షర్మిల పై రాచమల్లు తీవ్ర వ్యాఖ్యలు

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీపీసీసీ అధ్యక్షురాలు మధ్య ఆస్తి వివాదం తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. సొంత చెల్లెలికి ఆస్తి ఇచ్చేందుకు కండిషన్లు పెడుతున్నారంటూ జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిలపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారం, అత్యాశ కలిపితే షర్మిల అంటూ రాచమల్లు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్ పై షర్మిల అన్యాయంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

సోనియా గాంధీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి లతో చేతులు కలిపి జగన్ దగ్గర నుంచి వేల కోట్ల రూపాయలు దండుకోవాలని ఆమె చూస్తున్నారని, ఈ రోజో రేపో దేశాన్ని ఏలాలనుకుంటున్నారని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ అంగడి మూసేసిన షర్మిల ఇక్కడికి వచ్చి అన్నయ్యను బజారుకీడుస్తున్నారని మండిపడ్డారు. అన్న మీద రాయితో దాడి చేస్తే షర్మిల స్పందించిన తీరు ఎలా ఉందో అందరికీ తెలుసని, చిన్నాయనపై గొడ్డలితో దాడి కంటే ఇది చిన్నదే అని షర్మిల మాట్లాడారని గుర్తు చేశారు.

రాజకీయంగా జగన్ ని అంతం చేయడమే షర్మిల లక్ష్యం అని షాకింగ్ ఆరోపణలు చేశారు. భర్త సంపాదించిన ఆస్తిలో ఆడబిడ్డకు వాటా ఇచ్చేందుకు ఏ భార్య ఒప్పుకోదని, కానీ వైఎస్ భారతి అందుకు ఒప్పుకున్నారని రాచమల్లు గుర్తు చేశారు. కాబట్టి జగన్, భారతిల గొప్పతనాన్ని ప్రశంసించాల్సింది పోయి ఇలా విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. 10 ఏళ్లలో 200 కోట్ల రూపాయల నగదును షర్మిలకు జగన్ ఇచ్చారని, జగన్ సంపాదించిన ఆస్తిలో మాత్రమే ఆయన వాటా ఇస్తున్నారని, షర్మిలకు హక్కు లేదని, అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తి కాదని రాచమల్లు చెప్పారు.

అయితే, షర్మిల ఆస్తుల బదలాయింపు కోసం ప్రయత్నం చేస్తుండడంతోనే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నేషనల్ లా ట్రైబ్యునల్ ను ఆశ్రయించాల్సి వచ్చిందని అన్నారు. అంతేగానీ, తన తల్లిని, చెల్లిని జగన్ కోర్టుకు ఈడ్చలేదని చెప్పుకొచ్చారు.