రెండో భారతీయుడు ఇది మిస్సయ్యాడు

లోకనాయకుడు కమల్ హాసన్ భారతీయుడు 2 విడుదల రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. ఎల్లుండి రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరిగినట్టు అనిపిస్తున్నా కనీసం మూడు రోజుల ముందు నుంచి తెలుగు వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టకపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. సెన్సార్ ఆలస్యమో లేక ఇంకేదైనా కారణమో ఏమో కానీ అసలే బజ్ తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి పరిణామాలు టెన్షన్ కలిగించేవే. కమల్ హాసన్ ఎడతెరిపి లేకుండా హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లలో భాగమైన సంగతి తెలిసిందే. శంకర్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.

అలాంటప్పుడు బుకింగ్స్, పబ్లిసిటీ విషయంలో ఇంకొంచెం జాగ్రత్త వహించాల్సింది. పంపిణి చేస్తున్న సురేష్ ఆసియన్ లాంటి బడా డిస్ట్రిబ్యూటర్ల ఆధ్వర్యంలో ఇలా జరగడం అనూహ్యమే. నిజానికి భారతీయుడు 2కి బాక్సాఫీస్ వద్ద మంచి ఛాన్స్ ఉంది. చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు ఏ భాషలో లేవు. హిందీలో మాత్రమే ఆకాశమే నీ హద్దురా రీమేక్ సర్ఫిరా ఉంది. ఇది దక్షిణాది రాష్ట్రాల్లో వర్కౌట్ అయ్యేది కాదు. కాబట్టి కమల్ కి సోలో అడ్వాంటేజ్ దక్కనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటకలో ఆల్రెడీ టికెట్ అమ్మకాలు ఆన్ లైన్ లో జరుగుతూ ఉండగా ఇక్కడ మాత్రం మొదలేపెట్టకపోవడం ట్విస్టు.

ఇంకో గంటా రెండు గంటల్లో బుక్ మై షో, పేటిఎంలో పెట్టేస్తారు కానీ ముందస్తు ప్లానింగ్ కొంత లోపించడం అయితే కనిపిస్తోంది. 1996 బ్లాక్ బస్టర్ కి కొనసాగింపుగా వస్తున్న భారతీయుడు 2కి వచ్చే స్పందనను బట్టే మూడో భాగానికి బజ్ ఏర్పడుతుంది. ఎలాగూ దాని షూటింగ్ పూర్తయిపోయింది. సీక్వెల్ హిట్ అయితే సహజంగానే థర్డ్ పార్ట్ కి క్రేజ్ వస్తుంది. ఇది చాలా కీలకం. అవుట్ డోర్ పబ్లిసిటీ, పోస్టర్లు, హోర్డింగులు వగైరాలు ఇంకొంచెం అగ్రెసివ్ గా ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. ఏది ఎలా ఉన్నా కమల్ హాసన్ సినిమా కాబట్టి ఓపెనింగ్స్ పరంగా తెలుగులో బాగానే మొదలవ్వొచ్చు.