సమీక్ష – ప్రతినిధి 2

2/5

2 Hr 16 Mins   |   Political Drama   |   10 - 05 - 2024


Cast - Nara Rohit, Sree Lella, Sapthagiri,Tanikella Bharani, Indraja, Uday Bhanu, Ajay Ghosh

Director - Murthy Devagupthapu

Producer - Kumar Raja Batthula, Anjaneyulu Srithota, Surendranath Bolineni

Banner - Vanara Entertainments, Rana Arts

Music - Mahati Swara Sagar

పదేళ్ల క్రితం సినిమాకు సీక్వెల్ అంటే ఆరుదేం కాదు కానీ సాహసమనే చెప్పాలి. అందులోనూ ఫామ్ లో లేని నారా రోహిత్ హీరోగా దర్శకుడిగా పరిచయమవుతున్న టీవీ5 మూర్తి దీనికి పూనుకోవడం ఆసక్తి రేపింది. ఏప్రిల్ చివరి వారంలోనే రావాల్సి ఉన్నప్పటికి సెన్సార్ తదితర ఇబ్బందుల వల్ల సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా లేదని డ్రైగా ఫీలవుతున్న టైంలో వచ్చిన ప్రతినిధి 2 మీద ఒక వర్గం అభిమానుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి. మరి వాటిని చేరుకుందా.

కథ

ఎవరికీ భయపడని నిఖార్సైన జర్నలిస్టు చేతన్ అలియాస్ చే(నారా రోహిత్) విదేశాల నుంచి వచ్చిన మహిళ పెట్టిన ఎన్ఎన్ సి ఛానల్ లో సీఈఓగా చేరతాడు. సంచలనాత్మక ఇంటర్వ్యూలు చేసే యాంకర్ గా రాజకీయ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాడు. ప్రజలచే కీర్తించబడుతున్న ముఖ్యమంత్రి ప్రజాపతి(సచిన్ కెడ్కర్) మీద బాంబు దాడి జరుగుతుంది. పార్టీ బాధ్యతలు కొడుక్కు అప్పజెప్పే క్రమంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. సీఎం మర్డర్ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి సిబిఐ నుంచి విక్రమ్ సంతోష్ (జిస్సు సేన్ గుప్తా) వస్తాడు. ఇంతకీ చే ఇదంతా ఎందుకు చేశాడు, అధికార పార్టీ మీద కుట్ర ఎవరు చేశారనేదే అసలు స్టోరీ.

విశ్లేషణ

పొలిటికల్ డ్రామాలు చాలా సున్నితమైన అంశాలతో సాగుతాయి. ఒకప్పుడు కోడి రామకృష్ణ లాంటి వాళ్ళు నిర్భయంగా ఇలాంటి సబ్జెక్టులు తీసేవాళ్ళు కానీ మనోభావాలు సున్నితమైపోయి, జనంలో రాజకీయ పార్టీల పట్ల విపరీతమైన ఆరాధన భావం పెరిగిన తర్వాత వీటిని టచ్ చేసే వాళ్ళు తగ్గిపోయారు. అయినా సరే టీవీ5 మూర్తి ఈ రిస్కుకి సిద్ధపడటం మంచి ఆలోచనే. అయితే ఎటొచ్చి ఆచరణలోకి తెచ్చే క్రమంలో ఆయన సగటు మాస్ దర్శకుడిగా అలోచించి కమర్షియాలిటీతో పాటు సోషల్ మెసేజ్ ఇవ్వాలని చేసిన ప్రయత్నం ప్రతినిధి 2 నిజాయితీకి పెద్ద స్పీడ్ బ్రేకర్ లా మారింది. ముసలివేషంలో రోహిత్ చేసే ఫైట్ నుంచే ఈ పొరపాట్లు మొదలైపోయాయి.

వృత్తిరిత్యా వర్తమాన రాజకీయాల మీద మంచి అవగాహన ఉన్న మూర్తి ఫస్ట్ హాఫ్ లో చాలా సమకాలీన అంశాలు జోడించారు. కొన్ని సంఘటనలు ఫలానా వ్యక్తులను ఉద్దేశించినట్టు తెరమీద స్పష్టంగా కనిపిస్తున్నా అవి వివాదాస్పదం అనిపించకుండా ఉండేందుకు తీసుకున్న జాగ్రత్తలు కొంతవరకు కాపాడాయి. ఒక సిఎం చనిపోతే జరిగే పరిణామాల చుట్టూ గతంలో లీడర్, భరత్ అనే నేను లాంటివి వచ్చాయి. ప్రతినిధి 2 కూడా అదే బాపతులోకి వెళ్ళింది. అయితే వాటిలో ఉన్న బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ ఇందులో మిస్ కావడంతో ఒకదశ దాటాక నాటకీయత తగ్గిపోయి అవసరం లేని కథనం ఎటేటో వెళ్లిపోయింది. స్క్రీన్ ప్లే అల్లికలో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది.

విశ్రాంతి ఎపిసోడ్ దగ్గర ట్విస్టు ఇచ్చిన మూర్తి ఆ తర్వాత మలుపులను ఇంకో స్థాయికి తీసుకెళ్తాడని ఆశిస్తాం. దానికి భిన్నంగా ప్రతినిధి 2 పూర్తిగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వైపు టర్న్ తీసుకుంది. దీంతో ఏదో ఆలోచింపజేసే కాంట్రావర్సి అంశాలు ఉంటాయని ఎదురు చూస్తున్న ప్రేక్షకులను నిరాశ పరుస్తూ క్రమంగా విసుగు వచ్చేలా సీన్లను పేర్చుకుంటూ పోవడంతో ఒకదశ దాటాక మూర్తి చేతులు ఎత్తేశారు. కొన్ని సిల్లీ లాజిక్స్ ని మర్చిపోవడం క్షమించరానిది. సీఎం చనిపోయిన ప్రదేశంలో ఇంకో డెడ్ బాడీ ఉందని కానిస్టేబుల్ సైతం చెప్పగలడు. అలాంటిది ఆ విషయం ఒక న్యూస్ ఛానల్ లో వచ్చే దాకా అంత తెలివైన సిబిఐ ఆఫీసర్ కి తట్టకపోవడం చిత్రాతి విచిత్రం.

చేతన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడని చెప్పే క్రమంలో పెట్టిన ఫ్లాష్ బ్యాక్ మరీ పాతిక సంవత్సరాల పాత ఫ్లేవర్ లో ఉండటం ఎమోషన్ కనెక్ట్ అవ్వడాన్ని తగ్గించేసింది. తన పరిస్థితికి ఎవరు కారణమో సులభంగా ఆడియన్స్ ఊహించగలరు. దాన్నేదో పెద్ద సస్పెన్స్ లా ఎండ్ టైటిల్ కు ముందు రివీల్ చేయడం ఏ మాత్రం కిక్ ఇవ్వలేదు. పైగా సిఎం కొడుకుని ముందుగానే నెగటివ్ షేడ్ లో చూపించి తర్వాత అతని కుట్రని బయట పెట్టడం చప్పగా తేలిపోయింది. ఇది ఎవరిని టార్గెట్ చేసిందో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. పోనీ అది చేసిన నటుడు జీవా రంగంలో అజ్మల్ రేంజులో ఉన్నాడా అంటే అదీ లేదు. ఏ మాత్రం సింక్ అవ్వలేదు.

చుట్టూ జరుగుతున్న వాటిని కొంతమేరకు మూర్తి బాగానే రాసుకున్నారు. పార్టీలు కోట్లు పోసి కొనుక్కునే పొలిటికల్ స్ట్రాటజిస్టులు, దుబాయ్ లో మనవాళ్ళనే వేధించి ఆ డబ్బుతో ఇక్కడ ఎమ్మెల్యే టికెట్లు ఆశించే వ్యాపారవేత్తలు, స్వపక్షంలోని అవినీతిపరుల బండారాలు ప్రతిపక్షాలు వాడుకునే వైనాలు గట్రా చూపించారు. ఇవన్నీ అపరిపక్వ అనుభవం వల్ల మూర్తి సరిగా హ్యాండిల్ చేయలేకపోయారు. పైగా కేవలం లెన్త్ కోసం సెకండ్ హాఫ్ లో హీరో హీరోయిన్ కి బలవంతపు పాట పెట్టడం లాంటివి ఇంకా చేటు చేశాయి. టేకింగ్ కన్నా ముందు రైటింగ్ మీద మూర్తి ఇంకొంచెం ఎక్కువ వర్క్ చేసి ఉంటే ప్రతినిధి 2 ఇంకో స్థాయిలో ఉండేది. ఛాన్స్ మిస్.

నటీనటులు

నారా రోహిత్ బాగున్నాడు. కాస్త బొద్దుగా అనిపించినా దర్శకుడు కోరుకున్న పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. తన వల్లే సీరియస్ సీన్స్ పండాయి. డాన్సులు చేయించారు కానీ అతకలేదు. సిరి లెల్ల హీరోయినే కానీ ఎక్స్ ప్రెషన్స్ పరంగా సోసోనే. డబ్బింగ్ తో మేనేజ్ చేద్దామని చూశారు. సచిన్ కెడ్కర్ మంచి ఛాయస్. అలవోకగా చేసుకుంటూ పోయారు. జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన ప్రశాంత్ కిషోర్ ని తలపించేలా ఉన్న పాత్రకు అజయ్ బాగా నప్పాడు. అజయ్ ఘోష్, పృథ్వి, ఉదయభాను, సప్తగిరి, ప్రవీణ్, తనికెళ్ళ భరణి, ఇంద్రజ తదితరుల ఎంపికలో మూర్తి టేస్ట్ బాగుంది. జిస్సు సేన్ గుప్తాది రొటీన్ పాత్రే. వీళ్ళు తప్ప ప్రత్యేకంగా చెప్పడానికి ఎవరు లేరు

సాంకేతిక వర్గం

మహతి స్వర సాగర్ సంగీతంలో బీజీఎమ్ రిపీట్ గా అనిపిస్తుంది తప్పించి ప్రత్యేకించి ఎలాంటి ముద్ర వేయలేదు. పాటలు విషయంలోనూ నిరాశ తప్పదు. నాని చమిడిశెట్టి కెమెరా పనితనంకు మార్కులు ఇవ్వొచ్చు. కలర్ టోన్ నుంచి మొదలుపెట్టి ఫ్రేమింగ్ దాకా శ్రద్ధ తీసుకున్నాడు. రవితేజ గిరజాల ఎడిటింగ్ ఇంకొంచెం పదును ఉంటే లెన్త్ తగ్గేది. ఫైట్లు సైతం సుదీర్ఘంగా అనిపిస్తాయి. కొంత ట్రిమ్ జరగాల్సింది. డైలాగులు అక్కడక్కడా పేలాయి. కొన్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి. పోరాటాలు బాగానే కంపోజ్ చేశారు కానీ కొన్ని ఓవర్ ది బోర్డు వెళ్లిపోయాయి. వానరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణ పరంగా కథ డిమాండ్ మేరకు ఎంత కావాలో అంతా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

నారా రోహిత్
కొన్ని ఆలోచింపజేసే సంభాషణలు
కెమెరా వర్క్

మైనస్ పాయింట్స్

పాత్రల చిత్రణ
సెకండాఫ్ ట్రాక్ మారిపోవడం
నమ్మశక్యం కాని లాజిక్స్
రొటీన్ హీరోయిజం

ఫినిషింగ్ టచ్ : మెజారిటీ చాల్లేదు

రేటింగ్ : 2 / 5