కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల.. తాజాగా సంచలన లేఖ ఒకటి మీడియాకు విడుదల చేశారు. దీనిలో ప్రధానంగా ఆమె వైసీపీ చేసిన విమర్శలకు జవాబు ఇస్తూనే.. ఇప్పటి వరకు వెలుగు చూసిన సరస్వతి పవర్ షేర్లకు సంబంధించి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా.. ఆమె రెండు రోజుల కిందట జగన్‌ను ఉద్దేశించి రాసిన లేఖ ఒకటి.. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
24 గంటల ముందే.. టీడీపీ సోషల్ మీడియాలో షర్మిల వ్యవహారం బ్రేకింగ్‌న్యూస్‌గా వచ్చిందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా వ్యాఖ్యానించారు. ససాక్ష్యాలు ఇవే నంటూ ఆయన కొన్ని ప్రతులు కూడా చూపించారు. దీంతో షర్మిల రాసిన లేఖ టీడీపీ సోషల్ మీడియాలో ఆమె తల్లి ఫొటోతో పాటుగా రావడం సంచలనంగా మారింది. తాజాగా ఈ విషయంపై షర్మిల స్పందిస్తూ.. తాను చంద్రబాబు చేతిలో బాణం కాదని వ్యాఖ్యానించారు.
వైఎస్సార్ బిడ్డ ఎప్పటికీ.. చంద్రబాబు చేతిలో బాణం కాదని.. షర్మిల పేర్కొన్నారు. అంతేకాదు.. జగనే ఎవరి కొంగుచాటున ఉండి ఈ వ్యవహారం నడిపిస్తున్నారో ప్రజలు, వైఎస్సార్ అభిమానులు తెలుసుకోవా లని కూడా షర్మిల సూచించారు. ఈ విషయంలో వైఎస్సార్ అభిమానులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని. తప్పును తనపై నెడుతున్నారని షర్మిల వ్యాఖ్యానించారు. అంతేకాదు.. అసలు ఇప్పటి వరకు గోప్యంగా ఉన్న షేర్ల వ్యవహారం ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందన్నారు.
తనపైనా.. తన తల్లిపైనా అక్కసుతో కోర్టుకు ఈడ్చారని షర్మిల తన మూడు పేజీల లేఖలో పేర్కొన్నారు. ఎప్పుడో ఐదేళ్ల కిందట జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు తాను ఎలా బయట పెడతానని కూడా ఆమె ప్రశ్నించారు. తనకు ఈ ఐదేళ్లలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా.. ఎన్నో ఆర్థిక సమస్యలు వచ్చినా.. బయట పెట్టలేదన్నారు. కానీ, ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చిందో వైఎస్సార్ అబిమానులు అర్థం చేసుకోవాలని షర్మిల కోరడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates