ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 120 రోజులపాటు విజయవంతమైన పాలన అందించిన కూటమి ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల ఆఖరులోపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ముగియనుంది.
ఈ నేపథ్యంలోనే ఈ లోపు వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఈనెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 11వ తేదీ ఉదయం 10 గంటలకు వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
నవంబరు 11 నుంచి మొత్తం 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్ తో పాటుగా ఇతర కీలక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, గత అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొట్టిన వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా గైర్హాజరవుతారని హాజరవుతారని టాక్ వస్తుంది. 11 మంది సభ్యులు మాత్రమే ఉండడం, ప్రతిపక్ష హోదా దక్కకపోవడం వంటి కారణాల నేపథ్యంలో వైసీపీ సభ్యులు ఈ సమావేశాలకు కూడా హాజరు కాకుండా ఏదో ఒక కారణం చెప్పాలని చూస్తున్నారని తెలుస్తోంది.
ఒకవేళ వైసీపీ సభ్యులు సభకు హాజరైతే మాత్రం ఈసారి సమావేశాలు ఆసక్తికరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రుషికొండ భవనాలను సందర్శించిన చంద్రబాబు ఆ వ్యవహారంపై సభలో మాట్లాడే అవకాశాలున్నాయి.
500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ భవనాలు కట్టడంపై జగన్ ను సభలో చంద్రబాబు కార్నర్ చేసే అవకాశం ఉంది. గత శాసనసభ సమావేశాలకు గైర్హాజరైన జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై విమర్శలు వచ్చాయి. మరి, ఈ సారైనా జగన్ సభకు వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates