున్న దుష్ప్రచారాన్ని విజయమ్మ ఖండించారు. రాజకీయాల కోసం ఇటువంటి దుష్ప్రచారం ఎవరికీ తగదని, జగన్ ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ఈ తరహా పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
కర్నూలులో కొద్ది రోజుల క్రితం జరిగిన కారు ప్రమాదం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని అన్నారు. ఆ ప్రచారం చూసి తనకు మానసిక వేదన కలుగుతోందని, ఆ ఘటనపై వివరణ ఇవ్వకుంటే ప్రజలు ఆ ప్రచారం నిజం అనుకునే అవకాశముందని విజయమ్మ తెలిపారు.
ప్రజలకు వాస్తవాలు, కొంతమంది దుర్మార్గపు ఉద్దేశ్యాలు తెలియాలనే ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. ఎప్పుడో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని తన కుమారుడికి ముడిపెట్టి ప్రచారం చేయడం విచారకరమన్నారు. అమెరికాలో తన మనవడి దగ్గరకు వెళ్లానని, జగన్ కు భయపడి వెళ్లలేదని, దానిపై కూడా విష ప్రచారం చేయడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. ఇకనైనా, ఇటువంటి ప్రచారాలను ఆపకుంటే సహించబోనని విజయమ్మ వార్నింగ్ ఇచ్చారు.
ఈ తరహా దిగజారుడు రాజకీయాలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని, ఇటువంటి దుష్ప్రచారంతో ప్రజలను తప్పుదోవపట్టించాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ తరహా వ్యక్తిత్వహనన వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెబుతారని అన్నారు.