ఏ పార్టీకైనా యువ నాయకులు, యువతరం చాలా ముఖ్యం. ప్రతి పార్టీ కూడా.. యూత్ వింగ్‌ను బలోపేతం చేస్తుంది. ఎందుకంటే.. భవిష్యత్తులో పార్టీ మనుగడ.. రాజకీయాల మనుగడ వారితోనే సాధ్యమని భావిస్తుంది. అందుకే ప్రతిపార్టీలోనూ యూత్ వింగ్‌కు ప్రాధాన్యం ఉంటుంది. గతంలో ఈ వింగ్‌లను బలంగా వినియోగించేవారు. టీడీపీలో ఇప్పటికీ.. యూత్ వింగ్ చాలా బలంగా ఉంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో యూత్ వింగ్ బలంగా పోరాటం కూడా చేసింది.
అయితే.. వైసీపీలో ఉన్న యువతరం మాత్రం అధికారంలో ఉన్నప్పుడు.. రెచ్చిపోయారు. ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నారు.. అన్నట్టుగా ఉంది పరిస్థితి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు.. ఏ ఒక్క యువ నాయకుడు కూడా.. ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం.. పార్టీ అధినేత, అప్పటి సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసం.. అనేక అడ్డదారులు తొక్కారు. దీంతో చట్ట విరుద్ధంగా కొందరు.. సొంత అజెండాలతో మరికొందరు విజృంభించారు.
అయితే.. కాలం అన్ని వేళలా ఒకే రకంగా ఉండదు. ప్రభుత్వం మారేసరికి వైసీపీ యువ నాయకుల ఆగడాలు వెలుగు చూస్తున్నాయి. కేసుల్లో చిక్కుకుని కొందరు.. ఎక్కడ దొరుకుతామోనని మరికొందరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఫలితంగా వారి ఫ్యూచర్ పాలిటిక్స్ పైనా ప్రభావం పడుతుండడం గమనార్హం.
మచ్చుకు కొందరు!
భరత్: కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ భరత్.. చంద్రబాబును ఓడిస్తానని కంకణం కట్టుకున్నారు. రాజకీయంగా ఆయన ఎదుర్కొని ఉంటే వేరేగా ఉండేది. కానీ, దీనిని అరాచకంగా ముందుకు తీసుకువెళ్లి.. టీడీపీ జెండా కనిపిస్తేనే చిందులు తొక్కారు. ఇప్పుడు కూటమి సర్కారు వచ్చాక.. కనిపించకుండా పోయారు. ప్రస్తుతం ఎక్కడున్నారనేది ప్రశ్నగా మారింది.
దేవినేని అవినాష్: విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అంతా నాదే అన్నట్టుగా చెలరేగారు. టీడీపీకార్యాలయంపై దాడి కేసులో చిక్కుకుని విలవిల్లాడుతున్న పరిస్తితి. బయటకు రాలేని దుస్థితిని ఎదుర్కొంటున్నారు.
మోహిత్‌రెడ్డి: చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన యువ నాయకుడు. కానీ, ఎన్నికల సమయంలో టీడీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే పులవర్తి నానిపై హత్యాయత్నం చేశారన్న అభియోగాలు ఉన్నాయి. దీంతో ఆయన తెరచాటుగానే ఉండిపోయారు. దీనికి తోడు మరిన్ని కేసులు కూడా ఉన్నాయని అంటున్నారు.
పినిపే శ్రీకాంత్: తండ్రి వారసత్వంతో వచ్చే ఎన్నికల నాటికి.. అమలాపురంలో రాజకీయాలు చేయాలని అనుకున్న నాయకుడు. కానీ, సొంత సన్నిహితుడైన వలంటీర్ దుర్గా ప్రసాద్ హత్య కేసులో చిక్కుకుని.. ప్రస్తుతం జైలు పాలయ్యారు. రాజకీయంగా ఆయన భవిత కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది.