సమీక్ష – పొన్నియన్ సెల్వన్

2.5/5

167 Mins   |   Action   |   29-09-2022


Cast - Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, Prabhu, R. Sarathkumar, Vikram Prabhu, Jayaram, Prakash Raj, Rahman, R. Parthiban

Director - Mani Ratnam

Producer - Mani Ratnam, Subaskaran Allirajah

Banner - Madras Talkies. Lyca Productions

Music - A. R. Rahman

హిస్టరీ లెక్చరుంది..మిస్టరీ పిక్చరుంది దేనికో ఓటు చెప్పరా? అని అడిగిితే ఏ ఆడియన్స్ అయినా మొహమాటం లేకుండా సెకెండ్ ఆప్షన్ నే ఎంచుకుంటారు. ఎందుకంటే చరిత్ర పాఠాలు అందరికీ రుచించవు. జానపద సినిమాకూ, చారిత్రాత్మక సినిమాకు తేడా కేవలం ఫిక్షన్ కంటెంట్ మాత్రమే కాదు, ప్రాంతీయత, ప్రాచుర్యం కూడా. అందుకే గత కొన్నేళ్లుగా ఎన్ని చారిత్రాత్మక సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో వస్తున్నా, అన్ని ప్రాంతాల్లో విజయవంతం కావడం లేదు. అలాంటిది తెలుగువారికి పెద్దగా ఓ చారిత్రాత్మక కథను, పెద్దగా ఎలివేషన్లు, లో, హై వ్యవహారాలు లేకుండా తెరకెక్కిస్తే జనాలకు ఎలా రీచ్ అవుతుంది?

పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ వ్యవహారం అలాంటిదే. పూర్తిగా తమిళ ప్రాంతానికే పరిమితమైన చోళులు, పాండ్యుల చరిత్రలో ఒక భాగం తీసుకుని చేసిన సినిమా ఇది. ఎలాంటి సినిమాటిక్ వ్యవహారాలు లేని స్క్రిప్ట్. మనవారికి ఎలా నచ్చుతుంది. డాక్యుమెంటరీకి ఎక్కువ…కమర్షియల్ సినిమాకు తక్కువ అన్నట్లు వుంటుంది. ఒక చరిత్ర పుస్తకం చాప్టర్లు చాప్టర్లుగా చదువుకుంటూ వెళ్తే ఎలా వుంటుంది. అచ్చం అలా వుంటుంది.

పొన్నియన్ సెల్వన్ సినిమా దాదాపు పూర్తవుతోంది అనే సమయానికి కానీ కథ మీద ప్రేక్షకుడికి కొంతయినా గ్రిప్ రాదు. అలా గ్రిప్ రాకపోవడం వల్ల అప్పటి వరకు సినిమాను కళ్లు అప్పగించి చూడడం తప్ప, రసానుభూతి అన్నది కలుగదు. సినిమాలో మమేకం కాకుండా ఆస్వాదించడం ఎలా? అదే పిఎస్ 1 సమస్య.

క్లుప్తంగా కథేంటీ అంటే చోళరాజు సుందరపాండ్యన్ కు అస్వస్థత. ఇద్దరు కొడుకులు, ఒకడు శ్రీలంకలో బౌద్ధ బిక్షులతో చేరి ప్రశాంతంగా గడిపేస్తుంటే, మరొకడు రాజ్య విస్తరణ కాంక్షతో తన గడ్డకు దూరంగా సాగిపోతుంటాడు. ఇలాంటి నేపథ్యంలో రెండు కుట్రలు. ఒకటి సుందరపాండ్యన్ సోదరుడి కుమారుడిని గద్దెనెక్కించాలనే సామంతుల పన్నాగం. రెండవది చోళులను అంతం చేయాలనే పాండ్యుల పట్టుదల. వీటి నడుమ అనేకానేక సంఘటనలు. వీటికి తోడు సినిమా పూర్తయినా సస్సెన్స్ వీడని నందిని అనే బ్యూటీ విత్ బ్రెయిన్ క్యారెక్టర్ ఒకటి. సినిమా కథలో వున్న లేయర్ల ను క్లారిటీ గా చెప్పలేకపోవడం కథలో అసలు సమస్య.

నిజానికి మణిరత్నం అనుకుని వుంటే స్క్రిప్ట్ ను కాస్త తేలికగా తయారు చేసుకునే అవకాశం వుంది. కానీ ఆ దిశగా ఆయన ప్రయత్నించలేదు. ముఖ్యంగా ప్రారంభంలో ఇచ్చిన వాయిస్ ఓవర్ సరిగ్గా లేదు. క్లుప్తంగా వుంది. కథను సరైన రీతిలో ముందుగా పరిచయం చేసి వుంటే బాగుండేది. దానికి తోడు తమిళ పలుకుబడితో కూడా నామధేయాలు మనవారికి గుర్తుండడం కష్టం. అసలు ప్రారంభంలో ఇదిగో రాజు..ఈయన మంత్రి..ఇతగాడు సేనాధిపతి…ఈ ఇద్దరూ కలిసి ఈ విధంగా కుట్ర చేస్తున్నారు ఇలా కాస్తయినా స్క్రీప్ మీద సబ్ టైటిల్స్ గానైనా వేసి వుంటే కాస్త అర్థం అయ్యే అవకాశం వుంది.

సినిమాలో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే పాత్ర ఏదైనా వుందీ అంటే అది కార్తీ పాత్ర మాత్రమే. మిగిలిన పాత్రలు అన్నీ నర్మగర్భంగా మాట్లాడతాయి. మాట్లాడేది తెలుగే అయినా, అదేదో భాషలా వినిపిస్తుంది. అసలే కథ అర్థం కాదు. దానికి తోడు నర్మగర్బమైన మాటలు. ఇంకెలా సినిమాను ఫాలో కావడం. అటు అంత:పుర కుట్ర..ఇటు పాండ్యుల ఎత్తుగడలు..మరోపక్క ఇద్దరు అన్నదమ్ముల వ్యవహారాలు. ఇంకోపక్క వయసు మళ్లిన వాడిని ‘ఏదో’ ఎత్తుగడతో పెళ్లి చేసుకున్న నందిని అనే అమ్మాయి కథ. ఇవన్నీ కూడా పడుగుపేకల్లా కలిసిపోయి కన్ఫ్యూజ్ చేస్తాయి. దాంతో సినిమా జనాల మనసులకు ఎక్కదు.

అయితే సినిమాకు పాజిటివ్ సైడ్ ఏమీ లేవా అంటే వున్నాయి. మణిరత్నం స్టయిల్ టేకింగ్, అద్భతుమైన విజువల్స్, ఏ ఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం ఇవన్నీ సినిమాలో ఓ లెవెల్ లో వుంటాయి. కానీ ఎప్పడయితే కథ మనసుకు హత్తుకోదు..అర్థంకాదో, వీటిని ఆస్వాదించేంత సీన్ వుండదు. దాని వల్ల పన్నీరు తీసుకువచ్చి ఉప్పునీళ్లలో పోసినట్లే అయింది.

ఇదే సినిమాను ముందుగా కనీసం ఇదో జానపద కథ అన్నట్లుగా, మన వాళ్ల నోర్లు తిరిగే పేర్లు పెట్టి, నేరుగా కథ చెబితే కచ్చితంగా ఈ సాంకేతికత సాయంతో మంచి సినిమా అయివుండేది. కానీ మణిరత్నం ఆలోచన వేరు..కోరిక వేరు. తమిళ సాంస్కృతిక చరిత్రతో చోళలది, పాండ్యులది విడదీయలేని బంధం..వారి మధ్య చెరపలేని వైరం. ఈ వైరాన్నే తెరపైకి తేవాలనుకున్నారు. తెచ్చారు. అంతే..ఇంక ఎలా వుందీ అన్నది మణిరత్నం ఆలోచనల్లోకి రాకపోవచ్చు.

మూడు గంటల సినిమా చూసే ఓపిక..చోళుల..పాండ్యుల కాలమాన పరిస్థితులు, వ్యవహారాలు తెలుసుకోవాలనే జిజ్ఙాస వుంటెే పిఎస్ 1 చూడొచ్చు. లేదూ అంటే ఓటిటి కోసం వేచి వుండొచ్చు.

ప్లస్ పాయింట్లు

విజువల్స్

నేపథ్యసంగీతం

కార్తీ

..

మైనస్ పాయింట్లు

పరిచయం లేని కథ

స్క్రిప్ట్

..

ఫినిషింగ్ టచ్: చరిత్ర పాఠం

Rating: 2.5/5