తాజాగా రాష్ట్ర టీడీపీలో చేసిన ప్రయోగంపై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. గత ఏడాది ఎన్నికల తర్వాత.. టీడీపీ దెబ్బతిన్న తీరు చూస్తే.. గడిచిన రెండు దశాబ్దాల్లో పార్టీ ఇలా ఇబ్బంది పడిన పరిస్థితి కనిపించదు. ఈ నేపథ్యంలోనే పార్టీకి అత్యవసరంగా కాయకల్ప చికిత్స అవసరమని అందరు నేతలు అభిప్రాయపడ్డారు.
ప్రజల్లో పార్టీ ఓడిపోవడం ఒక్కటే కాదు.. పార్టీలోనూ నైరాశ్యం ఏర్పడింది. దీనిని సమూలంగా ప్రక్షాళన చేస్తేనే తప్ప.. పార్టీ పరుగులు పెట్టే అవకాశం లేదు. దీనిని గ్రహించిన చంద్రబాబు.. పార్టీలో కీలకమైన పార్లమెంటరీ జిల్లా చీఫ్‌లను నియమించారు.
మొత్తం ఇరవై ఐదుమంది కీలక నాయకులకు 25 నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించారు. అయితే ఈ కూర్పులోనూ చాలా చోట్ల పొరపాట్లు దొర్లాయని.. అంటున్నారు పరిశీలకులు. ఇదే విషయం పార్టీలోనూ చర్చకు వస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి జిల్లా పార్టీ ఇంచార్జ్‌గా తోట సీతారామలక్ష్మిని నియమించారు. ఈ కూర్పు సరికాదని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. నరసాపురం నియోజకవర్గం మొత్తం క్షత్రియ సామాజిక వర్గానికి కంచుకోట. ఇక్కడ ఏపార్టీ అయినా.. క్షత్రియ వర్గానికే ప్రాధాన్యం ఇస్తోంది.
కాదని.. వేరే వర్గానికి టికెట్ ఇచ్చినా.. బాధ్యతలు అప్పగించినా.. ప్రయోజనం ఉండడం లేదని తమ్ముళ్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ కూడా క్షత్రియ వర్గానికి టికెట్ ఇచ్చిందని, టీడీపీ కూడా కలువపూడి శివ వంటి క్షత్రియ వర్గానికి టికెట్ ఇవ్వడం మంచిదైందని.. కానీ, ఇప్పుడు ఈ వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన సీతారామలక్ష్మిని తీసుకువచ్చి.. ఇక్కడ బాధ్యతలు అప్పగిస్తే.. ఆమెకు, పార్టీకి కూడా కష్టమేనని చెబుతున్నారు.
ఆమె సీనియర్ రాజకీయనాకురాలే అయినప్పటికీ.. రాజ్యసభ సభ్యురాలిగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ.. నరసాపురం వంటి కీలకమైన క్షత్రియ వర్గం డామినేషన్ ఉన్న చోట్ల ఆమెకు పగ్గాలు అప్పగించడం సరికాదని అంటున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. సీతారామలక్ష్మి కూడా ఇస్తే.. తనకు కాకినాడ ఇవ్వాలని.. లేదంటే.. ఏమీ వద్దని చెప్పడం! కానీ, బాబు వ్యూహం ఏంటో చూడాలి.