సమీక్ష – స్పై

2.25/5

  |   Action   |   29-06-2023


Cast - Nikhil, Iswarya Menon, Aryan Rajesh, Sanya Thakur, Abhinav Gomatam and others

Director - Garry BH

Producer - Rajasekhar Reddy

Banner - ED Entertainments

Music - Vishal Chandrasekhar, Sricharan Pakala

గత ఏడాది కార్తికేయ 2 రూపంలో ప్యాన్ ఇండియా రేంజ్ లో భారీ సక్సెస్ అందుకున్నాక నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా కొత్త మలుపు తిరిగింది. బడ్జెట్ లు పెంచుతూ నిర్మాతలు గ్రాండియర్ సబ్జెక్టులతో ముందుకొస్తున్నారు. అందులో స్పై ఒకటి. విడుదల విషయంలో కొంత హడవిడి జరిగినా ప్రమోషన్ల దగ్గర అంతా తన భుజాల మీద వేసుకున్న నిఖిల్ గత పదిరోజులుగా నాన్ స్టాప్ గా తిరుగుతూనే ఉన్నాడు. ఇది కూడా తనకు మరో గొప్ప విజయం అందిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. మరి స్పై కోరుకున్న టార్గెట్ చేరుకున్నాడా లేదా

కథ

ఇండియా తరఫున ఒక మిషన్ మీద వెళ్లి ప్రాణాలు కోల్పోయిన గూఢచారి సుభాష్(ఆర్యన్ రాజేష్). మరణానికి కారణం వెతకడం కోసం ప్రమాదకరమైన మిషన్ కు సిద్ధపడతాడు రా ఏజెంట్ జై(నిఖిల్). ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఖదీర్ ఖాన్(నితిన్ మెహతా)ని పట్టుకోవడానికి దేశ విదేశాలు వెళ్తాడు. కానీ అనూహ్యమైన చిక్కుముళ్ళు ఎదురవుతాయి. దీని వెనుక ఒక ప్రొఫెసర్(జిస్సుసేన్ గుప్తా) హస్తం ఉందని గుర్తించి వేట మొదలుపెడతాడు. ఎన్నో ప్రమాదాల మధ్య బయలుదేరిన జై చివరికి ఎలా గమ్యం చేరుకున్నాడనేదే తెరమీద చూడాలి

విశ్లేషణ

రహస్య ఏజెంట్లను హీరోలుగా చూపించే సినిమాలు సూపర్ స్టార్ కృష్ణ కాలం నుంచి అడవి శేష్ గూఢచారి వరకు ఎన్నో వచ్చాయి, వస్తున్నాయి. దేశం కోసం ప్రాణాలను రిస్క్ లో పెట్టి ఎక్కడో విదేశాల్లో అజ్ఞాతంలో బ్రతికే వ్యక్తుల రియల్ స్టోరీస్ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అయితే ఇవి మెప్పించేలా చేయాలంటే బోలెడంత హోమ్ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. రక్షణ విభాగాల్లోని వ్యవస్థ ఎలా పని చేస్తుంది, అందులో ఉద్యోగులు ఎలాంటి శిక్షణ పొందుతారు, ప్రభుత్వం వాళ్ళ పట్ల అనుసరించే వైఖరి ఇవన్నీ పూర్తిగా కాకపోయినా బేసిక్ లెవెల్ లో సమాచారం సేకరించుకోవాలి. ఒకప్పుడు ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా చెల్లిపోయేది కానీ ఇప్పుడు కాదు.

దర్శకుడు గ్యారీ తీసుకున్న పాయింట్ మంచిదే. సుభాష్ చంద్రబోస్ అంతర్ధానం గురించి ఎన్నో సీక్రెట్ ఫైల్స్ కనిపించకుండా పోయాయని ఇప్పటికీ ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ స్పై టీమ్ విపరీతంగా ప్రమోట్ చేసినట్టు ఇది ఎంత మాత్రం ఆ థీమ్ మీద రాసుకున్న సబ్జెక్టు కాదు. కేవలం ఒక సైడ్ లేయర్ గా వాడుకున్నారు తప్పించి ఎప్పుడో డెబ్భై అయిదేళ్ల క్రితం జరిగిన సంఘటనకు దీనికి సంబంధం లేదు. స్పై ఒక రివెంజ్ డ్రామా. దానికి దేశభక్తి జోడించే ప్రయత్నం చేశారు. రానా లాంటి స్టార్ హీరోలతో క్యామియోలు చేయించి స్టార్ వేల్యూ యాడ్ చేశారు. కానీ ఇవి ఎన్ని ఉన్నా అసలు స్టోరీలో లోపమున్నప్పుడు ఏం చేసినా వృథానే

టేకాఫ్ చాలా చప్పగా మొదలుపెట్టిన గ్యారీ సన్నివేశాలు ముందుకెళ్లే కొద్దీ ఫ్లాట్ స్క్రీన్ ప్లేతో నెరేషన్ ని గ్రిప్పింగ్ గా చెప్పలేకపోయాడు. నేపాల్, పాకిస్థాన్. శ్రీలంక, చైనా ఇలా ఎన్నో దేశాలు హీరో తిరుగుతూనే ఉంటాడు కానీ ఎక్కడా సరైన టెంపో ఉండదు. ఒకటి రెండు సీన్లు తప్పించి ఇది బాగుందే అని చెప్పడానికి ఛాన్స్ ఇవ్వలేదు. కోట్లాది ప్రజల ప్రాణాలకు సంబంధించిన మిషన్ ని చూస్తున్న అధికారి పదే పదే జైని సమురాయ్ కథ విన్నావా అని అడగడం, ఏజెంట్లను పోగేసి ఖాదిర్ దొరికాడా అని ఎస్ఐలా నిలదీయడం కన్విన్సింగ్ గా లేవు. ఇలాంటి ఆపరేషన్లలో పాల్గొనే ఏజెంట్ల వ్యవహారాలు సీరియస్ గా ఉంటాయి. కానీ అభినవ్ గోమటంతో సిల్లీగా మార్చేశారు.

ట్విస్టులు ఉంటే సరిపోదు. దానికి సరైన ప్రెజెంటేషన్ పడాలి. అలియా భట్ రాజీ జనాన్ని కట్టిపడేయడానికి కారణం ఇదే. ఆమె ఏం చేయబోతోందో ముందే గెస్ చేయగలిగినా ఎలా చేస్తుందన్నఆసక్తిని రేపి ఆ ఎపిసోడ్లను నడిపించే తీరు శభాష్ అనిపిస్తుంది. స్పైలో మిస్ అయ్యింది ఇదే. ఖాదిర్ ని పట్టుకునే క్రమంలో జరిగే జై చేసే ప్రయాణం ఎగ్జై టింగ్ గా మలచడంలో గ్యారీ పూర్తిగా విఫలమయ్యాడు. అందుకే నిఖిల్ చేసిన ఏ జర్నీ థ్రిల్ ఇవ్వదు. రవివర్మ తాలూకు ట్విస్టు, బాడీ డబుల్ కాన్సెప్ట్, స్వయంగా ప్రధాని నిస్సహాయంగా మిగిలినట్టు చూపించడం ఇవన్నీ సహజత్వానికి దూరంగా నిలిచాయి. హీరోయిన్ ట్రాక్ మరీ బలహీనంగా ఉండటం ఇంకో ప్రధాన మైనస్

ఒకవేళ పూర్తిగా సుభాష్ చంద్రబోస్ మీదే స్పైని నడిపించినా నెక్స్ట్ లెవెల్ లో ఉండేదేమో. అయితే చేతిలో తగినంత సరుకు లేకపోవడం వల్ల అది కేవలం పబ్లిసిటీ మెటీరియల్ గా మిగిలిపోయింది. సినిమా అయిపోయాక బోస్ గారు ఏమయ్యారు, ఆ ఫైల్స్ లో ఏముందనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. ఒక పెద్ద క్లైమాక్స్ ఫైట్ పెడితే మర్చిపోతారని భావించారు కాబోలు. తేలికైన కథనాలతో ఇలాంటి క్లిష్టమైన స్పైలను కన్విన్స్ అయ్యేలా చెప్పడం కష్టం. రీసెర్చ్ ముఖ్యం. బాలీవుడ్లో ఎక్కువగా వచ్చే ఇలాంటి స్పై డ్రామాలను చూసి ఇన్స్ ఫైర్ అవ్వడం మంచిదే కానీ వాటిలో స్టాండర్డ్ ని కూడా ఫాలో అయినప్పుడే ఇక్కడ కూడా మంచి ఫలితం వస్తుంది

నటీనటులు

నిఖిల్ కష్టం మీద ఎలాంటి ఫిర్యాదు లేదు. నటన వరకు ఏ లోపం రాకుండా చూసుకున్నాడు. ఎటొచ్చి తనకే ఇది అంతగా సూట్ కాలేదనిపిస్తుంది. ఇక్కడ దర్శకుడి లోపం కూడా ఉంది. ఐశ్వర్య మీనన్ అందం, అభినయం రెండూ వీకే. సాన్యా ఠాకూర్ కాసేపు హంగామా చేయడం తప్పించి అంతగా గుర్తుండదు. అభినవ్ గోమటం వన్ లైనర్లు అక్కడక్కడా పేలాయి కానీ సందర్భశుద్ధి లోపించింది. మకరంద్ దేశ్ పాండే, జిస్సు సేన్ గుప్తాల పెర్ఫార్మన్స్ లను ఒకే డబ్బింగ్ ఆర్టిస్టు సహాయంతో కవర్ చేశారు. సచిన్ కెడ్కర్, పోసాని, సురేష్ లవి కొన్ని నిమిషాల పాటు సింగల్ కాస్ట్యూమ్ పాత్రలు. అఖండ విలన్ నితిన్ మెహతా రొటీనే. రానా డైలాగుల వరకు ఒకే.

సాంకేతిక వర్గం

విశాల్ చంద్రశేఖర్ – శ్రీచరణ్ పాకాల ఇచ్చిన పాటలు వినసొంపుగా లేవు. విజువల్ గానూ అవసరం లేని చోట రావడం వల్ల మెదడుకి ఎక్కవు. నిడివి కోసం ఓ రెండు తీసేసినట్టున్నారు. శ్రీ చరణ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సౌండ్ బాగున్నప్పటికీ ప్రత్యేకంగా అనిపించే సిగ్నేచర్ బీట్ ఏదీ లేదు. వంశీ పచ్చిపులుసు-మార్క్ డేవిడ్ ఛాయాగ్రహణం వీలైనంత భారీతనాన్ని తెరమీద చూపించడంలో సఫలమయ్యాయి. దర్శకుడే ఎడిటర్ కావడంతో గ్యారీ కత్తెర మీద కామెంట్స్ కన్నా డైరెక్షన్ మీద విమర్శలే ఎక్కువ వస్తాయి. నిర్మాణ విలువల్లో రాజీ కనిపిస్తుంది. ఉన్నంతలో ఈ మాత్రం ఖర్చు పెట్టడం మెచ్చుకోవచ్చు.

ప్లస్ పాయింట్స్

నిఖిల్ కష్టం
కాన్సెప్ట్
ఓ రెండు యాక్షన్ బ్లాక్స్

మైనస్ పాయింట్స్

ఆసక్తి కలిగించని కథనం
చప్పగా ఉండే ట్విస్టులు
హీరోయిన్, విలన్
సుదీర్ఘంగా అనిపించే నిడివి

ఫినిషింగ్ టచ్ : టార్గెట్ మిస్

Rating: 2.25/5