2/5
2 Hr 9 Mins | Action | 24-11-2023
Cast - Panja Vaisshnav Tej, Sreeleela, Joju George, Sada, Suman, Radhika Sarathkumar and others
Director - N. Srikanth Reddy
Producer - Naga Vamsi S & Sai Soujanya
Banner - Sithara Entertainments, Fortune Four Cinemas
Music - GV Prakash Kumar
తొలి చిత్రమే ఉప్పెన లాంటి జాతీయ అవార్డు గెలుచుకున్న బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న వైష్ణవ్ తేజ్ కు ఆ తర్వాత రెండు వరస పరాజయాలు పలకరించడంతో కొంత గ్యాప్ వచ్చింది. చిరంజీవి పవన్ మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చినా స్వంతంగా నిలదొక్కుకునేందుకు గట్టిగానే ట్రై చేస్తున్నాడు. తనతో పెద్ద సంస్థలే చేతులు కలుపుతున్నాయి. సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ కావడంతో ఆదికేశవ మీద జనాల్లో ఓ మోస్తరు అంచనాలే ఉన్నాయి. ముందు రోజు రాత్రే స్పెషల్ ప్రీమియర్లు కూడా వేశారు. మరి మెగా హీరో మాస్ మెప్పించిందా
కథ
జాలిగా తిరుగుతున్న బాలు(వైష్ణవ్ తేజ్) తండ్రి పోరు పడలేక కాస్మెటిక్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటాడు. ఆ సంస్థ సిఈఓ చిత్రావతి (శ్రీలీల) ని తొలిచూపులోనే ఇష్టపడి ప్రేమించడం మొదలుపెడతాడు. ప్రేమను పరస్పరం వ్యక్తపరుచుకునే టైంలో చిత్ర తండ్రి ఆమె పెళ్లిని వేరొకరితో నిశ్చయిస్తాడు. ఈ గొడవలో బాలు తన కుటుంబానికి సంబంధించిన పెద్ద షాక్ తెలుసుకుంటాడు. దీంతో స్వంత ఊరు బ్రహ్మసముద్రంకు వెళ్లాల్సి వస్తుంది. మైనింగ్ మాఫియాతో అక్కడి ప్రజలను చెప్పు చేతల్లో పెట్టుకున్న చెంగారెడ్డి(జిజు జార్జ్) తో తలపడతాడు. ఇంతకీ ఏం జరిగింది, బాలు కాస్తా రుద్రకాళేశ్వర్ రెడ్డి ఎలా అయ్యాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే అసలు స్టోరీ
విశ్లేషణ
మాస్ సినిమాలకో ప్రత్యేక గ్రామర్ ఉంటుంది. రొటీన్ అయినా సరే దాన్ని సరిగ్గా మోసే హీరో పడితే ప్రేక్షకులు అంగీకరిస్తారు. ఈ కొలతల్లో ఏ మాత్రం తేడా వచ్చినా అంతే సంగతులు. తక్కువ అనుభవంతో నటుడిగా ఇంకా ఛాలెంజింగ్ పాత్రలు చేయని వైష్ణవ్ తేజ్ మీద ఇంత పెద్ద కాన్వాస్ ని దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఎలా ఊహించుకున్నాడో ఎంత బుర్రబద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. సబ్జెక్టులో దమ్ముండొచ్చు. లేదా బాగా రాసుకున్నాననే నమ్మకముండొచ్చు. కానీ అతిశయోక్తులతో కూడిన కథనాన్ని చెబుతున్నప్పుడు బలమైన ఫాలోయింగ్, స్టేచర్ ఉన్న కథానాయకుడు కావాలి. వైష్ణవ్ లో అంత విషయం లేకపోవడం దగ్గరే ఆదికేశవ తడబాటు మొదలయ్యింది.
హీరోకు ఒద్దికైన తల్లితండ్రులుండే ఫ్యామిలీ, చక్కని జాబు, అందమైన అమ్మాయి కనిపించాక ప్రేమలో పడటం, మాటలతో సరిపోదని రెండు ఫారిన్ పాటలు వేసుకోవడం ఇలా పక్కా ఫార్ములా ప్రకారం తీసుకెళ్లాడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి. ఇక్కడ ఏదైనా వైవిధ్యంగా చూపిస్తే ఒప్పుకోరేమోననే అనుమానంతో ఫక్తు రెగ్యులర్ టెంప్లేట్ ని ఫాలో అయ్యాడు. ఇదంతా ఎన్నోసార్లు చూసి అలవాటైన వ్యవహారమే కాబట్టి అసలైన బ్యాంగ్ కోసం ఎదురు చూస్తుండగా అలా అలా నెట్టుకొచ్చి కాస్త వేగంగానే ఇంటర్వెల్ దగ్గరకు తీసుకొస్తాడు. ట్రైలర్ లో ఆల్రెడీ చెప్పేసిన పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఏ రేంజ్ లో ఉంటుందోననే కాసిన్ని ఆశలతో సీట్లో కూర్చున్నాక సెకండ్ హాఫ్ మొదలవుతుంది.
ఇక్కడ డైరెక్టర్ తీసుకున్న వయొలెంట్ టర్న్ మితిమీరిన ఎలివేషన్లతో నిండిపోవడంతో కాళేశ్వర్ రెడ్డి తాలూకు రెండో సగం కాస్తా బ్యాక్ టర్న్ తీసుకుని బలహీనంగా మారిపోయింది. ఇదేం చంపడంరా బాబోయ్ అనిపించే స్థాయిలో నరుక్కుంటూ పోవడం మాస్ కాదు. ఆ ఊచకోతకు తగిన న్యాయం జరిగేలా ముందు వెనుకా సరైన సీన్లు, ఎపిసోడ్లు పడాలి. అప్పుడే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. శ్రీకాంత్ మీద జయం మనదేరా, ఆది, సాంబ, ఇంద్ర లాంటి ఫ్యాక్షన్ సినిమాల ప్రభావం గట్టిగా ఉన్న విషయం అర్థమవుతూనే ఉంటుంది. కానీ అవి సక్సెస్ కావడానికి గల కారణాలు కూడా సరైన రీతిలో వంటబట్టించుకుని ఉంటే ఆదికేశవలో జరిగిన హెచ్చుతగ్గులు ఉండేవి కాదు.
ఎంత మెగా ఫ్యామిలీ అయినా వాళ్ల ప్రతి హీరోని ఫ్యాన్స్ ఊర మాస్ గా చూడాలని కోరుకోవడం లేదు. అలాంటప్పుడు ఒక ఫేడ్ అవుట్ ఫార్ములాని వైష్ణవ్ లాంటి లేత కుర్రాడి మీద ప్రయోగించడం అర్థం లేని రిస్క్. ఆ మాటకొస్తే ఇంత పేరొచ్చాక కూడా వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్ వాటి జోలికి రెగ్యులర్ గా వెళ్లడం లేదు. లాజిక్స్ అక్కర్లేని ఇలాంటి కథల్లో స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ గా ఉంటేనే లోపాలు కవరైపోతాయి. దర్శకుడు శ్రీకాంత్ ఈ బేసిక్ పాయింట్ మిస్సయిపోయి కేవలం హీరోయిజంని నమ్ముకుని చేసిన గాంధార యుద్ధమిది. కళ్ళకు గంతలు కట్టుకుని శత్రువుతో పొరపడితే చివరికి ఓడేదెవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆదికేశవలో జరిగిందిదే.
ప్రేక్షకుల అభిరుచుల్లో ఎంత మార్పు వచ్చినా మాస్ కమర్షియల్ సినిమాలకు కాలం చెల్లిపోదు. రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ లు కేవలం భారీ బడ్జెట్ లతో చరిత్ర సృష్టించడం లేదు. పల్స్ ని పసిగట్టి ఎక్కడ కొట్టాలో అక్కడ గురి చూసి అస్త్రం వదులుతున్నారు. కానీ శ్రీకాంత్ టైపు దర్శకులు మాత్రం అమ్ములపొదిని చూసుకోకుండా కేవలం రెండు బాణాలతో బరిలో దిగి వన్ సైడ్ వార్ లో ఓడిపోతున్నారు. కంటెంట్ గురించి కామెంట్లు వచ్చినా పర్లేదు కాసులు వస్తే చాలనుకునే ట్రెండ్ లో కనీస స్థాయిలో ప్రెజెంటేషన్ లేకపోతే ఎన్ని ఆదికేశవలు వచ్చినా ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఇంకో పది ఇరవై సంవత్సరాల తర్వాతైనా.
నటీనటులు
మెగా స్టాంప్ తో నెట్టుకొస్తున్న వైష్ణవ్ తేజ్ ఇంకా అప్ కమింగ్ స్టేజిలోనే ఉన్నాడు. మెరుగు పడాల్సింది చాలా ఉంది. సాఫ్ట్ గా కనిపించినంత సేపు ఓకే కానీ రెండో సగంలో కాళేశ్వర్ గా కనిపించే తతంగంలోనే తడబాటు కనిపిస్తుంది. శ్రీలీలకు ఇంకో రొటీన్ పాత్ర దక్కింది. భగవంత్ కేసరిలో చూసిన పెర్ఫార్మన్స్ తో పోల్చుకుని నిరాశ పడాల్సి వస్తుంది. డాన్సులు ఓకే. మలయాళ నటుడు జిజు జార్జ్ విలనీ రవిశంకర్ డబ్బింగ్ లో క్రూరత్వాన్ని బాగానే పలికించింది కాని ఏమంత ఫ్రెష్ గా అనిపించకపోవడం లోటే. రాధికా శరత్ కుమార్, జయప్రకాష్, సదా, తనికెళ్ళ భరణి, అపర్ణ దాస్, సుదర్శన్ తదితరులవి కొట్టిన పిండి లాంటి అరిగిపోయిన రెగ్యులర్ పాత్రలే.
సాంకేతిక వర్గం
ఇటీవలే టైగర్ నాగేశ్వరరావుతో నిరాశపర్చిన జివి ప్రకాష్ కుమార్ ఇందులో కూడా మమ అనిపించాడు. వంద సినిమాల అనుభవమున్న కుర్రాడి నుంచి ఆశించే అవుట్ ఫుట్ అయితే ఇది కాదు. బీజీఎమ్, పాటలు అంతంత మాత్రమే. డూడ్లీ ప్రధాన ఛాయాగ్రాహకుడు కాగా ప్రసాద్ మూరెళ్ళ – ఆర్థర్ కె విల్సన్ అదనపు బాధ్యతలు తీసుకున్నారు. గ్రాండ్ లుక్ అయితే ఇచ్చారు. రెండు గంటల తొమ్మిది నిమిషాల నిడివే కాబట్టి ఎడిటర్ నవీన్ నూలిని కంటెంట్ పరంగా కామెంట్ చేయలేం. ఏదున్నా శ్రీకాంత్ ఎన్ రెడ్డికే దక్కుతుంది. రామ్ లక్ష్మణ్ పోరాటాలు ఈసారి ఓవర్ ది బోర్డు వెళ్లాయి. సితార, ఫార్చ్యూన్ ఫోర్ నిర్మాణ విలువలు స్క్రిప్ట్ డిమాండ్ చేసినంత ఇచ్చాయి
పాజిటివ్ పాయింట్స్
తక్కువ నిడివి
నిర్మాణ విలువలు
నెగటివ్ పాయింట్స్
రొటీన్ కథా కథనాలు
అర్థం లేని హీరోయిజం
సంగీతం
అరిగిపోయిన సెకండాఫ్
ఫినిషింగ్ టచ్ : మూసలో నలిగిన కేశవ
రేటింగ్ : 2 / 5