3/5
2 hr 37 Min | Political - Action Thriller | 05-10-2022
Cast - Chiranjeevi, Nayanthara, Sathya Dev, Murli Sharma, Sunil, Salman Khan & others
Director - Mohan Raja
Producer - RB Choudary, Ram Charan, Prasad NV
Banner - Super Good Films, Konidela Production Company
Music - S Thaman
సమర్థత వున్న దర్శకుడికి సరైన పాయింట్ వున్న కథ దొరికితే చాలు..మంచి సినిమా అందించగలడు. మలయాళ సినిమా లూసిఫర్ లో సరైన కథ వుంది. ఓ తండ్రి..కూతురు..అల్లుడు..కుటుంబ ఆప్యాయతకు నోచుకోని కొడుకు..వీళ్లందరి చుట్టూ నడిచే రాజకీయం. పదవి కోసం కుట్రలు..వ్యూహాలు..ప్రతి వ్యూహాలు. పక్కా నూరుశాతం కమర్షియల్ ఫార్మాట్ కథ. దీనిని మలయాళంలో ఓ డిఫరెంట్ కోణంలో తెరకెక్కించారు. కానీ అదే కథను దర్శకుడు మోహన్ రాజా పక్కా మాస్ స్టయిల్ లో చూసారు. మెగాస్టార్ కు కూడా అదే కోణం కావాలి. వెరసి అలా బయటకు వచ్చిన సినిమా గాడ్ ఫాదర్.
ఓ సిఎమ్ చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లు వున్నారు. వాళ్లని గ్రిప్ లో పెట్టుకన్న అల్లుడు వున్నాడు. వీళ్లు దూరం పెట్టినా, వాళ్లను గమనించే కొడుకు వున్నాడు. అధికారం కోసం అల్లుడి ఆరాటం. సాగనివ్వని కొడుకు పోరాటం. రాజకీయాలు..డబ్బులు..మాఫియా..ఎలివేషన్లు.. ఇదే సినిమా. దీంట్లో మధ్య ఫ్యామిలీ ఎమోషన్లు. ఇదీ గాడ్ ఫాదర్ కథ.
ఇలా మెగాస్టార్ కు సరిపడే ఓ టైలర్ మేడ్ సబ్జెక్ట్ దొరికితే అంతకన్నా ఏం కావాలి? దానికి మోహన్ రాజా లాంటి సరైన దర్శకుడు కుదరితే అంతకన్నా ఏం కావాలి? బలమైన మాస్ కమర్షియల్ సినిమా బయటకు వచ్చింది. హీరో తెరపై కనిపించినపుడల్లా ఎలివేషన్లు. విలన్..హీరో తలపడినపుడల్లా ఏదో ఒక చమక్కుతో హీరోదే పైచేయి కావడం, ఎక్కడో ఎవరికో చురుక్కున గుచ్చుకునేలా పవర్ పుల్ డైలాగులు. ఇంతకన్నా ఏం కావాలి ఫ్యాన్స్ కు..మాస్ కు.
గాడ్ ఫాదర్ సినిమా ను లూసిఫర్ తో పోల్చడానికి లేదు. ఎందుకంటే యధాతథంగా రీమేక్ చేస్తే ఎక్కడ బాగా చేసారు. ఎక్కడ బాగా చేయలేదు లాంటి లెక్కలు వుంటాయి. కేవలం సోల్ ను, కథలో కీలకమైన పాత్రలను, సంఘటనలను మాత్రం తీసుకుని, టేకింగ్ లో చాలా అంటే చాలా, కథలో కొంచెం అంటే కొంచెం మార్పులు చేసిన సినిమాను మాతృకతో పోల్చి చూడడానికి వీలు లేదు. గాడ్ ఫాదర్ సినిమా సిఎమ్ మరణంతో ప్రారంభం అవుతుంది. చిరంజీవి లాంటి మెగాస్టార్ సినిమాకు ఏ మేరకు భారీ తనం వుండాలో అంత భారీగానూ ప్రారంభమవుతుంది. సినిమాలో కీలకమైన విషయం అదే. సినిమాకు రిచ్ నెస్, భారీ తనం తీసుకురావడానికి ఎంత చేయాలో అంతా చేసారు. లోకేషన్లు కానీ, ఎంచుకున్న నటులు కానీ, సన్నివేశాల చిత్రీకరణ కానీ ఎక్కడా వెనక్కు తగ్గలేదు. చిన్న చిన్న పాత్రలకు కూడా నోటెడ్ ఫేస్ లు తీసుకోవడం వెనుక వైనం కూడా అదే.
సినిమా తొలిసగం ఎక్కడా తగ్గకుండా సాగిపోతుంది. దర్శకుడు ప్రతి ఫ్రేమ్ విషయంలో చాలా శ్రద్ద తీసుకున్నాడు. ఎక్కడా చుట్టేసిన ఫీలింగ్ కలుగదు. రాజీపడిన ఫీల్ కలుగదు. ఎంచి ఎంచి నటులను తెచ్చుకున్నట్లు, లోకేషన్లు ఎంచుకున్నట్లు కనిపిస్తుంది. దీనికి తోడు మెగాస్టార్ ఆహార్యం, నటన అంతా ఆయన వయసుకు తగినట్లు వుంటుంది. అది జనాలకు నచ్చుతుంది. గంభీరమైన నడక, చూపు, మాట అన్నీ కలిసి ఓ కొత్త మెగాస్టార్ ను చూపించినట్లయింది.
దీనికి తోడు నటించిన ప్రతి ఒక్కరి నుంచి దర్శకుడు పెర్ ఫెక్ట్ నటనను రాబట్టుకున్నాడు. దానికి తోడు తీసుకున్న లొకేషన్లు, వేసుకున్న సెట్ లు కూడా సినిమా బరువు, పరువు పెంచాయి. సినిమా తొలిసగం తరువాత మలిసగంలోకి ఎంటర్ అయిన తరువాత ఎక్కువగా ఎమోషన్ల మీద నడిచింది. అలాగే హీరోను జైలులో వుంచి, ఇతరుల మీద కథ నడిపించడం తరచు మురళీశర్మ, సత్యదేవ్ లు స్క్రీన్ మీదకు వచ్చినపుడు జనాలు కాస్త లో ఫీలయ్యారు. కానీ ప్రీక్లయిమాక్స్ దగ్గర నుంచి సినిమా పైకి లేచింది. క్లయిమాక్స్ లో ఫ్యాన్స్ కు నచ్చేలా పాట పెట్టడం కూడా ప్లస్ అయింది.
ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు కానీ ఎంత చెప్పుకున్నా తొలిసగం కన్నా మలిసగానికి మార్కులు తక్కువే పడతాయి. అంతే కాదు పొలిటికల్ థ్రిల్లర్ కావడంతో ఎక్కడా ఎంటర్ టైన్ మెంట్ కు చాన్స్ వుండదు. అది రిపీట్ ఆడియన్స్ విషయంలో కాస్త మైనస్ నే.
ఇలాంటి సినిమాలో మెగాస్టార్ తో సహా ప్రతి ఒక్కరూ బాగా చేసారు. విలన్ గా సత్య ఎలా చేస్తాడో అనుకుంటే అతగాడు కూడా బాగా చేసాడు. వాయిస్ అన్నది అతని విలనీకి ప్లస్ అయింది. టెక్నికల్ గా సినిమా చాలా గ్రాండ్ గా వుంది. మాంచి అవుట్ పుట్ వచ్చింది. థమన్ సినిమాకు ఎలాంటి బిజిఎమ్ కావాలో అలాంటి బిజిఎమ్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్, యాక్షన్ ఎపిసోడ్ లు అన్నీ పెర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాయి.
మొత్తం మీద సినిమా పాస్ అయింది.
ప్లస్ పాయింట్లు
మెగాస్టార్
తొలిసగం
బిజిఎమ్
డైరక్షన్
మైనస్ పాయింట్లు
మలిసగం
అక్కడక్కడ లాగ్
ఫినిషింగ్ టచ్: ‘గుడ్’ ఫాదర్
రేటింగ్: 3/5
Gulte Telugu Telugu Political and Movie News Updates