గుంటూరు జిల్లాలో కీలకమైన నియోజకవర్గం చిలకలూరిపేట. ఇక్కడ రాజకీయాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నది తెలిసిందే. వైసీపీ తరఫున గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న విడదల రజనీ.. మంత్రి కూడా అయ్యారు. అయితే.. ఆమె ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కథ ఇక్కడితో అయిపోలేదు. ఇప్పుడే అసలు కథ రెడీ అయింది. గుంటూరు వెస్ట్‌లో ఉన్న విడదల రజనీ.. ఇప్పుడు తన పాత స్థానం చిలకలూరి పేటకు వెళ్లిపోతానని మంకు పట్టు పడుతున్నారు. దీనికి అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయినా.. విడదల మాత్రం పట్టు వీడడం లేదు.
ఈ నేపథ్యంలోనే గుంటూరు వెస్ట్‌లో రజనీ అజ కూడా కనిపించడం లేదు. వెస్ట్ రాజకీయాలకు.. తనకు పడడం లేదని, కొందరు నాయకులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రజనీ చెబుతున్న మాట. అంతేకాదు.. తన ఓటమికి కూడా కొందరు సొంత నేతలే ప్రయత్నించారన్నది ఆమె వాదనగా ఉంది. ఇది ఎలా ఉన్నా.. ఆమె మాత్రం చిలకూలూరి పేటపైనే మనసు పెట్టుకున్నారు. కానీ, ఈ ప్రతిపాదనపై పార్టీ అధిష్టానం ఎలా రియాక్ట్ అయినా.. ఇప్పుడు సొంత పార్టీ నేతలే విడదలను వ్యతిరేకిస్తూ.. నినాదాలు చేస్తున్నారు. నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. దీంతో పేట వైసీపీలో కొట్లాట ఓ రేంజ్‌లో సాగుతోంది.
ఏంటి వివాదం?
వాస్తవానికి చిలకలూరి పేటలో వైసీపీకి ప్రాణం పోసింది. ఆ పార్టీ జెండాను నిలబెట్టింది.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్. అసలు ఈయనకు ఇచ్చిన సీటునే.. 2019లో అర్ధంతరంగా రద్దు చేసి.. విడదలకు కేటాయించారు. దీనిని పార్టీ శ్రేణులు ముఖ్యంగా మర్రివర్గం తీవ్రంగా వ్యతిరేకించింది.
అయితే.. అప్పట్లో జగన్ మంత్రిపదవి ఇస్తామంటూ..మర్రి వర్గాన్ని మరిపించారు. ఇది సాకారం కాలేదు. చివరలో ఎన్నికలకు ముందు.. ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి సంతృప్తి పరిచారు. ఇక, గడిచిన ఐదేళ్లు కూడా.. విడదల వర్సెస్ మర్రి మధ్య రాజకీయ దుమారం రేగింది. మర్రి వర్గాన్ని సాధ్యమైనంత వరకు అణిచేయా లని విడదల ప్రయత్నించినట్టు వార్తలు వచ్చాయి.
అనేక సార్లు మర్రి-రజనీల మద్య సర్దుబాట్లు.. వివాదాలకు సంబంధించిన పరిష్కారాలు కూడా చేశారు. కట్ చేస్తే.. ఇప్పుడు మరోసారి రజనీ.. చిలకలూరిపేటలోకివచ్చే అవకాశం ఉందని ఉప్పందండంతో పేటలో వైసీపీ నాయకులు ఏకమయ్యారు. ఇస్తే మర్రి రాజశేఖర్‌కే.. ఇంచార్జ్ పదవిని ఇవ్వాలని.. లేకపోతే.. పార్టీని వదిలేసే అవకాశం కూడా ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
ఇక, రజనీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలోనూ దుమ్ము రేపుతున్నారు. మరోవైపు.. టీడీపీ నేత, ప్రస్తుత ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో మర్రి రాజశేఖర్ చేతులుకలిపినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు వైసీపీ అధిష్టానం రజనీని కనుక పేటకుపంపిస్తే.. ఇక్కడ వైసీపీలో రాజకీయ సంక్షోభం ఏర్పడడం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates