ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌: కాంగ్రెస్ ఏం చేస్తున్న‌ట్టు..?


గ‌త కొద్ది రోజులుగా రాష్ట్రంలో ష‌ర్మిల వ‌ర్సెస్ జ‌గ‌న్‌ల మ‌ధ్య ఆస్తుల వివాదాలు తార‌స్థాయికి చేరాయి. ఒక రిపై ఒక‌రు ఢీ-అంటే ఢీ అంటూ.. పెద్ద ఎత్తున వివాదం చేసుకుంటున్నారు. అయితే.. ఇలాంటి స‌మ‌యం లో ష‌ర్మిల ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్న‌ట్టు? అనే ప్ర‌శ్న సాధార‌ణంగానే తెర‌మీదికి వస్తుంది. ఎందుకంటే.. మ‌హిళా నాయ‌కురాలు కాబ‌ట్టి.. ఆమెకు మ‌ద్ద‌తుగా పార్టీ స్పందిస్తార‌ని అంద‌రూ అనుకుంటారు.

అదేవిధంగా ఆది నుంచి కూడా వైఎస్ కుటుంబం.. వారి ఆస్తుల‌కు సంబంధించిన కేసులు కూడా కాంగ్రె స్ పార్టీ హ‌యాంలోనే జ‌రిగాయి కాబ‌ట్టి.. ఇప్పుడు ష‌ర్మిల విష‌యం.. కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత‌గా మ‌రో పార్టీకి తెలియ‌ద‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల‌కు మ‌ద్ద‌తుగా ఏమైనా స్పందించాల‌ని అనుకుంటే.. అది కాంగ్రెస్ పార్టీకే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. కానీ.. ఆ పార్టీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించ‌లేదు.

గ‌ల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయ‌కుల వ‌ర‌కు ఎవ‌రూ కూడా.. ష‌ర్మిల‌ను ప‌ట్టించుకోలేదు. క‌నీసం.. ఆమెను ప‌రామ‌ర్శించేందుకు.. ప‌న్నెత్తు మాట మాట్లాడేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌డం లేదా?  లేక‌.. ఈ వివాదాన్ని కుటుంబ ఆస్తుల వివాదంగా చూస్తున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది. నిజానికి  వైఎస్ హ‌యాంలో ఆయ‌న‌తో క‌లిసి మంత్రులుగా ప‌నిచేసిన వారు.. ఇప్ప‌టికీ కీల‌క నాయ‌కులుగా పార్టీలో ఉన్నారు.

ఇలాంటి వారు స్పందిస్తే.. బెట‌ర్ అనే ఆలోచ‌న ఉన్నా.. పార్టీ నుంచి సంకేతాలు రాక‌పోవ‌డ‌మో.. లేక‌.. ఈ విష‌యంలో తాము స్పందిస్తే.. మ‌రింత ర‌చ్చ అవుతుంద‌న్న భావ‌నో కార‌ణంగా.. నాయ‌కులు మౌనంగా ఉండిపోయారు. ఇలాంటి స‌మ‌యంలో వైరి ప‌క్ష‌మే అయినా.. టీడీపీ ష‌ర్మిల‌కు అండ‌గా నిలుస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆమె ఆస్తుల విష‌యంలో జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించిన తీరును పార్టీ నాయ‌కులు త‌ప్పుబడుతున్నా రు. అయితే.. రాజ‌కీయంగా కాంగ్రెస్ పార్టీ కూడా ష‌ర్మిల వైపు నిల‌బ‌డితే బెట‌ర్ అనే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.