పదవి.. దక్కడమే మహాభాగ్యం అనుకునే రోజులు ఇవి! లెక్కకు మిక్కిలి నేతలు.. సామాజిక వర్గ సమీకరణలు.. వెరసి ఏ పార్టీ అయినా.. ప్రభుత్వంలో అయినా.. నాయకులకు పదవులు దక్కడం అంటే.. కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టినంత పనిగా మారింది. అయితే, దక్కిన పదవిలో ఎంత మంది నాయకులు హ్యాపీగా పనిచేస్తున్నారు? ఎందరు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు? అంటే.. ప్రశ్నార్థకమే. ఎందుకంటే.. పార్టీలకు, పార్టీల అధినేతలకు కొన్ని టార్గెట్లు ఉంటే.. నాయకులకు మరొకొన్ని టార్గెట్లు, వ్యక్తిగత లక్ష్యాలు ఉండడమే దీనికి కారణం. దీంతో పదవులు పొందినా.. సంతోషం కనిపించని నేతలు కనిపిస్తుండడం గమనార్హం.
టీడీపీలో పార్లమెంటరీ జిల్లా కమిటీలకు ఇంచార్జ్‌లను నియమించారు.. చంద్రబాబు. ఈ పదవులు దక్కించుకునేందుకు కొందరు బాగానే ఆయన కంట్లో పడ్డారు. మరికొందరు మాకు తప్ప ఎవరికి ఇస్తారు.. అని భావించారు. సరే! మొత్తానికి పదవుల పంపకం అయిపోయింది. ఇలా పదవి పొందిన వారిలో మచిలీపట్నం మాజీ ఎంపీ.. కొనకళ్ల నారాయణ ఒకరు. ఈయన వివాద రహితుడు.. పార్టీపై విశ్వాసం.. అధినేత చంద్రబాబుపై అపారమైన నమ్మకం.. అంతకు మించిన స్వామి భక్తి పరాయణుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఎటొచ్చీ.. అత్యంత కీలకమైన ఈ పదవికి ఈయన సరిపోతారా? అనేదే ప్రశ్న.
దీనికి కారణం.. తన కుమారుడిని ఈ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎక్కడో ఒకచోట ఇరికించి.. నాయకుడిని చేయాలని ఆయన తపన పడుతున్నారు. ముఖ్యంగా పెడన నియోజకవర్గం అయితే.. బాగుంటుందని కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో తన కుమారుడికి ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ఇటీవల కాలంలో ఆయన ప్రయత్నిస్తున్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. కానీ, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు(2014లో టీడీపీ తరఫున గెలిచారు).. కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ ఉన్నారు. గత ఏడాది ఎన్నికల్లో ఈయన టికెట్ సంపాయించుకుని దాదాపు 54 వేల పైచిలుకు ఓట్లను సాధించారు. అయితే.. జోగి రమేష్‌పై ఓడిపోయారు.
దీంతో కాగిత కుటుంబం పని అయిపోయిందని.. తమకు ఈ నియోజకవర్గం ఇవ్వాలని.. ఎన్నికలకు ముందుకూడా కొనకళ్ల చంద్రబాబు వద్ద ప్రతిపాదించారు. కానీ, ఆయన వినిపించుకోలేదు. దీంతో ఎన్నికల అనంతరం.. పెడన వ్యూహంగా కొనకళ్ల చక్రం తిప్పుతున్నారు. ఇక, ఇప్పుడు ఆయన మచిలీపట్నం నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమితులయ్యారు.
దీంతో కేవలం తన కుమారుడి కోసం కాగిత కుంటుంబాన్ని టార్గెట్ చేస్తే.. వ్యతిరేకత పెరుగుతుందని.. పైగా.. గుడివాడ, గన్నవరం.. వంటి కీలక నియోజకవర్గాల్లో పార్టీని పరుగులు పెట్టించకుండా.. పెడనపై దృష్టిపెట్టి తన కుమారుడి కోసం ప్రయత్నిస్తే.. తన ఇమేజ్ దెబ్బతింటుందని.. కొనకళ్ల భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో బాబు ఇచ్చిన పదవిపై ఆయన పెదవి విరుస్తున్నారు. తన కుమారుడి ఎదుగుదలకు తండ్రిగా ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చిందని ఆయన వాపోతున్నారని అనుచరులు బాహాటంగానే చెబుతుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates