కేంద్ర పాలిత ప్రాంతంలో టీడీపీ హ‌వా!

ఏపీలో ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ మెజారిటీ ద‌క్కించుకున్న టీడీపీ.. పూర్వ వైభ‌వం సంత‌రించుకున్న విష‌యం తెలిసిందే. మ‌రో 30 ఏళ్ల‌కు సరిప‌డా చార్జింగ్‌ను సంపాయించుకుంద‌న్న టాక్ కూడా వినిపిస్తోంది. ఆ సేతు హిమాచ‌లాన్ని ఏకం చేయ‌డంలో పార్టీ అధినేత చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారు. ఇక‌, ఇప్పుడు పొరుగు ప్రాంతాలు, రాష్ట్రాల్లోనూ పార్టీ బ‌లోపేతంపై ఆయ‌న దృష్టి పెట్టారు. ఈ క్ర‌మంలో కేంద్ర పాలిత ప్రాంతం అండ‌మాన్ నికోబార్ దీవుల్లోనూ పార్టీ త‌న హ‌వా కొన‌సాగిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

2010 నుంచి కూడా అండ‌మాన్‌లో పార్టీ పుంజుకుంది. ఇక్క‌డ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లోనూ పార్టీ విజ‌యం ద‌క్కించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీతో దోస్తీ చేస్తున్న‌ట్టుగానే.. అక్క‌డ ఎప్ప‌టి నుంచో బీజేపీతో చేతులు క‌ల‌ప‌డం మ‌రో ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం. ఏపీలో 2019-24 మ‌ధ్య బీజేపీకి టీడీపీ దూరంగా ఉంది. కానీ, అండ‌మాన్‌లో మాత్రం టీడీపీ.. క‌మ‌ల నాథులు క‌లిసి.. మునిసిపాలిటీలో అధికారం ద‌క్కించుకున్నారు.

ఇంతింతై..

ఇంతింతై అన్న‌ట్టుగా కేంద్ర‌పాలిత ప్రాంతంలో టీడీపీ ఓటు బ్యాంకు పెరుగుతూ వ‌చ్చింది.

  • 2010లో జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో టీడీపీ 4 శాతం ఓట్లు ద‌క్కించుకుంది. ఇదేమీ చిన్న విష‌యం కాదు. మ‌న‌కు సంబంధం లేని ఓ దీవిలో ఇలా దూసుకుపోవ‌డం చాలా ఆశ్చ‌ర్యం. అంతేకాదు.. మునిసిప‌ల్ కౌన్సిల‌ర్‌గా ఒక‌రు విజ‌యం ద‌క్కించుకున్నారు కూడా.
  • 2015లో జ‌రిగిన అండ‌మాన్ స్థానిక ఎన్నిక‌ల్లో 12 శాతం ఓట్లు సాధించింది. 2 కౌన్సిలర్‌ స్థానాలను గెలుచుకుంది.
  • 2022వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో 14 శాతం ఓటు బ్యాంకు ద‌క్కించుకుని ఏకంగా అధికారంలో పాలు పంచుకునే స్థాయికి ఎదిగింది. పోర్ట్‌బ్లెయిర్‌లో 24 వార్డులు ఉంటే.. వీటిలో బీజేపీ 10, టీడీపీ రెండు ద‌క్కించుకున్నాయి. ఇత‌ర నేత‌ల‌తో క‌లిసి అధికారంలోకి వ‌చ్చాయి.

ఇప్పుడు ఏం జ‌రిగింది?

తాజాగా అండమాన్‌ నికోబార్‌ దీవుల తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావును సీఎం చంద్ర‌బాబు నియ‌మించారు. బ‌ల‌మైన నాయ‌కుడిగా పేరున్న న‌క్క‌ల మాణిక్య‌రావు.. ఎస్టీ సామాజిక వ‌ర్గానికి చెందిన నాయకుడు. ఈ నియామ‌కంతో పార్టీ మ‌రింత పుంజుకుంటుంద‌ని చంద్ర‌బాబు ఆశిస్తున్నారు. మ‌రో రెండేళ్ల‌లో ఇక్క‌డ మునిసిపాలిటీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.