సమీక్ష – నేను స్టూడెంట్ సర్

2.5/5

2 Hr 8 Mins   |   Action   |   02-06-2023


Cast - Bellamkonda Ganesh, Avantika Dassani, Samuthirakani, Sunil, Srikanth Iyengar and others

Director - Rakhi Uppalapati

Producer - Satish Varma

Banner - SV2 Entertainment

Music - Mahati Swara Sagar

మాస్ లో ఓ మోస్తరు మార్కెట్ ఉన్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు అనే బ్రాండ్ తో ఇండస్ట్రీకి వచ్చిన గణేష్ కి స్వాతిముత్యం రూపంలో మంచి డెబ్యూనే దొరికింది. అయితే దసరా రేసులో చిరంజీవి నాగార్జున లాంటి అగ్ర హీరోలతో పోటీ పడటం వల్ల మంచి కంటెంట్ ఉన్నా థియేటర్ ఆడియన్స్ కి చేరలేకపోయింది. అందుకే నేను స్టూడెంట్ సర్ కి టైమింగ్ సమస్య రాకుండా పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చారు. అయినా కూడా అహింస, పరేషాన్ లతో కాంపిటీషన్ తప్పలేదు. ఇంతకీ స్టూడెంట్ ఎగ్జామ్ పాస్ అయ్యాడా లేదా

కథ

చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసే సుబ్బు(బెల్లంకొండ గణేష్)కి ఐఫోన్  అంటే పిచ్చి. పైసా పైసా కూడబెట్టి కొనుక్కుని దానికి తమ్ముడు బుచ్చి అని పేరు పెట్టుకుంటాడు. మొదటిరోజే కాలేజీలో జరిగిన యునియన్ గొడవల్లో దాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుంటారు. అయితే తిరిగి రాదు. దాన్ని ఎలాగైనా వెతికి తెచ్చుకోవాలన్న పంతంతో ఏకంగా సిటీ పోలీస్ కమీషనర్(సముతిరఖని)తో గొడవ పెట్టుకుంటాడు. ఆయన కూతురు శృతి(అవంతిక దాసాని)సుబ్బు లవర్. చివరికి ఇతని లక్ష్యం నెరవేరిందా లేదానేదే అసలు స్టోరీ

విశ్లేషణ

సబ్జెక్టు ఎలాంటిదైనా నవ్యత లేనిదే ఆడియన్స్ ఒప్పుకోవడం లేదు. నిజమే. అందులోనూ చిన్న హీరోలతో చేసేటప్పుడు సంథింగ్ స్పెషల్ అనిపించేలా కొన్ని అంశాలు ఖచ్చితంగా ఉండాలి. దర్శకుడు రాఖీ ఉప్పలపాటి దీన్ని దృష్టిలో ఉంచుకునే నేను స్టూడెంట్ సర్ మొదలుపెట్టారు కామోసు. హీరోకి ఐఫోన్ మీదున్న పిచ్చి ప్రేమ ఎలాంటి విపత్కర పరిణామాలను తీసుకొచ్చిందనే బ్యాక్ డ్రాప్ మీద స్క్రిప్ట్ అల్లుకున్నారు. పాయింట్ వరకు ఓకే కానీ దాన్ని విస్తరించే క్రమంలో ట్విస్టులకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా కథనం మీద పెట్టకపోవడంతో అసలు ఉద్దేశం దెబ్బ తింది. స్క్రీన్ ప్లేని పూర్తిగా పక్కదారి పట్టించేసింది

నిజానికి ఒకప్పుడు యూత్ కి ఐఫోన్ మీదున్నంత మోజు ఇప్పుడు లేదు. దానికి కారణాలు బోలెడు. అందుకే ఫస్ట్ హాఫ్ లో ఫోన్ పోగొట్టుకున్నాక సుబ్బు పదే పదే కనిపించిన వాళ్లందరికీ దాని స్పెసిఫికేషన్స్ ని ధరని చెబుతూ అక్కడ పాత్రలనే కాదు చూస్తున్న మనల్ని కూడా ఇరిటేట్ చేస్తాడు. కేవలం హీరోయిన్ కు టిక్ టాక్ పిచ్చి ఉండటం వల్ల స్మార్ట్ ఫోన్ల మీద ద్వేషం పెరిగిందని చెప్పడానికి తప్ప ఈ స్టోరీని 2020లో జరిగినట్టుగా ఎందుకు చూపించారో అర్థం కాదు. మొదలుపెట్టిన కాసేపటికే అసలు కథ మొదలుపెట్టిన రాఖీ హీరో హీరోయిన్ మధ్య స్నేహం ప్లస్ ప్రేమకు సంబంధించిన థ్రెడ్ ని అత్యంత బలహీనంగా రాసుకోవడంతో బోర్ కి ఆస్కారం దక్కింది .

ఇంటర్వెల్ దగ్గర ఇచ్చిన ట్విస్ట్ మైండ్ బ్లోయింగ్ అనిపించేలా లేకపోయినా చిన్నపాటి షాక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత వేగాన్ని ఆశిస్తాం. అనుకున్నట్టుగానే బోలెడు మలుపులు మెట్రో స్పీడ్ లా పరిగెత్తుతూ ఉంటాయి. కానీ ఏదీ థ్రిల్ కలిగించేలా ఉండదు. చాలా చప్పగా సాగిపోతాయి. స్క్రీన్ ప్లే అంటే సన్నివేశాలు కదలడం కాదు. గ్రిప్పింగ్ గా ఉంటూ ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం. కానీ రాఖీ ఇక్కడే తడబడ్డాడు. కాలేజీలో స్టూడెంట్ పాలిటిక్స్ ని బ్యాంకింగ్ స్కామ్ తో ముడిపెట్టి దాన్ని సుబ్బు పోలీస్ కమీషనర్ మధ్య యుద్ధంగా మార్చాలన్న ఆలోచన మంచిదే కానీ వీటిని బాలన్స్ చేయడానికి సరిపడా వెయిట్ ఉన్న ఎపిసోడ్స్ రాసుకోలేకపోవడం ప్రధాన మైనస్

దానికి తోడు లాజిక్స్ ని ఆమడదూరంలో పెట్టేశారు. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ సహజత్వానికి దగ్గరగా ఉండాలి. అప్పుడే కనెక్టివిటీ పెరుగుతుంది. కానీ సుబ్బు హంతకులను వెతికే క్రమంలో సినిమాటిక్ లిబర్టీ ఎక్కువైపోవడంతో జరుగుతున్నవి నమ్మశక్యంగా అనిపించవు. పైగా క్యాస్టింగ్ విషయంలో చేసిన పొరపాట్లు స్పీడ్ బ్రేకర్లా అడ్డు పడ్డాయి. హీరోయిన్ తో హిందీలో మాట్లాడించి తెలుగులో డబ్బింగ్ చెప్పించినప్పుడు వీలైనంత క్లోజ్ అప్ షాట్స్ లేకుండా చూసుకోవాలి. ఇలాంటి టెక్నికల్ మిస్టేస్ బోలెడు జరిగాయి. అసలు నిందితులుగా ఎంచుకున్న ఆర్టిస్టులు సైతం మిస్ ఫిట్ అయ్యారు. దీంతో క్లైమాక్స్ లో దక్కాల్సిన కాసింత సర్ప్రైజ్ మిస్ అయ్యింది

ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ రెండూ స్టూడెంట్ లో జీరో అయ్యాయి. మొదటి పావు గంట చూపించిన సుబ్బు తల్లితండ్రులు తర్వాత మాయమవుతారు. కాలేజీ విద్యార్థులతో నితిన్ సై రేంజ్ లో మంచి ఎలివేషన్ స్కోప్ ఉన్న సీన్లు పెట్టుకోవడనికి ఛాన్స్ ఉన్నప్పటికీ ఎంతసేపూ సుబ్బు కమీషనర్ వ్యవహారం మీదే దృష్టి పెట్టడంతో ఇంపాక్ట్ తగ్గుతూ వెళ్లిపోయింది. స్టూడెంట్స్ గా కొందరు ముదురు ఆర్టిస్టులను పెట్టుకోవడం బ్యాడ్ టేస్ట్. అన్నీ సుబ్బుకు అనుకూలంగా జరగడం కన్విన్సింగ్ గా చెప్పలేకపోయారు. థ్రెడ్ మిల్ మీద ఎంత వేగంగా పాదాలు కదిపినా ఉన్న చోటే ఉంటాం కానీ పెట్టుకున్న గమ్యం వైపు వెళ్లలేం. నేను స్టూడెంట్ సర్ లో కూడా అదే జరిగింది.

నటీనటులు

బెల్లంకొండ గణేష్ ఇంకా బేసిక్స్ లోనే ఉన్నాడు. డాన్సు చేసే పాటలు లేవు కాబట్టి దాని గురించి నో కామెంట్. హీరోయిన్ అవంతిక దాసాని పెద్ద మైనస్. అందం అభినయం రెండూ శూన్యమే. సముతిరఖనికి ఇది కొట్టేసిన పిండి. ఎప్పటిలాగే తొక్కుకుంటూ వెళ్లిపోయారు కానీ గుర్తుండిపోయేలా ఎలాంటి ప్రత్యేకంగా  ఇందులో లేదు. సునీల్ కాసేపు కనిపించి మాయమయ్యాడు. ఆటో రామ్ ప్రసాద్ తో ఏదో డిఫరెంట్ గా ట్రై చేయించారు కానీ పండలేదు. చరణ్ డీప్, ప్రమోదిని, సూర్య, శ్రీకాంత్ అయ్యంగార్ ఇలా తారాగణం ఉన్నా అందరి పరిధి పరిమితం

సాంకేతిక వర్గం

మహతి స్వరసాగర్ నేపధ్య సంగీతంలో అక్కడక్కడా మెరుపులు ఉన్నాయి తప్పించి ప్రత్యేకంగా తనదైన ముద్ర ఎక్కడా చూపించలేదు. పాటలు కట్ చేసినట్టు ఉన్నారు. ఫస్ట్ హాఫ్ లో వచ్చేవి తర్వాత గుర్తుండవు. అనిత్ మదాడి ఛాయాగ్రహణంలో స్టాండర్డ్ లేదు. కొన్ని ఫ్రేమ్స్ పర్వాలేదనిపించినా పనితనం గురించి ప్రత్యేకంగా చెప్పుకునే ఛాన్స్ ఇవ్వలేదు. చోటా కె ప్రసాద్ లాంటి అనుభజ్ఞుల సలహా మేరకే సాంగ్స్ ట్రిమ్ చేశారేమో కానీ తొలిసగం ల్యాగ్ ని ఆయన కాపాడలేకపోయారు. కల్యాణ చక్రవర్తి సంభాషణల్లో ఒకటి రెండు చురుకులు తప్ప అతి మాములుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు మరీ గొప్పగా లేవు కానీ కొంత రాజీపడిన ధోరణి కనిపిస్తుంది

ప్లస్ పాయింట్స్

కొన్ని మలుపులు
నిడివి తగ్గడం
కొంత ప్రీ క్లైమాక్స్  

మైనస్ పాయింట్స్

మితిమీరిన ట్విస్టులు
హీరోయిన్
రాంగ్ క్యాస్టింగ్
నెరేషన్

ఫినిషింగ్ టచ్ : జారిపడిన స్టూడెంట్

రేటింగ్ : 2.5 /5