సమీక్ష – మజాకా

2.5/5

02 Hrs 30 Mins   |   Rom-Com   |   26-02-2025


Cast - Sundeep Kishan, Rao Ramesh, Ritu Varma, Anshu Ambani, Murali Sharma, Hyper Aadi, Raghu Babu, Ajay, Srinivasa Reddy, Chammak Chandra and others

Director - Trinadha Rao Nakkina

Producer - Rajesh Danda & Umesh Kumar Bansal

Banner - Hasya Movies, AK Entertainments & ZEE Studios

Music - Leon James

మాస్ మహారాజా రవితేజ ధమాకాతో బాక్సాఫీస్ వద్ద నవ్వులు పూయించిన దర్శకుడు త్రినాథరావు నక్కిన కొంచెం గ్యాప్ తీసుకుని చేసిన సినిమా మజాకా. ఇది ముందు చిరంజీవి ఒప్పుకున్న సబ్జెక్టనే ప్రచారాన్ని టీమ్ సమర్ధించిన నేపథ్యంలో దీని మీద అంచనాలు బాగానే నెలకొన్నాయి. ఊరిపేరు భైరవకోనతో తిరిగి ట్రాక్ లో పడ్డ సందీప్ కిషన్ ఈసారి పూర్తి కామెడీ జానర్ కు ఓటేశాడు. తండేల్ ఊపు తర్వాత కాస్త డల్లుగా మారిపోయిన థియేటర్లకు మంచి జోష్ ఇస్తుందనే నమ్మకం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుందా.

కథ

వైజాగ్ వీసా కన్సల్టెన్సీలో పని చేసే రమణ (రావు రమేష్) భార్య తొలి పురుడు కాగానే చనిపోయినా కొడుకు కృష్ణ (సందీప్ కిషన్) కి అంతా తానై పెంచుతాడు. బిడ్డకు సంబంధాలు చూస్తున్న క్రమంలో ఇద్దరు మగాళ్ళుండే ఇంటికి పిల్లను ఇచ్చేందుకు ఎవరూ రాకపోవడంతో లేట్ ఏజ్ అయినా ముందు తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని యశోద (అన్షు) చూసి ఇష్టపడతాడు. ఈలోగా కృష్ణ కూడా కాలేజీలో మీరా (రీతూ వర్మ) ని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. వీళ్ళ నలుగురి మధ్యలోకి మీరా తండ్రి భార్గవ్ వర్మ (మురళి శర్మ) ప్రవేశంతో కొత్త మలుపులు చోటు చేసుకుంటాయి. షాకింగ్ విషయం బయటపడుతుంది. అదేంటనేది తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ

కామెడీ కథలను హ్యాండిల్ చేయడం ఆషామాషీ కాదు. ముఖ్యంగా ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులను నవ్వించాలంటే మాములు జోకులు సరిపోవు. దర్శకుడు త్రినాథరావు, రచయిత ప్రసన్నకుమార్ కు ఈ వాస్తవం బాగా తెలుసు. అందుకే పాయింట్ పరంగా కొత్తదనం లేకపోయినా ట్రీట్ మెంట్ లో ఫన్ ఉండేలా చూసుకుని టైం పాస్ కి ఢోకా లేకుండా మేనేజ్ చేస్తారు. కాసింత బిగ్గరగా అనిపించే హాస్యం మీద ఆధారపడినా రెండు మూడు హిలేరియస్ ఎపిసోడ్లతో పనయ్యేలా పాసైపోతారు. అది రాజ్ తరుణ్ అయినా నాని అయినా వీళ్ళ శైలిలో ఎలాంటి మార్పు ఉండదు. కాకపోతే పాటలు, గ్లామర్లు సరిగ్గా కుదరాలి అంతే. మజాకాలోనూ ఇదే ఫాలో కావాలని చూశారు.

తండ్రికి పెళ్లి చేయాలని తాపత్రయపడే కొడుకులను గతంలో చూశాం. మా నాన్నకు పెళ్లిలో శ్రీకాంత్, అందరివాడులో చిరంజీవి ఇలాంటి పాత్రల్లోనే కనిపించారు. వాటిలోనూ ఎంటర్ టైన్మెంట్ ఉన్నా అసలు పాయింట్ కి సీరియస్ టచ్ ఉంటుంది. కానీ మజాకాలో అలా వెళ్లకుండా ముందు హాస్యాన్ని పండించడమే లక్ష్యంగా పెట్టుకుని సీన్లు రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా అదే ఫ్లోలో కాలక్షేపానికి పనికొస్తుంది. మరీ గొప్పగా లేకపోయినా విసిగించకుండా ఇంటర్వెల్ దాకా లాగించారు. రమణ ఏజ్ బార్ లవ్ స్టోరీ కాసేపు ముచ్చటేసేలా ఉన్నా కాసేపయ్యాక కొంత చిరాకూ కలిగిస్తుంది. విశ్రాంతి దగ్గర అన్ని పాత్రలు కలుసుకునే ఎపిసోడ్ దాకా బండి బాగానే నడిచింది.

అసలైన సమస్య సెకండాఫ్ లో మొదలవుతుంది. యశోద, మీరాల మధ్య కాంఫ్లిక్ట్ ఏంటో చెప్పేశాక మళ్ళీ దాని గురించి రమణ, కృష్ణలు పదే పదే హీరోయిన్ల వెంటపడి అడగడం రిపిటీషన్ కు దారి తీసింది. ఇన్ని సంవత్సరాలు ఎందుకు పెళ్లి చేసుకోలేదనే అన్షు వెర్షన్ అంత కన్విన్సింగ్ గా అనిపించదు. ఏదో మొక్కుబడిగా మనసంతా నువ్వే చైల్డ్ ఎపిసోడ్ తీసుకుని తిరిగి రాశారు తప్పించి ఆమె వైపు చెప్పించిన ఫ్లాష్ బ్యాక్ ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. ఎమోషన్ ని క్లైమాక్స్ కోసం దాచిపెట్టి అప్పటిదాకా ఎలాంటి భావోద్వేగాలకు చోటివ్వకుండా కేవలం నవ్వుల మీద ఆధారపడటం మజాకాని గజిబిజిగా మార్చేసింది. లాజిక్స్ గురించి ఆలోచించే టైం ఇచ్చింది.

క్యారెక్టర్ల మధ్య సంఘర్షణ బలంగా ఉన్నప్పుడే ప్రేక్షకులకు త్వరగా కనెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకే ఇంట్లో ఉన్న మేనత్త, కోడలు శత్రువుల్లా అసలు మాట్లాడుకోకపోవడానికి చూపించిన కారణం సైతం టీవీ సీరియల్ తరహాలో ఉండటంతో ఈ ప్రహసనమంతా అవసరమా అనిపించేలా ఉంటుంది. పెళ్లిలో హైపర్ ఆదిని చితకబాదే సీన్, చావు దగ్గర రావు రమేష్ చేసే కామెడీ సోసోగానే అనిపిస్తాయి తప్పించి చక్కిలిగింతలు పెట్టవు. పోలీస్ స్టేషన్ లో అజయ్ కి అతని భార్యకి మధ్య ఫోన్ సంభాషణ సైతం ఇదే బాపతు. కాకపోతే చివర్లో రావు రమేష్ రీతూ వర్మల మధ్య చూపించిన బాండింగ్, అన్షు కోసం సందీప్ కిషన్ చేసే ఫైట్ కొంత వర్గానికి కనెక్టయ్యేలా ఉంది.

మజాకా లాంటి ఫన్ మూవీస్ కి రెండు అంశాలు బలంగా ఉండాలి. మొదటిది పాటలు. ధమాకాకు అవే ప్రాణంగా నిలిచాయి. ఇప్పుడు కూడా భీమ్స్ ని రిపీట్ చేసి ఉంటే బాగుండేదననిపిస్తుంది. రెండో పాయింట్ హీరోయిన్. శ్రీలీల గ్లామర్, డాన్సులు రవితేజకి పోటీ ఇవ్వబట్టే మాస్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ రీతువర్మలో అంత వెయిట్ లేదు. నటించడం వరకు ఓకే కానీ నృత్యం, చలాకీతనంలో తను ఇప్పటి ట్రెండ్ లో లేదు. ద్వందార్థాలు లేకుండా జాగ్రత్త పడిన వైనం మెచ్చుకోదగినదే కానీ కథా కథనాల మీద మరింత దృష్టి పెట్టి ఉంటే ఇంకా మెరుగైన ఫలితం దక్కేది. ఎలా ఉన్నా చికాకు రాకుండా చాలనుకుంటే వాళ్లకు మజాకా బ్యాడ్ ఆప్షన్ అయితే కాదు.

నటీనటులు

సందీప్ కిషన్ బాగున్నాడు. బాగా నటించాడు. సీనియర్ ఆర్టిస్టుతో పోటీ పడుతూ నిలవడం కొంచెం కష్టం. అందులో పాసయ్యాడు. బరువైన, ఛాలెంజింగ్ అనిపించే స్కోప్ తక్కువగా ఉన్నా ఉన్నంతలో నిరాశపరచలేదు. మారుతీనగర్ సుబ్రహ్మణ్యంతో హీరోగా మారిపోయిన రావు రమేష్ ఇంకా అదే హ్యాంగోవర్ లో ఉన్నారు కాబోలు జోష్ ఏ మాత్రం తగ్గకుండా రమణగా ఏకంగా డాన్సులు కూడా చేశారు. వయసుని కవర్ చేసుకుంటూ వృద్ధ ప్రేమికుడిగా పడిన పాట్లు బాగున్నాయి. కొన్నిచోట్ల కాస్త శృతి మించినట్టు అనిపించినా క్యారెక్టర్ డిమాండ్ కాబట్టి తప్పనుకోవడానికి లేదు. సందీప్ కిషన్ తో కెమిస్ట్రీ పండింది. మజాకాలో ప్రధాన బలం వీళిద్దరే.

హీరోయిన్ రీతువర్మ జస్ట్ ఓకే. ముందే చెప్పినట్టు గ్రేస్, స్పీడ్ డిమాండ్ చేసే ఇలాంటి మీరా పాత్రలకు ఇంకా బెటర్ ఛాయస్ చూసుండాల్సింది. అన్షు మరీ పీలగా ఉంది. మన్మథుడు వింటేజ్ ఫ్యాన్స్ కు ఏమనిపిస్తుందో కానీ మేకప్ కు దూరమై దశాబ్దాలు గడిచిపోవడంతో నటన కూడా అంతగా అనిపించదు. డబ్బింగ్ గంభీరంగా చెప్పించి మేనేజ్ చేశారు. మురళీశర్మ వెరైటీ విలనీ బానే ఉన్నా సరైన రీతిలో వాడుకోలేదు. శ్రీనివాస రెడ్డి, అజయ్, రఘుబాబు రొటీనే. హైపర్ ఆది పంచ్ మేజిక్ పెద్దగా పని చేయలేదు.

సాంకేతిక వర్గం

లియోన్ జేమ్స్ సంగీతంలో మెరుపుల్లేవ్. పాటలు అంతంతమాత్రంగానే అనిపిస్తాయి. మాస్ కోసం ఉద్దేశించిన రెండు సాంగ్స్ లో కొరియోగ్రఫీ మాములుగా ఉండటం వాటి రీచ్ తగ్గించేసింది. లైవ్ గా షూట్ చేసిన రావులమ్మకు లొకేషన్ కూడా మైనస్సే. నిజార్ షఫీ ఛాయాగ్రహణం చక్కగానే సాగింది. ఉన్న బడ్జెట్ పరిమితులను తట్టుకుని క్వాలిటీ ఇచ్చింది. ఎక్కువ శాతం రావు రమేష్, మురళి శర్మ ఇళ్లలోనే జరిగినా ఆ ఫీలింగ్ రాకుండా మేనేజ్ చేసిన విధానం బాగుంది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ గురించి ఏదైనా కామెంట్ వస్తే అది సెకండాఫ్ గురించే. హాస్య, ఏకె, జీ నిర్మాణ విలువలు పర్లేదు. మరీ ఓవర్ బడ్జెట్ కాకుండా కంట్రోల్డ్ గా ఖర్చు పెట్టిన వైనం స్పష్టం.

ప్లస్ పాయింట్స్

సందీప్ కిషన్ – రావు రమేష్ కాంబో
కొంత ఫస్ట్ హాఫ్ కామెడీ
ద్వందార్థాలు లేకపోవడం

మైనస్ పాయింట్స్

తగ్గిన హాస్యంపాళ్ళు
సెకండాఫ్ సాగతీత
రిపీట్ సన్నివేశాలు
కన్విన్సింగ్ లేని క్యారెక్టరైజేషన్లు
బలం లేని సంగీతం

ఫినిషింగ్ టచ్ : ఓ మోస్తరు మజా

రేటింగ్ : 2.5 / 5