ఏపీలో రోజుకో ట్విస్ట్ ఇస్తున్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వ్యవహారంలో మరో మలుపు తిరిగింది. కోర్టు కోరకుండానే నిమ్మగడ్డ తనకు తానుగా మరో పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ తాను తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, ఉద్దేశపూర్వకంగానే తాను ఎన్నికలను రద్దు చేసినట్టుగా ఎన్నికల సంఘం కార్యదర్శి రామసుందర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు కౌంటర్ గానే నిమ్మగడ్డ ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏకంగా 17 పేజీలతో కూడిన కౌంటర్ ఫిటిషన్ లాంటి పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసిన నిమ్మగడ్డ… ఈ వ్యవహారంలో తన తప్పేమీ లేదన్నట్లుగా కోర్టుకు తెలిపినట్లుగా సమాచారం.
ఈ పిటిషన్ లో నిమ్మగడ్డ ఏమని పేర్కొన్నారన్న విషయానికి వస్తే…‘‘స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి విచక్షణతోనే వాయిదా వేశాను. ఎన్నికల కమిషనర్ తీసుకునే నిర్ణయాలను ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదు. కమిషనర్ కు సాయం చేసేంత వరకే కార్యదర్శి విధులు పరిమితం. ఎన్నికల వాయిదా అనేది చాలా గోప్యంగా ఉండాల్సిన వ్యవహారం. ఈసీ న్యాయ విభాగం నోటిఫికేషన్ తయారు చేసిన తర్వాతే నేను సంతకం చేశాను. విచక్షణతో ఎన్నికలను వాయిదా వేసే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఉంది. ఎన్నికల కమిషన్ సిబ్బందితో ఎలక్షన్లకు సంబంధించిన నిర్ణయాలపై చర్చించాల్సిన అవసరం లేదు’’ అని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు.
మొత్తంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ లో కమిషనర్ తర్వాత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్యదర్శి దాఖలు చేసిన పిటిషన్ ను కౌంటర్ చేసేందుకే నిమ్మగడ్డ తాజా పిటిషన్ ను దాఖలు చేయడం నిజంగానే సంచలనాత్మకమేనని చెప్పాలి.
కమిషన్ కార్యాలయంలో ఏ ఒక్కరికి కూడా చెప్పకుండానే నిమ్మగడ్డ ఎన్నికల వాయిదాపై నిర్ణయం తీసుకున్నారని కార్యదర్శి చెబితే… ఆ మాట నిజమేనని, ఎన్నికల వాయిదా అంశంపై కమిషన్ లోని సిబ్బందితో చర్చించాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని నిమ్మగడ్డ తన పిటిషన్ లో పేర్కొన్నారు. మొత్తంగా కమిషన్ లో పనిచేసిన ఇద్దరు కీలక వ్యక్తుల మధ్య వైరంగా ఈ వ్యవహారం మలుపు తిరగడం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదిలా ఉంటే… ఎస్ఈసీ పదవీకాలం తగ్గింపుపై హైకోర్టులో మంగళవారం వాదనలు జరగనున్నాయి.