భారతీయుడు 2 విడుదల సందర్భంగా తమిళ మీడియాలో దర్శకుడు శంకర్ ఇస్తున్న ఎలివేషన్లు ఇక్కడ మెగా ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్నాయి. అలా అని ఆయన కమల్ హాసన్ గురించి చెప్పడం కాదు. ప్రత్యేకంగా గేమ్ ఛేంజర్ ప్రస్తావవ వచ్చినప్పుడు పంచుకుంటున్న విశేషాల గురించి. రెండు మూడు సందర్భాల్లో ఆయన అన్న మాటలు అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. పెద్ద హీరోల మాస్ తెలుగు సినిమాలు బాగా ఇష్టపడే తాను అలాంటి కథకు తనదైన ట్రీట్ మెంట్ ఇచ్చి గేమ్ ఛేంజర్ తీశానని చెప్పడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి.
ఇదొక్కటే కాదు హీరో రామ్ చరణ్, విలన్ ఎస్జె సూర్యల మధ్య క్లాష్ కు సంబంధించిన ఎపిసోడ్లు, సన్నివేశాలు రాస్తున్నప్పుడు రచయిత కార్తీక్ సుబ్బరాజ్ తో కలిసి బాగా ఎంజాయ్ చేశానని, తెరమీద చూస్తున్నప్పుడు చాల థ్రిల్ ఇస్తాయని పేర్కొనడం ఆసక్తిని పెంచుతోంది. నిజానికి భారతీయుడు 2 హైదరాబాద్ ప్రమోషన్లలో గేమ్ ఛేంజర్ కు సంబంధించిన ఏ ప్రశ్న వచ్చినా శంకర్ ముక్తసరిగా సమాధానం ఇచ్చి ఇది కాదు సందర్భం అన్న తరహాలో స్పందించారు. కానీ కోలీవుడ్ లో చేస్తున్న పబ్లిసిటీలో మాత్రం గేమ్ ఛేంజర్ విశేషాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
విడుదల తేదీ ఇంకా నిర్ధారణ కాకపోయినా తన భాగం వరకు షూటింగ్ పూర్తి చేశాడు రామ్ చరణ్. ఫైనల్ కాపీ కాకుండా రిలీజ్ డేట్ లాక్ చేయలేమని చెబుతున్న శంకర్ ఎప్పుడనేది మాత్రం చెప్పలేకపోతున్నారు. నిర్మాత దిల్ రాజు మనసులో అక్టోబర్ ఉన్నప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. డిసెంబర్ మాత్రమే ఆప్షన్ గా కనిపిస్తోంది. జనవరిలో ఎలాగూ చిరంజీవి విశ్వంభర, దిల్ రాజునే నిర్మిస్తున్న వెంకటేష్ సినిమా ఉన్నాయి కాబట్టి ఈ ఏడాదే రావాలంటే ఆ నెల తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తేలాలంటే ఇంకొంత వేచి చూడాల్సిందే.