2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ కు వరుసగా షాకులు తగులుతున్న సంగతి తెలిసిందే. కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితం కావడంతో ఆ పార్టీని వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే మోపిదేవి వెంకటరమణ వంటి కీలక నేతలతో పాటు పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జగన్ కు వైసిపి మహిళా నేత భారీ షాక్ ఇచ్చారు. వైసీపీకి ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్మన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు.
ఆ తర్వాత మాజీ సీఎం జగన్ పై పద్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని నడపడంలో, పరిపాలన చేయడంలో, సమాజంపై జగన్ కు అసలు బాధ్యత లేదని విమర్శలు గుప్పించారు. పార్టీలో కష్టపడ్డ వారి కోసం గుడ్ బుక్, ప్రమోషన్లు అని జగన్ అంటున్నారని, కానీ, నాయకులు, కార్యకర్తల కోసం గుడ్ బుక్ కాకుండా గుండె బుక్ ఉండాలని పద్మ అన్నారు. ప్రమోషన్లు ఇవ్వడానికి వైసిపి వ్యాపార కంపెనీ కాదని ఎద్దేవా చేశారు. జీవితాలు, ప్రాణాలు పణంగా పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే వ్యక్తి జగన్ అని షాకింగ్ కామెంట్లు చేశారు.
ఇక, గుడ్ బుక్ పేరుతో మరోసారి కార్యకర్తలను, నేతలను మోసం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ఆరోపించారు. నియంత ధోరణి ఉన్న నేతను ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని అన్నారు. వ్యక్తిగతంగా, విధానపరంగా వైసీపీలో చాలాసార్లు అసంతృప్తికి గురైనప్పటికీ నిబద్ధతగలిగిన వ్యక్తిగా పార్టీ కోసం పని చేశానని చెప్పుకొచ్చారు. అయితే, ప్రజా తీర్పు తర్వాత ఎన్నో విషయాలను సమీక్షించుకున్నానని, ఆ తర్వాతే వైసీపీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నానని పద్మ అన్నారు.
పార్టీని వీడిన తర్వాత జగన్ పై ఈ స్థాయిలో విమర్శలు గుప్పించిన నేత మరొకరు లేకపోవడం విశేషం. ఈ నేపద్యంలోని పద్మ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. ఇక, గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు జగ్గయ్యపేట ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో పద్మ అసంతృప్తికి గురయ్యారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు ఆమె దూరంగా ఉంటున్నారు. మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు.