సమీక్ష – ఉగ్రం

2.75/5

2 Hr 11 mins   |   Action   |   05-05-2023


Cast - Allari Naresh, Mirnaa Menon, Indraja and others

Director - Vijay Kanakamedala

Producer - Sahu Garapati & Harish Peddi

Banner - Shine Screens

Music - Sri Charan Pakala

అల్లరోడు అంటేనే ఒకప్పుడు వినోదానికి కేరాఫ్ అడ్రెస్. హాయిగా నవ్వుకోచ్చనే ఉద్దేశంతో జనం థియేటర్లకు వెళ్లి మరీ హిట్లు ఇచ్చేవారు. కానీ ఈ జానర్ క్రమంగా తాజాదనం కోల్పోవడంతో అల్లరి నరేష్ మెల్లగా సీరియస్ వైపు కొచ్చేశాడు. మహర్షితో మొదలుపెట్టి ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం దాకా నటన పరంగా స్కోప్ దక్కించుకోవడంతో పాటు చెప్పుకోదగ్గ విజయాలే సాధించాడు. అందుకే ఉగ్రం మీద మంచి బజ్ ఉంది. నాంది దర్శకుడు విజయ్ కనకమేడల కాంబినేషన్ కావడంతో హైప్ బాగుంది. మరి ఉగ్రరూపం మెప్పించిందా

కథ

నిజాయితీగా పని చేసే పోలీస్ ఆఫీసర్ శివకుమార్(అల్లరి నరేష్)కి భార్య అపర్ణ(మిర్నా మీనన్), కూతురు(ఊహ)ప్రాణం. అమ్మాయిలను ఏడిపించే రౌడీలకు బుద్ధిచెప్పే క్రమంలో వాళ్ళతో శత్రుత్వం పెంచుకున్న శివ ఆ కారణంగా యాక్సిడెంట్ కు గురవుతాడు. ఆ ప్రమాదంలో అపర్ణ, లక్కీ కిడ్నాప్ కు గురవుతారు.ఆసుపత్రిలో చేరాక గతమంతా మర్చిపోయిన ఇతని మీద నాలుగు మర్డర్ కేసులు నమోదవుతాయి. దాన్నుంచి బయట పడటంతో పాటు దీనికంతా కారణమైన ముఠాని వెతికే బాధ్యతను శివ తీసుకోవడమే అసలు స్టోరీ

విశ్లేషణ

దర్శకుడు విజయ్ కనకమేడల సమాజంలో బయటికి కనిపించని ఒక సీరియస్ ఇష్యూని క్రైమ్ థ్రిల్లర్ తో ముడిపెట్టి అల్లరి నరేష్ టాలెంట్ తో ఓ కొత్త అనుభూతినిచ్చే ప్రయత్నం చేశాడు. ఫస్ట్ హాఫ్ లో దానికి కావాల్సిన సెటప్ ని బలంగా రాసుకున్నాడు. శివ మనస్తత్వం, నేరస్థులను ట్రీట్ చేసే విధానం ఇవన్నీ కొత్తగా లేకపోయినా బాగున్న ఫీలింగ్ నే కలిగిస్తాయి. ఆకతాయిలకు జైలు శిక్ష వేయించాక జరిగే ఎపిసోడ్స్ ని మంచి ఇంటెన్స్ తో డిజైన్ చేసుకున్నాడు. ఇవన్నీ ఆడియన్స్ కి బాగా రిజిస్టరవుతాయి. అపర్ణ, లక్కీలు ఏమయ్యారనే సస్పెన్స్ ని పారలల్ గా నడిపిస్తునే మరోవైపు తర్వాత ఏం జరగబోతోందన్న ఉత్సుకతను పెంచుతాడు.

ఇక్కడ హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, పాట వగైరాలు రొటీన్ గానే సాగుతాయి. ఫస్ట్ షాట్ లోనే ప్రమాదం జరిగినట్టు చూపించారు. శివ అపర్ణలు పెద్దలను ఎదిరించి ఎలా పెళ్లి చేసుకున్నారని చెప్పేశాక వీలైనంతగా ఆ జంట తాలూకు ఎమోషన్లు అవసరం లేదు. ఇది కాసేపు పక్కనపెడితే మూడు ఉపకథలను రాసుకుని దాన్ని స్క్రీన్ ప్లే సహాయంతో ఇంటెన్స్ డ్రామాగా తీర్చిద్దిదే యత్నం బలంగా జరిగింది. అయితే దేనికవే సంబంధం లేకుండా సాగినా సన్నివేశాల్లోని డెప్త్ వల్ల లింకులు కుదిరి మెప్పిస్తాయి. ఉదాహరణకు అపర్ణను పెళ్లి చేసుకునే సీన్ ని వేరొకరితో మూడు ముళ్ళు వేయించకుండా కూడా చేయొచ్చు. కానీ కొత్తదనం కోసం మార్చారు.

విశ్రాంతి దాకా బాగానే ఉన్నా సెకండ్ హాఫ్ ఉగ్రంలో రౌద్రం ఎక్కువైపోయి థ్రిల్ ప్లస్ ఎమోషన్ తగ్గిపోయాయి. శివకు కోర్టు హౌస్ అరెస్ట్ విధించాక అతను ఇష్టం వచ్చినట్టు బయట తిరుగి విచారణ చేయడం ఓవర్ సినిమాటిక్ లిబర్టీ అనిపిస్తుంది. ఎంత పై అధికారి అయినా సరే హత్యలు చేసిన వాడిని డిపార్ట్ మెంట్ వాళ్ళు ఊరంతా తిప్పరు. ఇదంతా హీరో పాత్ర సౌకర్యం కోసం చూపించినట్టే ఉంది. జరిగింది తాత్కాలికంగా మర్చిపోయే జబ్బు సైతం గతంలో చాలా సినిమాల్లో చూసిందే కనక ఆ పాయింట్ పరంగా ప్రత్యేకత లేదు. అయితే ఒక్కో క్లూని విప్పుకుంటూ వెళ్లి హిజ్రాలతో ఫైట్ ద్వారా నిజాన్ని రాబట్టడం వగైరాల విజయ్ కనకమేడల బాగా హ్యాండిల్ చేశారు

ప్రీ క్లైమాక్స్ కు ముందు విలన్ డెన్, అతనెందుకు ఇదంతా చేస్తున్నాడనేది ఓపెనయ్యాక యశోద లాంటి ఇంకో వేరే సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ పాత్ర వేసిన నటుడు, చెప్పిన డబ్బింగ్, హాస్పిటల్ సెటప్ గట్రాలు గతంలో వచ్చినవే కావడంతో అదంతా కాస్త వేగంగా నడిపించాల్సింది. చివరి ఫైట్లో రక్తమోడుతున్న నరేష్ ని ఉగ్ర రూపంలో చూపించేందుకు పదే పదే విపరీతంగా హింసించడం, ఆ తర్వాత అతను కత్తితో కసాబిసా అందరినీ పొడిచేస్తూ వెళ్లడం ఇదంతా కమర్షియల్ ఫార్మట్. ఇంత అవసరం లేదనిపిస్తుంది. నిజానికి శివ పాత్ర ఒక్కో బ్లాక్ లో ఒక్కోలా ప్రవరిస్తుంది. ఒక్కోసారి దర్శకుడు సైతం కన్ఫ్యూజ్ అయిన వైనాన్ని క్యారెక్టరైజేషన్ లో గమనించొచ్చు

నాందితో పోలిస్తే మాత్రం ఉగ్రం అంత స్థాయిలో నిలబడకపోయినా అవుట్ ఫుట్ పరంగా మరీ నిరాశపరచకుండా సాగింది. టెంపో ప్రధానంగా సాగే ఇలాంటి ఇన్వెస్టిగేషన్ డ్రామాలో సెకండ్ హాఫ్ లు చాలా కీలకంగా నిలుస్తాయి. దీని మీద ఇంకొంచెం బలంగా ఫోకస్ పెట్టి ఉంటే ఉగ్రం రేంజ్ ఇంకా పెరిగి ఇంపాక్ట్ బలంగా ఉండేది. రెగ్యులర్ ఫార్ములాలకు దూరంగా ఏదో ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వాలని ప్రయత్నించే విజయ్ కనకమేడల లాంటి దర్శకులు అల్లరి నరేష్ లాంటి హీరోలు చేయూత నివ్వడం మెచ్చుకోవాల్సిన విషయమే. కొంత తడబాటు ఉన్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఉగ్రం డీసెంట్ అనిపించుకోవడంలో ఫెయిల్ కాలేదు

నటీనటులు

అల్లరి నరేష్ మరోసారి తనలో అసలైన నటుడిని బయటికి తెచ్చాడు. ఒకదశకు వచ్చాక ఇతను గతంలో స్పూఫ్ కామెడీలు చేసి నవ్వించాడన్న విషయమే మర్చిపోతాం. మిర్నా మీనన్ బాగుంది. మితంగా వాడుకున్నారు. చిన్న పాప ఊహ ఎక్స్ ప్రెషన్లు నటన క్యూట్ గా వచ్చాయి. శివ కొలీగ్ గా శత్రుకి మంచి స్కోప్ దక్కింది. సెటిల్డ్ గా చేశాడు. డాక్టర్ గా ఇంద్రజ జస్ట్ ఓకే. విలన్ పాత్రధారి రాంగ్ క్యాస్టింగ్. ఆప్షన్లు లేక మన దర్శకులు రాజీ మంత్రం పాటించడం వల్ల వచ్చిన ఇబ్బందిది. ఆశిష్ విద్యార్ధి, షియాజీ షిండే, అశుతోష్ రానా లాంటి వాళ్ళ కొరత కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. బారుడు గెడ్డం డబ్బింగ్ తో ఏదో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు

సాంకేతిక వర్గం

శ్రీచరణ్ పాకాల నేపధ్య సంగీతంతో ఆకట్టుకున్నాడు. థీమ్ లో ఉన్న ఘాడతని డిఫరెంట్ సౌండ్స్ ప్రెజెంట్ చేసిన తీరు అతని పనితనానికి నిదర్శనం. హిజ్రా ఎపిసోడ్ కి ఇచ్చిన స్కోర్ మంచి ఉదాహరణ. పాటలు గుర్తుండవు. సిద్దార్థ్ ఛాయాగ్రహణం బాగుంది. క్వాలిటీ కనిపిస్తుంది. చోటా కె ప్రసాద్ సీనియారిటీ సెకండ్ హాఫ్ విషయంలో కొంచెం కఠిన నిర్ణయాలు తీసుకుని ఉంటే ల్యాగ్ తగ్గేదేమో. అబ్బూరి రవి సంభాషణలు పర్వాలేదు. ఫైట్స్ నరేష్ కి సూటయ్యేలా కంపోజ్ చేసిన విధానం బాగుంది. షైన్ స్క్రీన్స్ నిర్మాణ విలువలు అడిగినంత మేర ఖర్చు పెట్టాయి

ప్లస్ పాయింట్స్

అల్లరి నరేష్
యాక్షన్ బ్లాక్స్
ఇంటర్వెల్ ఎపిసోడ్
బిజిఎం

మైనస్ పాయింట్స్

విలన్ బ్యాక్ గ్రౌండ్
సెకండ్ హాఫ్ ల్యాగ్
సృజనాత్మక స్వేచ్ఛ

ఫినిషింగ్ టచ్ : అల్లరోడి ఉగ్రావతారం

రేటింగ్ : 2.75 / 5