అర్ధరాత్రి షోలు : మార్పుకు మొదటి అడుగు

దేవర అర్థరాత్రి ప్రీమియర్లకు రంగం సిద్ధమయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున స్పెషల్ ఫ్యాన్స్ షోలకు ఏర్పాట్లు జరిగిపోయాయి. టికెట్ల డిమాండ్ చూస్తుంటే మతులు పోవడం ఒకటే తక్కువ. వెయ్యి నుంచి అయిదు వేల రూపాయలకు పైమాటే ధర పలుకుతున్నా కొనడానికి అభిమానులు ముందుకొస్తున్నారు. చూస్తుంటే ఇవాళ రాత్రికి చీకటి ఉండదనే రేంజ్ లో ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్ మధ్య విభేదాల కారణంగా కూకట్ పల్లి భ్రమరాంబ కాంప్లెక్స్ లో ఒంటి గంట షోలు క్యాన్సిల్ కావడం లాంటి పరిణామాలు తలెత్తినప్పటికీ క్రేజ్ కొచ్చిన ఇబ్బందేం లేదు.

ఇక ఏపీ, తెలంగాణతో పాటు బెంగళూరు లాంటి ఇతర రాష్ట్రాల నగరాల్లో మిడ్ నైట్ హంగామా ఓ రేంజ్ లో ఉండబోతోంది. చాలా ఏళ్లుగా ఉదయం నాలుగు లేదా అయిదు తప్ప అంతకన్నా ముందు ఏ ప్యాన్ ఇండియా సినిమాకూ అర్ధరాత్రి ప్రీమియర్లు పడలేదు. ముఖ్యంగా వైసిపి పాలన కొనసాగిన అయిదేళ్ళూ షోల సంగతి దేవుడెరుగు టికెట్ రేట్ల హైక్ కోసమే నిర్మాతలు చుక్కలు చూడాల్సి వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్ల వెతలు చెప్పనక్కర్లేదు. ఇప్పుడా సమస్య లేదు. శుభ్రంగా అన్ని అనుమతులు వచ్చేశాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా చొరవ తీసుకోవడంతో పర్మిషన్లకు అడ్డంకులు కలగవు.

ఈ మార్పుకి దేవర కేవలం ప్రారంభం మాత్రమే. ఇకపై రాబోయే ప్రతి స్టార్ హీరో సినిమాకు ఇదే పద్ధతి వర్తిస్తుందని చెప్పడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. గేమ్ ఛేంజర్, పుష్ప 2, విశ్వంభర, బాలయ్య 109 తదితర భారీ చిత్రాలన్నీ ఎలాంటి చిక్కులు లేకుండా హైక్స్, అదనపు షోలు వేసుకుంటాయి. కల్కితోనే ఇది జరగాల్సింది కానీ కొత్త ప్రభుత్వం కుదురుకోవడానికి కొంత సమయం పట్టడం వల్ల దానికిచ్చిన పెంపు కొంత తక్కువేనని చెప్పాలి. ఇప్పుడు దేవరతో కీలక మార్పులు జరిగిపోయాయి కనక మిగిలినవాళ్లకు మంచి దారి దొరికినట్టయ్యింది. దానికి తగ్గట్టే గ్రాస్ నెంబర్స్ ఘనంగా ఉండబోతున్నాయి.