మంచి రోజుల ముంగిట్లో టాలీవుడ్

మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దల మధ్య వినిపిస్తున్న మాట ఇదేనని అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సమస్యలు లేవు. బిఆర్ఎస్ హయాం నుంచి ఇప్పటి కాంగ్రెస్ పాలన దాకా ప్రతిదీ ఇబ్బంది లేని తరహాలోనే జరిగింది. టికెట్ల పెంపుకు అనుమతులు కావాలన్నా, అదనపు ఆటలు వేసుకోవాలన్నా, ఎక్కువ హంగామా లేకుండా సరైన అప్లికేషన్ పెడితే వేగంగానే అనుమతులు వచ్చేవి. ఇలాంటి అనుకూలమైన పరిస్థితి వైసిపి పాలన ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో లేదు. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమా నిర్మాతలు పడిన అగచాట్లు అన్నిఇన్ని కావు.

వేగంగా ఫ్లాష్ బ్యాక్ వైపు ఒక లుక్ వేస్తే పరిశ్రమ స్టార్లందరూ జగన్ దగ్గరకు వెళ్లి విన్నపాలు చేసుకోవడం, అవసరం లేకపోయినా మంత్రుల స్థాయి వ్యక్తులు నిర్మాతలను కూర్చోబెట్టి మీటింగులు పెట్టడం, పవన్ సినిమాలకు ఏకంగా మినిస్టర్లు ప్రెస్ మీట్ లో రివ్యూలు చెప్పడం, టికెట్ హైకులకు అర్ధరాత్రి దాకా నాన్చడం ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. ఇన్ని జరిగినా ఎవరూ గట్టిగా నోరు మెదపలేని ఇరకాటం. ఇప్పుడు టిడిపి జనసేన బిజెపి కూటమి వచ్చేసింది. స్వయానా పవన్ కళ్యాణే కీలక భూమిక పోషిస్తున్నాడు. సిఎం చంద్రబాబునాయుడు, బాలయ్యతో సత్సంబంధాలు ఉన్న వాళ్లే టాలీవుడ్ లో ఎక్కువ.

ఇకపై భవిష్యత్తులో తమవైపు నుంచి ఎలాంటి వినతులు వెళ్లినా వాటికి సానుకూల స్పందన ఉంటుందనే ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది. ప్రచార సమయంలో చంద్రబాబునాయుడు పలు సందర్భాల్లో చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్ పేర్లను ప్రస్తావించి వాళ్ళను జగన్ అవమానించడం గురించి ప్రత్యేకంగా దుయ్యబట్టారు. అలాంటి సెలబ్రిటీలను ఇబ్బంది పెట్టే స్థాయి నీది కాదని నిలదీశారు. ఇకపై అమరావతి రాజధానిగా తిరిగి జీవం పోసుకుంటున్న వేళ షూటింగులను ప్రోత్సహించేలా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశాలు బోలెడు. ఇక టెన్షన్ లేదని కొందరు ప్రొడ్యూసర్లు బాహాటంగానే కామెంట్ చేస్తున్నారు.