ఇండియ‌న్-2లో రెహ‌మాన్ ఎందుకు లేడంటే?

త‌మిళ లెజెండ‌రీ డైరెక్ట‌ర్ శంక‌ర్ సినిమా అంటే సంగీత ద‌ర్శ‌కుడిగా ఏఆర్ రెహ‌మాన్ ఉండాల్సిందే. త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో అప‌రిచితుడు, స్నేహితుడు చిత్రాల‌కు మాత్ర‌మే రెహ‌మాన్ శిష్యుడైన హారిస్ జైరాజ్‌తో సంగీతం చేయించుకున్నాడు కానీ.. మిగ‌తా అన్ని చిత్రాల‌కూ రెహ‌మాన్‌తోనే జ‌ట్టు క‌ట్టాడు శంక‌ర్. కానీ ఇండియ‌న్-2 సినిమాకు మాత్రం రెహ‌మాన్ కాకుండా, హారిస్‌నూ తీసుకోకుండా అనిరుధ్‌తో ప‌ని చేశాడు.

ఇండియ‌న్ సినిమాకు రెహ‌మాన్ సంగీతం ఎంత పెద్ద ప్ల‌స్సో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. అనిరుధ్‌కు కూడా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్న‌ప్ప‌టికీ.. రెహ‌మాన్‌తోనే ఇండియ‌న్-2కు సంగీతం ఇప్పించి ఉండాల్సింద‌నే అభిప్రాయం ఉంది. ఐతే ఈ మార్పుకు కార‌ణ‌మేంటో ఒక ఇంట‌ర్వ్యూలో శంక‌ర్ వెల్ల‌డించాడు.

“నేను 2.0 చేస్తున్న‌పుడే ఇండియ‌న్-2 ప‌నులు మొద‌ల‌య్యాయి. క‌మ‌ల్ స‌ర్ డేట్లు కూడా కేటాయించేశారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమాను మొద‌లుపెట్టాల్సిన ఉంది. అప్పుడు రెహ‌మాన్ 2.0 బ్యాగ్రౌండ్ స్కోర్ ప‌నుల్లో త‌ల‌మున‌క‌లై ఉన్నాడు. ఇండియ‌న్-2కు సంగీత చ‌ర్చలు మొద‌లుపెట్టే అవ‌కాశ‌మే లేదు. రెహ‌మాన్‌కు వేరే క‌మిట్మెంట్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ త‌రంలో నాకెంతో న‌చ్చిన సంగీత ద‌ర్శ‌కుల్లో ఒక‌డైన అనిరుధ్‌ను ఎంచుకున్నాను. 2.0 లాంటి కాంప్లెక్స్ మూవీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డ్డ రెహ‌మాన్.. ఆ స‌మ‌యంలో ఇండియ‌న్-2కు పాటుల చేయ‌డం క‌ష్ట‌మ‌నిపించింది. అందుకే వేరే ఛాయిస్ తీసుకున్నా. నాకు యువ‌న్ శంక‌ర్ రాజా, సంతోష్ నారాయ‌ణ‌న్, హారిస్ జైరాజ్‌ల సంగీతం అన్నా చాలా ఇష్టం” అని శంక‌ర్ తెలిపాడు.

రెహ‌మాన్ ఇండియ‌న్-2కు ప‌ని చేయ‌క‌పోయినా ఈ సినిమా ఆడియో లాంచ్‌లో అనిరుధ్ స‌హా అంద‌రూ అత‌ణ్ని గౌర‌వించారు. ఇండియ‌న్-2 ఈ నెల 12న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే.