సమీక్ష – బ్రో

2.5/5

115 Minutes   |   Comedy - Drama   |   28-07-2023


Cast - Pawan Kalyan, Sai Dharam Tej, Ketika Sharma, Priya Varrier, Rohini, Vennela Kishore and others

Director - Samuthirakani

Producer - T. G. Vishwa Prasad, Vivek Kuchibotla

Banner - People Media Factory

Music - S Thaman

పవన్ కళ్యాణ్ సినిమా వచ్చి ఏడాది దాటేసింది. ఒకపక్క జనసేన వారాహి యాత్ర విజయవంతమైన నేపథ్యంలో మంచి ఊపులో ఉన్న అభిమానులు తమ హీరోని నెలల గ్యాప్ తర్వాత చూసే ఛాన్స్ రావడంతో బ్రో మీద మంచి అంచనాలు పెట్టుకున్నారు. నిజానికి పవర్ స్టార్ రేంజ్ హడావుడి లేకపోయినప్పటికీ టీమ్ ఇంటర్వ్యూలు, చెప్పిన పలు ఆసక్తికరమైన సంగతులు హైప్ ని క్రమంగా పెంచుతూ వెళ్లాయి. వినోదయ సితం రీమేక్ గా త్రివిక్రమ్ రచన, సముతిరఖని దర్శకత్వంలో రూపొందిన బ్రో అంచనాలను నిలబెట్టుకుందా

కథ

మార్కండేయ అలియాస్ మార్క్ (సాయి తేజ్) బిజీ ఉద్యోగి. చేస్తున్న పనులకు టైం సరిపోక నిత్యం సతమతమవుతూ ఉంటాడు ఇంట్లో తల్లి, పెళ్లి కావాల్సిన చెల్లెళ్లు, విదేశంలో ఉద్యోగం చేసే తమ్ముడు ఇదీ అతని ఫ్యామిలీ. ఓసారి రోడ్డు యాక్సిడెంట్ ద్వారా టైం అలియాస్ టైటన్(పవన్ కళ్యాణ్) పరిచయమై మార్క్ జీవితంలోకి అడుగు పెడతాడు. అక్కడి నుంచి అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంతకీ వీళ్ళ స్నేహం వెనుక ఉన్న గుట్టేంటి, చివరికి ఆ యువకుడి ప్రయాణం ఏ మజిలీకి చేరుకుందన్నదే స్టోరీ

విశ్లేషణ

ఒకప్పుడేమో కాని గత మూడేళ్ళలో ఓటిటి టెక్నాలజీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చాక రీమేక్ అనేది చాలా రిస్కుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. కథ తీరు, సన్నివేశాలు ఎలా ఉంటాయనేది ఆడియన్స్ కి ముందుగానే తెలిసిపోతున్నాయి. అందుకే డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ జరుపుకున్న వినోదయ సితంని పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద హీరోతో తీస్తారని ప్రకటించినప్పుడు అభిమానులు ఒకింత నిరాశకు గురయ్యారు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ దీన్ని చూసిన కోణం వేరు. ఒరిజినల్ వెర్షన్లో క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసిన పాత్రలను ఇక్కడ ఇమేజ్ ఉన్న స్టార్లతో చేయడం కత్తి మీద సాము లాంటిదని తెలిసి కూడా ఆ సవాల్ ని స్వీకరించి మార్పులకు సిద్ధపడ్డారు.

ఆలోచన వరకు ఉన్నతంగా ఉన్న బ్రో అంత పెద్ద మాటల మాంత్రికుడి అండ ఉన్నా కూడా చాలా తేలికైన దారాల మీద బరువైన ప్రయాణం చేయబోయింది. ఏది శాశ్వతం కాదు, బాధ్యతలను సక్రమంగా, ఎలాంటి స్వార్థం లేకుండా నిర్వర్తించినప్పుడే దేవుడు మనవైపు ఉంటాడనే అంతర్లీన సందేశాన్ని చెప్పాలనే ఉద్దేశం దర్శకుడు సముతిరఖనిది. తమిళంలో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చారు. టైటిల్ రోల్ తానే చేయడంతో పాటు వయసు మళ్ళిన ఉద్యోగి క్యారెక్టర్ ని తంబి రామయ్యకు ఇవ్వడంతో తగినంత సృజనాత్మకత స్వేచ్ఛ దొరికింది. కానీ బ్రోకు ఆ ఛాన్స్ లేదు. మెగా మావయ్య అల్లుడు కాంబోకు కమర్షియల్ కొలతలతో బట్టలు కుట్టాలనుకున్నారు.

మార్క్ కుటుంబాన్ని ఎస్టాబ్లిష్ చేయడం దగ్గరే తడబాటు జరిగిపోయింది. టైటాన్ ప్రవేశించాక వేగం పెరగాల్సింది పోయి ఎంతసేపూ పవన్ కళ్యాణ్ పాత పాటల బిట్లను వింటేజ్ ఫీల్ కోసం పదే పదే వాడటంతో కనెక్ట్ కావాల్సిన ఫీల్ కాస్తా విజిల్స్ గోలలో కొట్టుకుపోయింది. గోపాల గోపాలలో వెంకటేష్, పవన్ లు పరస్పరం కామెడీ చేసుకున్నా అదంతా హుందాగా ఉంటుంది. కానీ ఆ పోలిక రాకూడదనే ఉద్దేశంతో కాబోలు ఇక్కడ పవన్ తేజ్ మధ్య సన్నివేశాలను లైటర్ వీన్ లో రాసుకోవడంతో హై మూమెంట్స్ లేక ఫ్లాట్ గా గడిచిపోయింది. దీనికి తోడు టైం గొప్పదనాన్ని ప్రెజెంట్ చేసే స్కోప్ ఉన్న బ్రహ్మానందం భరణితో ఉన్న ఎపిసోడ్లు మొక్కుబడిగా మారిపోయాయి.

ఫలానా టైంలో ఇంతే బడ్జెట్ తో తీయాలని టార్గెట్ పెట్టుకోవడం వల్లే బ్రో స్క్రిప్ట్ విషయంలో తగినంత హోమ్ వర్క్ జరగలేదనే విషయం అర్థమైపోతుంది. ప్రధాన బలంగా నిలవాల్సిన త్రివిక్రమ్ మాటలు కొన్ని చోట్ల ప్రాస కోసం శృతి తప్పాయి. బెడ్ రూమ్ లో చొక్కా విప్పొచ్చు, బాత్ రూమ్ లో అండర్ వేర్ విప్పొచ్చు అంటూ టైటాన్ క్యారెక్టరైజేషన్ ని వర్ణించిన తీరు అభిమానులు సైతం సమర్ధించలేరు. నిజానికి ఫస్ట్ హాఫ్ లో తేజు పవన్ ల మధ్య హిలేరియస్ సీన్లు పడేందుకు బోలెడు స్కోప్ ఉంది. ఎంతసేపూ పవన్ స్వాగ్ ని చూపించే ప్రయత్నం తప్ప కథా కథనాల మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాలన్న సోయ తగ్గిపోవడం వల్ల తేడా జరిగిపోయింది.

ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్, సెంటిమెంట్లు కొంత వరకు పండాయి. తేజు పాత్రను గమ్యం వైపు తీసుకెళ్లే విధానంలో మెచ్యురిటీని ప్రదర్శించడం వల్ల ఆ ఒక్క భాగం ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇందులో విలన్ అంటూ ఎవరూ లేరు. తప్పుగా ఆలోచిస్తే మనకు మనమే విలననే అంతర్లీన సూత్రాన్ని పాటించడం వల్ల సహజంగానే మాస్ కోరుకునే అంశాలకు చోటు దక్కలేదు. కేవలం పవన్ ఛార్ట్ బస్టర్స్ అక్కడక్కడా ప్లే చేసినంత మాత్రం మొదటి రోజు అభిమానులు ఊగిపోతారేమో కానీ రెగ్యులర్ ఆడియన్స్ కాదు. మార్క్ తాలూకు సంఘర్షణని ఇంకొంత బలంగా తీసుకొచ్చి, పైన చెప్పిన డీవియేషన్లను తగ్గించేసి ఉంటే బ్రో ఖచ్చితంగా బెటర్ గా నిలిచేది

నటీనటులు

పవన్ కళ్యాణ్ తన స్వాగ్ తో అభిమానులు కోరుకున్నవి పూర్తిగా ఇచ్చేశాడు. ఎనర్జీ, జోష్ ఎక్కడా తగ్గకుండా స్టయిల్, మ్యానరిజంతో నిలబెట్టేశాడు. సాయి తేజ్ బాగున్నాడు. యాక్టింగ్ పరంగా వంకలేం లేవు. మావయ్యతో కెమిస్ట్రీ బాగానే కుదిరింది. కేతిక శర్మ ఒక ఫారిన్ సాంగ్ కు తప్ప పెద్దగా ఉపయోగపడలేదు, రోహిణిది బాగా అలవాటైన తల్లి పాత్రే. ప్రియా వారియర్, యువలక్ష్మి చెల్లెళ్లుగా ఓకే. తనికెళ్ళ భరణి, వెన్నెల కిషోర్, అలీ రెజా, బ్రహ్మానందం, సుబ్బరాజు, రాజా, సముతిరఖని ఉన్న కాసింత సేపు పర్వాలేదనిపించుకున్నారు. కొత్తదనమంటూ ఏమీ లేదు. పవన్ తేజ్ లకు తప్ప గుర్తుండిపోయే పెర్ఫార్మన్స్ ఇచ్చే ఛాన్స్ ఎవరికీ దక్కలేదు.

సాంకేతిక వర్గం

తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నిరాశ పరచలేదు. మరీ కెరీర్ బెస్ట్ అని చెప్పలేం కాని ఇన్ని పరిమితులు ఉన్న ఇలాంటి సబ్జెక్టుకి కంపోజ్ చేయడం కష్టం. అయినా మెప్పించాడు. కానీ పాటలు చప్పగా తేలిపోయాయి. డ్యూయెట్ సాంగ్ కలర్ ఫుల్ గా ఉన్నా ట్యూన్, డాన్స్ రెండూ మిస్ ఫైర్. సుజిత్ వాసుదేవ్ ఛాయాగ్రహణం తన బాధ్యతలో లోపం రానివ్వలేదు. విఎఫ్ఎక్స్ లోపాల వల్ల అవుట్ ఫుట్ అక్కడక్కడా రాంగైనా ఆ నింద ఈయనకు రాదు. నవీన్ నూలి ఎడిటింగ్ సాధ్యమైనంత ల్యాగ్ లేకుండా చూసుకుంది. రాత తీతలో బలం లేకపోవడం వల్ల ల్యాగ్ లేకపోయినా ఆసక్తి కలగదు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా రిస్క్ పడలేదు

ప్లస్ పాయింట్స్

పవన్ కళ్యాణ్ ఎనర్జీ
ప్రీ క్లైమాక్స్ ఎమోషన్లు
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్

తేలికైన స్క్రీన్ ప్లే
వీక్ ఫస్ట్ హాఫ్
ఫ్లాట్ నెరేషన్
పాటలు

ఫినిషింగ్ టచ్ : కిక్కు సరిపోలేదు బ్రో

రేటింగ్ : 2.5/5