2.5/5
2 Hr 30 Mins | Family | 26-05-2023
Cast - Sumanth Prabhas, Mani Aegurla, Mourya Chowdary, Saarya, Siri Raasi, Kiran Macha and others
Director - Sumanth Prabhas
Producer - Anurag Reddy, Sharath Chandra, Chandru Manoharan
Banner - Chai Bisket Films
Music - Kalyan Nayak
చిన్న సినిమాకు ఓపెనింగ్స్ తెచ్చుకోవడం నిర్మాతల తలకు మించిన భారంగా మారిన తరుణంలో మంచి మార్కెటింగ్ టెక్నిక్స్ ద్వారా దాన్ని జనానికి చేరువ చేయడంలో ఛాయ్ బిస్కెట్ టీమ్ ప్లానింగ్ ఆకట్టుకునేలా సాగుతోంది. మేమ్ ఫేమస్ విషయంలో అనుసరించిన స్ట్రాటజీ, సెలబ్రిటీలను తీసుకొచ్చి బ్యాండ్ మధ్య ప్రాసలతో ఎలివేషన్లు ఇచ్చిన విధానం యూత్ ని ఆకట్టుకున్నాయి. ముందు రోజు రాత్రే స్పెషల్ ప్రీమియర్లు వేయడం బజ్ ని పెంచడానికి ఉపయోగపడింది. మరి టైటిల్ లో ఉన్న ఫేమస్ కంటెంట్ లో ఉందా
కథ
తెలంగాణలోని బండ్ల నర్సంపల్లి అనే చిన్న గ్రామం. తాగడం తిరగడం తప్ప ఏ పని లేకుండా తిరిగే ముగ్గురు కుర్రాళ్ళు మై అలియాస్ మహేష్(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఆరేగుల), బాల(మౌర్య నలగట్ల). గొడవలు తెచ్చుకుని ఊళ్ళో వాళ్ళతో మాటలు పడలేక స్వంత కాళ్ళ మీద నిలబడదామని టెంట్ హౌస్ మొదలుపెడతారు. వ్యాపారం బాగా జరుగుతున్న టైంలో ప్రమాదం జరిగి జీవితం మళ్ళీ మొదటికే వస్తుంది. అప్పులు పెరిగిపోతాయి. దీంతో డబ్బు సంపాదించి ఫేమస్ కావడం కోసం కొత్త ఐడియా వేస్తారు. అదే అసలు స్టోరీ
విశ్లేషణ
ముగ్గురు బేవార్స్ యువకుల చుట్టూ తిరిగే పాయింట్ తో తెలుగులో బోలెడు సినిమాలొచ్చాయి. ఎక్కడిదాకో ఎందుకు జాతిరత్నాలు ఇదే కోవలోకి చెందిందే. దర్శకుడు కం రచయిత సుమంత్ ప్రభాస్ దాన్నుంచి స్ఫూర్తి తీసుకున్నాడో లేదో కానీ ఆ ఫ్లేవర్ తో మొదలై బలగం టైపు ఎమోషన్ ని మిక్స్ చేయబోయి ఫీల్ గుడ్ మూవీ ఇచ్చే ప్రయత్నం చేద్దామనుకున్నాడు. దానికి ఇతను వాడిన ప్రధాన ఆయుధం ఎంటర్ టైన్మెంట్. నవ్వించుకుంటూ పోతే లాజిక్స్ ఎలాగూ గుర్తుకురావు. ఈ సబ్జెక్టుకు అవి అవసరం లేదు. సరిపడా మోతాదులో ఎమోషన్లు దట్టిస్తే చాలు అన్ని వర్గాలకు కనెక్ట్ అయిపోతామన్న ఆలోచనతోనే మేం ఫేమస్ టైటిల్ నుంచి చివరి వరకు జరుగుతుంది
మొదట మైతో పాటు తన ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత జులాయిలో చెప్పడానికి చాలా టైం తీసుకున్న సుమంత్ అసలు కథలోకి ముప్పావు గంట తర్వాతే ప్రవేశిస్తాడు. అక్కడి దాకా జస్ట్ జోకులతో టైం పాస్ చేయించుకుంటూ వెళ్ళాడు. తెరమీద సన్నివేశాలు జరుగుతున్నంత సేపు నిజంగానే ఏదో పల్లెటూరిలో తిరుగుతున్నామనే ఫీలింగ్ కలిగిస్తాడు. ముఖ్యంగా పాత్రల మధ్య బంధాలను ఎస్టాబ్లిష్ చేసిన తీరు బాగానే ఉంది. స్వంత తల్లితండ్రులే ఛీ కొడితే సంబంధమే లేని సర్పంచ్ అన్నయ్యలా దగ్గరికి తీసుకోవడం, దుర్గ తండ్రి పొలం తాకట్టు పెట్టి వీళ్ళ బిజినెస్ కోసం లక్ష రూపాయలు అప్పు చేసివ్వడం హృద్యంగా సాగుతాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంతవరకు నచ్చుతాయి.
ఇంటర్వెల్ కు ముందు టెంట్ హౌస్ ట్విస్టు పెట్టాక ఈ ముగ్గురు తర్వాత ఏం చేస్తారనే ఆసక్తి పెరుగుతుంది. అయితే గంటంపావుకు సరిపడా ఎంగేజింగ్ కంటెంట్ సుమంత్ ప్రభాస్ దగ్గర లేకపోవడంతో యూట్యూబ్ ఛానల్ చుట్టే చాలాసేపు తిప్పి తిప్పి కథను నడిపించడంతో ల్యాగ్ ఫీలింగ్ మొదలవుతుంది. ఇక్కడ కొన్ని కామెడీ ఎపిసోడ్లు కవర్ డ్రైవ్ లా ఉపయోగపడ్డాయి. అంజి మామ ప్రేమకథ చెప్పిన తీరుకి నవ్వుకోకుండా ఉండలేం, లిప్ స్టిక్ చెప్పే శిరీష లవ్ స్టోరీ కూడా అంతే. ప్రతి అయిదు నిమిషాలకోసారి వ్యూస్ చెక్ చేసుకోవడం తప్పించి హీరోగా మనం చూస్తున్న మహేష్ చాలా సేపు నిస్సహాయంగా కనిపించడం స్క్రీన్ ప్లేని కదలనివ్వలేదు.
ఒకదశ దాటాక మేం ఫేమస్ ఫ్రెండ్స్ కు అనుకూలంగా పరిణామాలు జరిగిపోవడం అంత కన్విసింగ్ గా అనిపించదు. మై బృందం ఏదో హై అనిపించే మూమెంట్ ఇస్తుందని ఎదురు చూస్తాం. కానీ కేవలం ఎంటర్ టైన్మెంట్ ని నమ్ముకుని సుమంత్ ప్రభాస్ కథనాన్ని ఫ్లాట్ గా నడిపించాడు. ఎక్కడికక్కడ కాసేపు నవ్వుతాం కానీ అరె భలే మలుపు తిప్పాడే అనే భావన కలగదు. ఎమ్మెల్యే వార్నింగ్ ఇవ్వడానికి పిలిచి మెచ్చుకోవడం లాంటి వెయిట్ ఉన్న సన్నివేశాలు కూడా చప్పగా వచ్చాయి. కమర్షియల్ చిత్రంలాగా ఎలివేషన్లు అక్కర్లేదు కానీ కొన్ని వావ్ మూమెంట్స్ పడాల్సింది. క్లైమాక్స్ కు ముందు వచ్చే గోరెటి వెంకన్న పాటతో సహా అన్నీ జస్ట్ అలా వచ్చి వెళ్లిపోతాయి.
సుమంత్ ప్రభాస్ లో మంచి రైటర్ కం డైరెక్టర్ బాగున్నాడు కానీ అతనిలో నైపుణ్యాన్ని సరిగ్గా సానబెట్టుకుంటే బ్రహ్మాండమైన అవుట్ ఫుట్ ఇవ్వొచ్చు. అనుభవలేమి వల్లే సెకండ్ హాఫ్ ని డీల్ చేయడంలో తడబడ్డాడు. రైటింగ్ వీక్ అవ్వడం వల్లే కొన్నిచోట్ల షార్ట్ ఫిలిం తరహా మేకింగ్ అనిపిస్తుంది. బలమైన హుక్ పాయింట్ ఏదో ఒకటి లేనిదే ఇలాంటి లక్కీ గో కుర్రాళ్ళ కథలను అన్ని వర్గాలను మెప్పించేలా చెప్పలేం. సోషల్ ఇష్యూని తీసుకున్నాడు కానీ దాన్ని ప్రతిభావంతంగా ప్రెజెంట్ చేయడంలో కొంచెం నడక తప్పింది. అయితే దాదాపు టైం పాస్ కి ఢోకా లేకుండా మేమ్ ఫేమస్ తీవ్రంగా నిరాశపరిచే ప్రమాదాన్ని తప్పించుకుంది. ఇదే కాపాడాలి
నటీనటులు
సుమంత్ ప్రభాస్ లో యాక్టింగ్ మెటీరియల్ బాగానే ఉంది. జులాయిగా సరిగ్గా సరిపోయాడు. డెబ్యూతోనే సరిఫ్టికేట్ ఇవ్వలేం కానీ నటనతో ఆకట్టుకున్నాడు. స్నేహితులుగా మణి, మౌర్య న్యాచురల్ గా ఉన్నారు. హీరోయిన్లు సార్య లక్ష్మణ్, సిరి రాసిలు సహజంగా చేసి మెప్పించారు.అసలు పేరుతోనే నటించిన అంజి మామ టైమింగ్ తో బాగా నవ్వించాడు. మురళీధర్ గౌడ్ ది రెగ్యులర్ పాత్రే. స్కూల్ పిల్లాడు లిప్ స్టిక్ గా శివ నందన్ జోకులు పేలాయి. కెమెరామెన్ గా నరేంద్ర రవి, సర్పంచ్ గా కిరణ్ మచ్చ బాగా కుదిరారు. ట్రైనింగ్ ఇచ్చిన క్యాస్టింగ్ లా చేసుకుంటూ పోయారు. అచ్చం బలగం లాగే ఇందులోనూ ఎవరూ కొత్త మొహాలనిపించరు
సాంకేతిక వర్గం
కళ్యాణ్ నాయక్ సంగీతం ఫ్రెష్ గా ఉంది. పాటలు ఎక్కువైపోయాయి. వీటిలో రెండు మూడే బాగున్నప్పుడు ఇంత పెద్ద ఆల్బమ్ అవసరం లేదు . నేపధ్య సంగీతంలో మంచి సౌండ్ వినిపించాడు. మూడ్ కి తగ్గట్టు చక్కని స్కోర్ పడింది. శ్యామ్ దూపాటి ఛాయాగ్రహణం పల్లె అందాలను చక్కగా ఆవిష్కరించింది. సృజన అడుసుమిల్లి ఎడిటింగ్ లో కొంత లెన్త్ గురించి కంప్లయింట్ చేయక తప్పదు. సంభాషణలు యాసని మిస్ కాకుండా బాగున్నాయి. సింగల్ విలేజ్ లొకేషన్ కావడంతో ప్రొడక్షన్ పరంగా రిస్క్ లేదు. ఛాయ్ బిస్కెట్ లహరి సంస్థల జాయింట్ వెంచరే అయినా ఖర్చు పరంగా కొంత రాజీపడినట్టే అనిపిస్తుంది
ప్లస్ పాయింట్స్
సుమంత్ ప్రభాస్
నవ్వించే హాస్యం
నటీనటుల పెర్ఫార్మన్స్
ఫస్ట్ హాఫ్
మైనస్ పాయింట్స్
రెండో సగం
పాటలు ఎక్కువయ్యాయి
మిస్సయిన హుక్ పాయింట్
క్లైమాక్స్ భాగం
ఫినిషింగ్ టచ్ : సగమే ఫేమస్
రేటింగ్ : 2.5 / 5