అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్

2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవి తరఫున టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని అల్లు అర్జున్ తో పాటు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు అల్లు అర్జున్ కు భారీ ఊరటనిచ్చింది.

నవంబర్ 6 వరకు అల్లు అర్జున్ పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 6న తుది తీర్పు వెల్లడించబోతున్నామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అల్లు అర్జున్ ను చూసేందుకు వేలాది మంది అభిమానులు నంద్యాలకు తరలివచ్చారు. దీంతో వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా అల్లు అర్జున్, శిల్పా రవి నంద్యాలలో ర్యాలీ నిర్వహించారని అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా అల్లు అర్జున్, శిల్పా రవిలపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు.

ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం పిఠాపురంలో ప్రచారం చేస్తుంటే మరో పక్క వైసీపీ నేత శిల్పా రవి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేయడం విమర్శలకు తావిచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై పవన్, మెగా అభిమానులు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. ఆల్రెడీ మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి విభేదాలున్నాయన్న ప్రచారానికి అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారం ఊతమిచ్చినట్లయింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈ రెండు ఫ్యామిలీల మధ్య, ప్రత్యేకించి పవన్, బన్నీల మధ్య గ్యాప్ మరింత పెరిగిందని టాక్ వచ్చింది.