రాష్ట్రంలో మూడు పార్టీల కూటమిని ఏర్పాటు చేసి, వైసీపీని గద్దె దించిన పార్టీ జనసేన. ఇక, టీడీపీ, జనసేనతో కలిసిన పార్టీ బీజేపీ. అంటే.. మొత్తంగా కూటమిలో ఈ రెండు పార్టీల ప్రభావం, ప్రాధాన్యం కూడా ఎక్కువగానే ఉంది. మంత్రి పదవులు కూడా పంచుకున్నారు. వారి వారి ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి.. చంద్రబాబు ఆయా పార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇక, ఇప్పుడు కీలకమైన నామినేటెడ్ పదవుల పంపకం వచ్చింది. ఈ విషయంలో చంద్రబాబు తప్పుకొన్నారు.
‘మీకు 20 శాతం పదవులు ఇస్తాం.. వాటిని మీరు ఎలాగైనా పంచుకోండి! మాకు అభ్యంతరం లేదు’- అని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ 20 శాతం పదవులను పంచుకునే పరిస్థితి జనసేన, బీజేపీల కోర్టులో ఉంది. ఈ విషయంలో బీజేపీ హైజాక్ చేస్తుందా? లేక.. ఇరు పార్టీలూ ఒక ఒప్పందానికి వచ్చి పదవులు పంచుకుంటాయా? అనేది ఆసక్తిగా మారింది. ఎన్నికల సమయంలోనూ.. బీజేపీ.. కీలకంగా వ్యవహరించింది.
టీడీపీ ప్రకటించిన సీట్లలో అప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన సీట్లలో ఎన్నికల నామినేషన్ల గడువు ముగుస్తున్న సమయంలో సంచలన నిర్ణయాలు తీసుకుని.. అప్పటికే ప్రకటించిన వాటిలో తమ అభ్యర్థులను నిలిపింది. ఇలా నాలుగు చోట్ల టీడీపీ అప్పటికప్పుడు అభ్యర్థులను మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే.. ఒకరకంగా బీజేపీనే అప్పట్లో పైచేయి సాధించిందన్న చర్చ సాగింది. ఇక, ఇప్పుడు జనసేన విషయంలో , నామినేటెడ్ పదవుల అంశంలోనూ ఇలానే చేసే అవకావం ఉందా? అనేది సందేహం.
జనసేన పార్టీ ఆది నుంచి వైసీపీపై చూపిస్తున్న దూకుడు.. పదవులు, ఇతరత్రా కూటమిలో రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించలేదు. పైచేయి కూడా చూపలేదు. సర్దుకు పోయే ధోరణిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ 20 శాతం పదవుల్లో మెజారిటీ షేర్ తీసుకున్నా ఆశ్చర్యం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. లేదా.. సమానంగా అయినా.. పంచుకునే అవకాశం ఉంది. వాస్తవానికి బీజేపీకి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు పోల్చుకుంటే.. కొందరు ఓడిపోయారు. కానీ, జనసేన పూర్తిగా విజయం దక్కించుకుంది. అలాంటప్పుడు 12-15 శాతం తీసుకుంటే బెటర్ అని పార్టీ నాయకులు ఆలోచన చేసే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.