గౌతం అదానీ. దేశంలోనే అత్యంత రిచ్చెస్ట్ వ్యాపార వేత్త. గుజరాత్‌కు చెందిన ఈయన ఇప్పుడు దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా.. పలు ప్రముఖ వ్యాపారాలు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు ఏపీలోనూ తిరిగి వ్యాపారాలు ప్రారంభించేందుకు.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. దీనిని ఆహ్వానించాల్సిన పరిణామంగానే చూడాలి. గతం తాలూకు పొరపొచ్చాలను వీడి అదానీ బృందం తాజాగా చంద్రబాబును కలుసుకుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పేర్కొంది. అదీ ఇదీ అనికాదు.. అన్ని రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిపింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి పోర్టుల వరకు, రహదారుల నుంచి పరిశ్రమల వరకు కూడా.. అదానీ బృందం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా.. పెట్టుబడులకు తాము ఎలా సిద్ధంగా ఉన్నామో వివరించింది. అంతేకాదు.. రాజధాని అమరావతి విషయం లోనూ తాము దోహద పడతామని తేల్చి చెప్పడం గమనార్హం. అమరావతి-విజయవాడల మధ్య నిర్మించే రహదారుల నిర్మాణం నుంచి కృష్నానదిపై నిర్మించే తీగల వంతెనల వరకు కూడా పెట్టుబడులు పెట్టేందుకు తాము రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. ఈ విషయంలో చంద్రబాబు నేరుగా జోక్యం చేసుకోలేదు.
ఆయా ప్రాజెక్టుల అవసరం.. సానుకూలతను పరిశీలించాలని అధికారులకు అప్పగించారు. నెమ్మదిగా ఈ విషయంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇలా.. ఎందుకు చేయాల్సి వస్తోందంటే.. అదానీ కంపెనీ పెట్టుబడులపై ఎన్నికలకు ముందు ప్రతిపక్షంగా చంద్రబాబు సహా పవన్ వంటివారు తీవ్ర ఆరోపణలు చేశారు. అదానీకి జగన్ రాష్ట్రాన్ని అమ్మేస్తున్నారని.. పోర్టులను విక్రయిస్తున్నారని కూడా విమర్శలు గుప్పించారు. కృష్ణపట్నం ఓడరేవును పూర్తిగా అదానీకి రాసిచ్చేశారంటూ.. కొన్ని మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి.
దీంతో అదానీ ఒకసందర్భంలో బహిరంగ లేఖ కూడా రాసింది. ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొడుతున్నట్టు పేర్కొంది. ఈ పరిణామాలు ఇంకా.. చంద్రబాబు మనసు నుంచి పోలేదు. దీంతో ఆయన చాలా వ్యూహాత్మకంగా.. అదానీ పెట్టుబడుల వ్యవహారంపై అధికారులు పరిశీలన చేయాలని చెప్పారు. తర్వాత.. ఆయన సమీక్షించనున్నారు. అయితే.. పెట్టుబడి దారులుగా ఉన్న వారు రాజకీయాలను కాకుండా.. తమ వ్యాపారాలనే చూసుకుంటారు కాబట్టి.. అదానీని ఆహ్వానించడంలో చంద్రబాబుకు తప్పులేదు. ఏపీ అభివృద్ధికి సహకరించేవారిని పిలవడంలోనూ పొరపాటు లేదని అంటున్నారు పరశీలకులు.