సమీక్ష – బలగం

2.75/5

2Hrs 11 Min   |   Drama   |   3 Mar, 2023


Cast - Priyadarshi, Kavya Kalyanram

Director - Venu

Producer - Harshith Reddy, Hanshitha Reddy

Banner - Dil Raju Productions

Music - Bheems Ceciroleo

చిన్న సినిమాలు చిన్న నిర్మాతలు తీసినప్పుడు వాటి మార్కెటింగ్ మొదలుపెట్టి రిలీజ్ చేసేదాకా సవాలక్ష సమస్యలు చుట్టుముడతాయి. అసలది వచ్చిందని తెలిసేలోగానే థియేటర్లలో నుంచి మాయమై ఉంటుంది. అలాంటివాటికి బడా ప్రొడ్యూసర్ల అండ ఉంటే సహజంగానే జనాల దృష్టి దాని మీద పడేలా పబ్లిసిటీ గట్రా చేస్తారు. బలగంకు ఇదే ప్లస్ అయ్యింది. తన పేరు మీద ఒక ఛోటా బ్యానర్ మొదలుపెట్టిన దిల్ రాజు లోకల్ మేడ్ మూవీస్ కాన్సెప్ట్ లో భాగంగా కమెడియన్ వేణుని దర్శకుడిగా పరిచయం చేశారు

తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో నివసించే కొమురయ్య(సుధాకర్ రెడ్డి)అందరికీ తల్లో నాలుకలా ఉండే మనిషి. హఠాత్తుగా ఓ రోజు కన్ను మూస్తాడు. ఇంకో రెండు రోజుల్లో మనవడు సాయిలు(ప్రియదర్శి)పెళ్లి ఉంటుంది. దాంతో వచ్చే కట్నంతోనే అప్పులు తీర్చుకుందామని ఎదురు చూస్తున్న అతనికి తాత మరణం అడ్డుగా నిలుస్తుంది. ఎప్పుడో ఇల్లు వదిలి వెళ్ళిపోయిన మేనత్త తన భర్త, కూతురు సంధ్య(కావ్య కళ్యాణ్ రామ్)తో కలిసి తండ్రి కడచూపు కోసం తిరిగి రావడంతో మళ్ళీ గొడవలు మొదలవుతాయి.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథల్లో చక్కని ఆత్మ ఉంటుంది. వాటిని సరైన రీతిలో ఒడిసిపట్టుకోవాలే కానీ నగర ప్రేక్షకులను కూడా మెప్పించవచ్చు. దర్శకుడు వేణు ఈ బలగంతో అదే ప్రయత్నం చేశారు. కన్నడ తిథిని స్ఫూర్తిగా తీసుకున్నామని ఎక్కడ చెప్పలేదు కానీ దాని ఛాయలైతే ఉన్నాయి. దాని సంగతలా ఉంచితే కుటుంబాల మధ్య ముఖ్యంగా రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువుల మధ్య ఎలాంటి అపార్థాలు గొడవలు ఉండకూడదని, అలా జరిగితే పెద్దవాళ్ళు చనిపోయాక వాళ్ళకు కట్టె కాలాక కూడా మనఃశాంతి ఉండదనేది బలగంలోని ప్రధాన ఉద్దేశం. దాన్ని వీలైనంత నిజాయితీగా ఎలాంటి కమర్షియల్ ఉచ్చులో ఇరికించకుండా చెప్పాడు వేణు.

మొదలైన పది నిమిషాల తర్వాత నుంచి మొదలుపెట్టి క్లైమాక్స్ దాకా వేణు చాలా బలమైన భావోద్వేగాలు దట్టించాడు. స్వచ్ఛమైన తెలంగాణ నేపధ్యాన్ని తీసుకుని అక్కడి యాసని, సంస్కృతిని, పద్దతులను గొప్పగా చూపించాడు. శవం ఉన్న ఇంట్లో మనుషుల మనస్తత్వాలు ఎలా మారతాయి, బ్రతికి ఉన్నప్పుడు ఒకలా పోయాక మరోలా రంగులు మార్చే వైనాన్ని వినోదాత్మకంగా చూపిస్తూనే ఆలోచింపజేశాడు. అలా అని కామెడీని ఎక్కడా ఓవర్ డోస్ చేయలేదు. స్వతహాగా హాస్య నటుడైన వేణు ఇంత సీరియస్ జానర్ ని ఎంచుకోవడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంత బరువైన హెవీ ఎమోషన్ ని తన నుంచి ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేరు.

కొమురయ్య చావు చుట్టూ ఈ ప్లాట్ ని అల్లుకున్నప్పుడు ఆ పాత్రను పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేశాక చంపేసి ఉంటే కనెక్టివిటీ ఇంకా పెరిగేది. ఆ క్యారెక్టర్ ఆడియన్స్ కి అలవాటవుతున్న క్రమంలో హఠాత్తుగా కన్నుమూయడంతో కాసేపు చూసేవాళ్ల మెదడు బ్లాంక్ అయిపోయింది. ఆ కారణంగానే చుట్టూ ఉన్న బంధువుల తాలూకు బాధ వెంటనే మన హృదయానికి చేరదు. కూతురు ఇంటికి వచ్చాక మొదలైన డ్రామాతో అందరితో ప్రయాణం చేయడం మొదలుపెడతాం. అయితే ఎంత సంప్రదాయమైనా సరే కొమురయ్య చనిపోయాక చూపించే సన్నివేశాలు అవసరానికి మించిన డీటెయిల్డ్ గా ఉండటం వల్ల కొంత క్రమం తప్పకుండా సాగతీత జరిగింది.

ఎంత సిన్సియర్ కాన్సెప్ట్ అయినా సరే సినిమాగా మలుస్తున్నప్పుడు డ్రామా అవసరం. కానీ వేణు దాని జోలికి ఎక్కువగా వెళ్ళలేదు. ఎట్టి పరిస్థితుల్లో పక్కదారి పట్టకూడదనే ఆలోచనతో ఒరిజినల్ ఫ్లేవర్ కే కట్టుబడ్డాడు. దీని వల్ల కొన్ని సీన్లు సీరియల్ తరహాలో తోస్తాయి. యుట్యూబ్ ఛానల్స్ వచ్చాక తెలంగాణా సంస్కృతి జానపద పాటలు, షార్ట్ ఫిలింస్, షార్ట్స్ రూపంలో విస్తృతంగా జనంలోకి వెళ్తోంది. అలాంటప్పుడు టికెట్ కొని థియేటర్ కొచ్చే జనాలకు అంతకు మించి ఏదో చూపించాలి. చూస్తున్నంత సేపు ప్రతి ఫ్రేమ్ లో సహజత్వం కొట్టొచ్చినట్టు తొణికిసలాడుతుంది. కానీ పూర్తి స్థాయిలో సినిమా చాలా బాగుందని చెప్పడానికి ఈ అంశం ఒకటే సరిపోలేదు.

మాములుగా మలయాళం తమిళంలో ఇలాంటి సినిమాలు సబ్ టైటిల్స్ తో చూసినప్పుడు ఆహా ఓహో అనుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతాం. తీరా మనదగ్గరికొచ్చేసరికి అబ్బే క్యాస్టింగ్ లేదనో లేదా మన ప్రాంతీయత కాదనో టికెట్లు కొనే ఔదార్యం చూపించం. అందుకే టీవీలో మెచ్చుకోలు తెచ్చుకునే ఇలాంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయలేకపోతాయి. బలగం దీనికి ఎదురీది విజేతగా నిలుస్తుందా లేదానేది చావు చుట్టూ అల్లుకున్న ఎమోషన్ ని థియేటర్ జనాలు ఎంత మేరకు రిసీవ్ చేసుకుంటారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. దాదాపు ప్రతి ఇంట్లో ఉన్న అపార్థాలే బలగంలో మెయిన్ పాయింట్ కావడం ప్లస్ కానుంది. అదే కాపాడాలి

ప్రియదర్శి లాంటి టాలెంటెడ్ నటుడు కథలో పరిమితుల వల్ల తన బెస్ట్ ఇవ్వడానికి సరిపడా స్కోప్ ఇందులో దక్కలేదు. తన రోల్ కీలకమే అయినప్పటికీ ఒకదశ దాటాక మిగిలిన పాత్రల డామినేషన్ వల్ల చాలాసేపు సైడ్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కావ్య కళ్యాణ్ రామ్ సింపుల్ గా ఉంది. ఆర్టిస్టులు చాలా బాగా కుదిరారు. జయరాం, మురళీధర్ గౌడ్, కృష్ణతేజ, రూప లక్ష్మి, విజయలక్ష్మి తదితరులంతా నటీనటుల్లా కాకుండా న్యాచురల్ గా అనిపించేలా చక్కగా నటించారు. సపోర్టింగ్ క్యాస్ట్ లో అనుభవం లేని వాళ్ళు ఉన్నా సరే అవుట్ ఫుట్ ని రాబట్టుకోవడంలో వేణు యెల్దండి ఫెయిల్ కాలేదు. ఎన్నిసార్లు రిహార్సల్ చేయించాడో కానీ ఆ కష్టం కనిపిస్తుంది

భీమ్స్ సిసిరోలియో సంగీతం ఈ బలగంకున్న ప్రధాన బలం. స్వతహాగా తనలో ఉండే నేటివిటీని పాటల కంపోజింగ్ లో చూపించడం వల్ల ఆడియోకు తెలంగాణలో ఖచ్చితంగా రిపీట్ వేల్యూ ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఎలాంటి హోరు లేకుండా నీట్ గా సాగింది. ఆచార్య వేణు ఛాయాగ్రహణం పల్లె అందాలను మనుషుల అమాయకత్వాన్ని చక్కగా ఆవిష్కరించింది. మధు ఎడిటింగ్ కొంత కత్తెరకు అవకాశం ఉన్నా వాడుకోలేదు. దీనివల్లే ఫస్ట్ హాఫ్ కథ ముందుకు సాగదు. సంభాషణలు బాగున్నాయి. నిర్మాణ విలువల విషయానికి వస్తే సింగల్ లొకేషన్ షూట్ కాబట్టి ఖర్చు గురించి ఆలోచించాల్సిన అవసరం పడలేదు. క్లీన్ అండ్ కూల్ గా ఉంది

ప్లస్ పాయింట్స్

తెలంగాణ నేటివిటీ
ఆర్టిస్టుల నటన
భావోద్వేగాలు
సంగీతం

మైనస్ పాయింట్స్

కొంత రిపీట్ సీన్స్
ప్రియదర్శి క్యారెక్టరైజేషన్
కొన్ని ఎమోషన్ల సాగతీత
కామెడీ స్కోప్ ని వాడుకోకపోవడం

ఫినిషింగ్ టచ్ : ఎమోషన్లే అసలు బలం

రేటింగ్ : 2.75 / 5